మామిడి.. మాగాణి!

24 Aug, 2014 23:27 IST|Sakshi
మామిడి.. మాగాణి!

కరువు సీమలో కొత్తదారి
మామిడిలో అంతర పంటగా డ్రిప్ ద్వారా వరి సాగు
అరెకరానికి సరిపోయే సాగు నీటితో రెండెకరాల్లోసాగు

అది రాయలసీమ.. అందులోనూ కరువు ముంచుకొచ్చి వర్షాకాలంలో వాతావరణం ఎండాకాలం మాదిరిగా తయారైంది.. అయినా మడమ తిప్పని వీరులు అన్నదాతలు. సంక్షోభం పడగెత్తినా చెమటోడ్చి పంటలు పండించే దారులను రైతులు నిరంతరం వెతుకుతూనే ఉంటారు. అవసరం తోసుకొచ్చినప్పుడే ధైర్యంగా నిలబడి.. ఆలోచనకు పదునుపెట్టి పరిష్కార మార్గాన్ని  కనిపెట్టాలి. చిత్తూరు జిల్లాలో కొందరు అభ్యుదయ రైతులు ఇదే పని చేస్తున్నారు. మామిడి తోటలో డ్రిప్  ద్వారా వరిని సాగు చేస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
 

భారతీయుల రోజువారీ ఆహారంలో అన్నం ముఖ్యమైనది. ఆ మాటకొస్తే ఆసియా ఖండంలోనే వరి ప్రధానమైన ఆహార పంట. వరి మెతుకులు ఉడకని పొయ్యి ఒకటి కూడా లేని పరిస్థితి. మెతుకు ఉడకాలంటే మేఘం కురవాలి.   ఐరావతానికి ఆకలెక్కువ.. వరి పంటకు దాహమెక్కువ అంటారు పెద్దలు. భూగర్భ జలాలు అడుగంటి పోతూ కాలాలు తారుమారవుతున్న పరిస్థితిలో మిన్ను కురిసేది.. మన్ను పండేదీ అంతుపట్టని అయోమయంగా మారింది రైతుకు. కిలో ముడి ధాన్యం పండి చేతికి రావాలంటే 2,672 లీటర్ల నీరు ఖర్చవుతోందని అంచనా. వరి నీటి మొక్క కానప్పటికీ పొలంలో వచ్చే కలుపును అదుపులో ఉంచడానికి నిలువ నీటిలో సాగు చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య రైతాంగం ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడ్లు ఎదబెట్టి సాగు చేయడం, ఆరుతడి పంటగా నాట్లు వేయడం కూడా కొనసాగుతోంది. అయితే, సాగు నీటికి కటకటగా ఉంటున్నందున మామూలుగా నీరు పారించే సాగు విధానం రైతుకు బ్రహ్మ ప్రళయమౌతోంది. ఈ పరిస్థితిని అధిగమించ డానికి సూక్ష్మ నీటిపారుదల పద్ధతిని కూడా కొందరు రైతులు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్నారు.

సగటు వర్షపాతం అతి తక్కువగా ఉండే రాయలసీమలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని పలువురు రైతులు డ్రిప్పు ద్వారా వరి పంటను విజయవంతంగా సాగుచేసి సత్ఫలితాలు సాధించారు. వారి అనుభవం  తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు స్ఫూర్తిదా యకంగా నిలుస్తుంది.

రామకుప్పం మండలం మిట్టపల్లికి చెందిన రైతు సోదరులు సుబ్రమణ్యం (93928 71887), ఆంజనేయప్ప నీటిని నిల్వగట్టే పద్ధతికి స్వస్తి చెప్పి డ్రిప్ ద్వారా వరి సాగు చేపట్టి ఇతరులకు మార్గదర్శకులయ్యారు. ‘బోరు వెరుు్య అడుగులు వేసినా నీటి జాడ కానరావడం లేదు. వరి సాగుకు అవసరమైన నీరు అందుబాటులో లేదు. ఒక వేళ మొండికేసి సాగు చేసినా పంట చేతికందుతుందనే ఆశలేదు. అందుకే సూక్ష్మ సేద్యం వైపు చూస్తున్నాం. 2012లో డ్రిప్ పరికరాలను సమకూర్చుకున్నాం. బంగాళ దుంప సాగు కోసం పొలాన్ని దుక్కి చేశాం. ఆ సమయంలో వర్షం రావడంతో సాగుకు అంతరాయం ఏర్పడింది. అదే పొలంలో వరి సాగు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. 50 సెంట్ల (అరెకరం) పొలంలో డ్రిప్ ద్వారా వరి సాగు చేశాం. 15 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది’అని వారు వివరించారు. సాధారణ పద్ధతిలో అర ఎకరాకు అవసరమయ్యే నీటితో డ్రిప్పు ద్వారా రెండు ఎకరాల్లో వరి పండించవచ్చని రుజువు చేశారీ సోదరులు. సుబ్రమణ్యం, ఆంజనే యప్పల స్ఫూర్తితో గత ఏడాది శాంతిపురం మండలం 121 పెద్దూరులో కృష్ణారెడ్డి బిందు సేద్యం ద్వారా ఎకరాకు 52 బస్తాల ధాన్యం దిగుబడి సాధించడం విశేషం.

మామిడి తోటలో మొక్కల మధ్య చాలా స్థలం ఖాళీగా ఉండిపోతుంది. ఈ స్థలాన్ని అంతర పంటలకు ఉపయోగించుకోవడం తెలిసిన పద్ధతే. అయితే, రామకుప్పం మండలం సగినేకుప్పం గ్రామానికి చెందిన రైతులు సుకుమార్‌రెడ్డి, రాజారెడ్డి, వెంకట మునెప్ప మరో అడుగు ముందుకేసి.. ప్రయోగాత్మకంగా తమ మామిడి తోటల్లో డ్రిప్పు ద్వారా వరి సాగు చేపట్టారు. గత ఏడాది మామిడి తోటలోని 70 సెంట్ల విస్తీర్ణంలో డ్రిప్ పద్ధతిలో వరి సాగు చేసి 20 బస్తాల దిగుబడి పొందారు. బోరు 2 అంగుళాల నీరు పోస్తున్నది. ఈ భరోసాతో నెల క్రితం 50 సెంట్ల విస్తీర్ణంలో 3 కిలోల సోనా మసూరి  విత్తనాలను నేరుగా విత్తారు.  వరి సాగు వల్ల నేలలో తేమ త్వరగా ఆరిపోకుండా ఉంటున్నదని, మామిడి మొక్కలకూ ఎంతో మేలు జరుగుతోందంటున్నారు సుకుమార్‌రెడ్డి.

 -కె.సుబ్రమణ్యంరెడ్డి,  రామకుప్పం, చిత్తూరు జిల్లా
 
 వత్తుగా విత్తితే కలుపు తగ్గింది!

 గత ఏడాది డ్రిప్ లేటరల్‌కు అటొక రెండు సాళ్లు, ఇటొక రెండు సాళ్లలో వరి విత్తులు నాటాం. ఎక్కువ ఖాళీ ఉండడంతో కలుపు బాగా పెరిగింది. ఈ ఏడాది అటు 4, ఇటు 4 సాళ్లు వత్తుగా నాటాం. మొక్కల మధ్య 5-6 అంగుళాల దూరం పెట్టాం. కలుపు సమస్య తోపాటు ఖర్చూ తగ్గింది. నెలరోజుల పంట 6 అంగుళాలు పెరిగి దుబ్బుకు 20-30 పిల కలు వేసింది. సర్కారు ప్రోత్సహించాలి.
 
- సుకుమార్‌రెడ్డి(8186810635), మిట్టపల్లి, రామకుప్పం మం., చిత్తూరు జిల్లా
 
డ్రిప్‌తో వరి సాగు ఇలా..
 
 మామిడి తోటలో డ్రిప్ పద్ధతిలో వరి సాగు చేస్తున్న సుకుమార్‌రెడ్డి ఇలా చెబుతున్నారు.. సన్న రకాలు, బీపీటీ, సోనావుసూరి, జయు, హంస.. వంటి ఏ రకం వరి విత్తనాలనైనా ఈ పద్ధతిలో విత్తుకోవచ్చు. వుుందుగా వరి సాగుకు ఎంపిక చేసుకున్న పొలాన్ని చక్కగా దుక్కి చేయించాలి. అరెకరానికి ఒక ట్రాక్టర్ లోడు చొప్పున పశువుల ఎరువు, పరిమితంగా రసాయనిక ఎరువులు వేసి లోతుగా కలియుదున్నాలి. ఆఖరు దుక్కిలో భాగంగా రొటోవేటర్‌ను ఉపయోగించి పొలాన్ని బాగా దుక్కిచేయాలి. తద్వారా పొలం మెత్తగా ఉండి విత్తనాలు మొలకెత్తేందుకు అనువుగా ఉంటుంది. తర్వాత 3 అడుగుల దూరంలో డ్రిప్ లేటరల్ పైపులు వేయాలి. దుక్కి సిద్ధం చేసుకున్న తర్వాత డ్రిప్ పైపునకు ఇరువైపులా 4 వరుసలుగా విత్తనాలు వేసుకోవాలి. సాళ్ల మధ్య 9 అంగుళాల దూరం పాటించాలి. మొక్కల మధ్య ఐదారు అంగుళాల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. విత్తినప్పటి నుంచి మొలకెత్తే వరకు క్రమం తప్పకుండా డ్రిప్పు ద్వారా నీరందించాలి.

మొలకెత్తిన తర్వాత కలుపు నివారించడానికి సాళ్ల మధ్య రోటో వీడర్ తోలుకోవాలి. కలుపు మరీ ఎక్కువగా ఉంటే 2-4 డీ వంటి కలుపు నివారణ వుందులు పిచికారీ చేసుకోవాలి. వరి పైరు ఎదిగే సవుయుంలో కొద్ది మోతాదులో యుూరియూను చల్లుకోవాలి. లేటరల్‌కు ఇరువైపుల వరుసల్లో వరి దుబ్బుల వేర్లు తడిసే విధంగా నీరందించాలి. నేల తడి ఆరిపోకముందే క్రమం తప్పకుండా నీరందిస్తుండాలి. నేల స్వభావాన్ని బట్టి నీరు ఎన్ని రోజుల వ్యవధిలో, ఎంత  సమయం ఇవ్వాలనేది రైతు స్వయంగా నిర్ణయిం చుకోవచ్చు.
 రోటో వీడర్ వలన నేల కదలబారి.. వేరు వ్యవస్థ బలపడి.. త్వరగా పిలకలు వేసి దుబ్బు కడుతుంది. సిఫారసు చేసిన మోతాదు మేరకు ఎరువులు వాడుకోవాలి. పైపాటుగా పంచగవ్య, జీవామృతం పిచికారీ చేసుకుంటే మొక్క బెట్ట పరిస్థితిని తట్టుకోవడమే కాక నేల గుల్లబా రుతుంది.  కాలానుగుణంగా పరిశీలించి చీడ పీడలను అదుపు చేసుకుంటే మంచి దిగుబడులు అందుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు