గులాబీ.. లాభాల జిలేబీ!

11 Sep, 2014 23:40 IST|Sakshi
గులాబీ.. లాభాల జిలేబీ!

 మండలంలోని హైతాబాద్, మద్దూరు, సోలిపేట్, సర్దార్‌నగర్, పెద్దవేడు, రేగడిదోస్వాడ, అప్పరెడ్డిగూడ, మల్లారెడ్డిగూడ తదితర గ్రామాల రైతులు పూల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. గులాబీ రకాలైన రుబీ, టైగర్, సెంట్, ముత్తు తదితర రకాలతోపాటు ఫైవ్‌స్టార్ రకం గులాబీని అధికంగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల రైతులు తక్కువ పెట్టుబడితో.. అధికారుల సూచనలు పాటిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గులాబీ తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం రాయితీలను సైతం అందిస్తోంది. బెంగళూర్‌లోని హొసూరు పట్టణంలోని నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.15 నుంచి రూ.20 వరకు లభిస్తుంది. వీటిని తెచ్చి రైతులు పూల సాగు చేస్తున్నారు.

 అందుబాటులో మార్కెట్ సదుపాయం
 హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ రైతులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కిలో పూలు రూ.50 ధర పలుకుతున్నాయి. వేసవిలో, పెళ్లిళ్లు, పూజలు, పండగలు తదితర సీజన్లలో రూ.150 నుంచి 200 వరకు కిలో పూలు విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూయడంతో ధర హెచ్చు తగ్గులైనా ఎకరానికి ఖర్చులు పోను రూ.50 వేలకుపైనే లాభాలు వచ్చే అవకాశం ఉంది.

 సాగు ఇలా..
అన్ని పంటల మాదిరిగానే గులాబీ పంటకు కూడా దుక్కి కలియ దున్నాలి.
 
మొక్కల మధ్య మూడు అడుగులు, సాగుకు మధ్య ఆరు అడుగులు ఉండేలా రెండు అడుగుల లోతు గుంతలు తీసుకోవాలి.
 
గుంతలు తీసిన మట్టిలో సేంద్రియ ఎరువు, గుళికలు, ట్రైకోడర్మవిరిడితో కలిపి సగం వరకు పూడ్చాలి.
     
మొక్కలకున్న పాలిథిన్ కవర్లు తీసివేసి నాటాలి. మామిడి, జామ తదితర పండ్ల తోటల్లోనూ అంతర పంటలుగా గులాబీ సాగుచేయవచ్చు. ఎకరానికి 2500 నుంచి 3 వేల మొక్కలు నాటవచ్చు.
 
నెలరోజుల అనంతరం మొగ్గలు వచ్చే సమయంలో రసాయనిక ఎరువులు డీఏపీ, క్యాల్షియం పొటాష్ కూడా వేయాలి.
 
నెలరోజుల నుంచి మొగ్గలు తొడిగి పూలు పూస్తూనే ఉంటాయి.
     
చీడపీడల బెడద పెద్దగా ఉండదు. మచ్చతెగులు, పచ్చ పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్
మందును లీటర్ నీటికి 30 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
     
మొక్కలు పెరిగేంతవరకు తోట సేద్యం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చేస్తూనే ఉండాలి.
     
పూలు పూయడం ప్రారంభమయ్యాక రోజు విడిచి రోజు పూలను తెంపుకోవచ్చు.

Read latest Vanta-panta News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు