ఆహ్లాదం... ఆధ్యాత్మికం... ఆనందం!

11 Sep, 2014 23:47 IST|Sakshi
ఆహ్లాదం... ఆధ్యాత్మికం... ఆనందం!

మనదగ్గరే - శామీర్‌పేట్ చెరువు
 
పచ్చని పరిసరాలతో చూపరులను ఇట్టే ఆక ర్షిస్తోంది శామీర్‌పేట్ పెద్ద చెరువు. 956 ఎకరాలలో విస్తరించి 33 అడుగుల లోతు నీటి నిల్వ సామర్థ్యం కల్గి ఉన్న వర్షాధారిత చెరువు ఇది. హైదరాబాద్ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో రాజీవ్హ్రదారికి ఆనుకుని మంచి ఆహ్లాదకరమైన, విశాలమైన స్థలంలో శామీర్‌పేట్ పెద్ద చెరువు ఉంది. రంగారెడ్డి జిలాల్లో ఉన్న ఈ సువిశాలమైన చెరువు అందాలను చూసేందుకు వందల సంఖ్యలో పర్యాటకులు వచ్చి విడది చేసి వెళ్తుంటారు.

పెద్ద చెరువుకు మరింత వైభవం...

వరదనీరు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ చెరువు పూర్తి స్థాయిలో నిండాలంటే భారీ స్థాయిలో వ ర్షాలు పడాలి. ఒకసారి పూర్తి స్థాయిలో చెరువులో నీటి మట్టం చేరితే శామీర్‌పేట్ మండలంలోని సుమారు 2600ఎకరాల భూ సాగుకు అనువుగా ఉంటుంది. మెదక్, నల్గొండ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో వేల ఎకరాలకు సేద్యపు నీరు ప్రత్యక్షంగా, భూగర్భజలాల ద్వారా బోరు బావులకు చేరేందుకు పరోక్షంగా ఉపయోగపడుతుంది.
 
మది దోచే జింకలపార్క్...

ఈ చెరువుకు సమీపంలో బిట్స్‌పిలానీ క్యాంపస్, రాజీవ్ రహదారికి చేరువలో నల్సార్ లా యూనివర్శిటీ ఉన్నాయి. సమీపంలో జవహర్ జింకలపార్క్ 26 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ పార్క్‌లో చుక్కల జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, రకరకాల పక్షులు కనువిందుచేస్తుంటాయి. ఈ ప్రాంతానికి బర్డ్ వాచ్ స్పాట్‌గా కూడా పేరుంది. ఈ పార్క్ పక్కనే టూరిజమ్ వారి హరితా భవన్ ఉంది.  
 
రమ్యంగా రత్నాలయం...

శామీర్‌పేట నుండి 3 కి.మీ దూరంలో ఉన్న రత్నాలయం ఉంది. వెంకటేశ్వరస్వామి కొలువుండే  ఈ ఆలయం బిర్లా, టెంపుల్‌ని తలపిస్తుంటుంది. ఓమ్, విష్ణుచక్రాలతో ఉద్యాన, వాటర్ ఫౌంటెయిన్ మధ్యలో భూదేవి, శ్రీదేవిలతో కొలువున్న వెంకటేశ్వర , కాళిందిపై నర్తించే కృష్ణ విగ్రహాలు.. ప్రధాన ఆకర్షణ. సమీపంలో పేరొందిన అలంకృత, లియోనియా రిసార్టులున్నాయి.
 ఇలా చేరుకోవాలి..  సికింద్రాబాద్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న ఈ లేక్‌కు సొంత వాహనాలలో చేరుకోవచ్చు.         

- అభిమన్యు
 

మరిన్ని వార్తలు