కరువులోనూ కంటినిండా పంట..!

11 Apr, 2016 22:49 IST|Sakshi
కరువులోనూ కంటినిండా పంట..!

♦ పది ఎకరాల్లో మామిడి పంట రూ. 18 లక్షలకు అమ్మకం
♦ సేంద్రియ పద్ధతులతో సంతృప్తికరంగా దిగుబడులు
♦ తోటను ప్రదర్శన క్షేత్రంగా ప్రకటించిన ఉద్యాన శాఖ
 
 వచ్చే ఏడాది మంచి దిగుబడుల కోసం ఇప్పటి నుంచే పాటుపడాలనే స్వభావాన్ని ఒంటపట్టించుకొన్న ఓ  యువ మామిడి రైతు.. కరువు కాలంలోనూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. రసాయనాల వాడకం చాలా వరకు తగ్గించుకుంటూ సంపూర్ణ సేంద్రియ సేద్యం దిశగా అడుగులు వేస్తున్నారు.
 
 వచ్చే ఏడాది పంట దిగుబడులను, నాణ్యతను నిర్దేశించేది నేడు మనం చేపట్టే చర్యలేనని బలంగా విశ్వసిస్తారు నర్సింహారెడ్డి. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కట్కూర్. ఆ గ్రామంలో  2 కి. మీ. పరిధిలో విస్తరించిన మామిడి తోటల్లో ఈ ఏడాది పూత, కాత లేదు. అయినా నర్సింహారెడ్డి మాత్రం కరువు పరిస్థితుల్లోనూ ఎకరాకు పది టన్నులకు పైగా దిగుబడులు సాధిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.  

 1997లో బీడుగా ఉన్న తన పదెకరాల పొలాన్ని బాగు చేయించిన నర్సింహారెడ్డి బంగినపల్లి మామిడి మొక్కలను ఎకరాకు 50 చొప్పున నాటారు.  మామిడి తోటను చంటి బిడ్డ మాదిరిగా సాకుతారాయన. మామిడి సాగులో ఫలసాయం తీసుకొని తోట గురించి మర్చిపోయినా.. కాయ కాసే ముందు మేలుకొని ఎరువు వేసినా ఫలితం ఉండదంటారు నర్సింహారెడ్డి. చెట్లు బాగా పెరిగి గాలి, వెలుతురు సోకకుండా అడ్డంగా ఉన్న కొమ్మలను ప్రూనింగ్(క త్తిరింపులు) చేస్తారు. వర్షం పడగానే రోటావీటర్‌తో దున్నుతారు. దీనివల్ల మామిడి చెట్ల నుండి రాలిన ఆకులు, కలుపు భూమిలో కలిసి సేంద్రియ ఎరువుగా మారుతుంది.

 నాలుగేళ్లకు కాపు ప్రారంభమైంది. రసాయనిక సేద్యంలో మొదటి ఏడాది పదెకరాలకు కలిపి 4 టన్నుల దిగుబడి వచ్చింది. ఇది 2007 కల్లా 50-60 టన్నులకు చేరింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా దిగుబడుల్లో ఏ మాత్రం పెరుగుదల రాలేదు. చెరువుమట్టి వేసినా, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసినా దిగుబడులు పెరగలేదు. దీంతో రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువులతో ప్రయత్నించి చూడాలని నర్సింహారెడ్డి నిర్ణయించుకున్నాడు.

 2012లో రూ. 60 వేలు ఖర్చు చేసి 30 ట్రక్కుల గొర్రెల ఎరువును కొని తోటకు వేశారు. దీనితోపాటు ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువును వాడారు. చె ట్ల కాండం వద్ద కాకుండా.. కొమ్మల చివర్ల నుంచి అడుగు లోపలికి పాదులు చేసి ఎరువు వేశారు. నర్సింహారెడ్డి ప్రయత్నం ఫలించింది. ఆ ఏడాది దిగుబడి 110 టన్నులకు పెరిగింది. ఆ ఏడాది తోటను పరిశీలించిన శాస్త్రవేత్తలు మరుసటి ఏడాది దిగుబడులు పడిపోతాయని చెప్పటంతో నర్సింహారెడ్డి ఆందోళనకు గురయ్యారు. ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువుతోపాటు.. రూ. లక్ష వెచ్చించి 60 ట్రక్కుల పశువుల ఎరువును కొనుగోలు చేసి తోటకు వేశారు. ఆ ఏడాది కూడా 110 టన్నుల దిగుబడితో ఎకరాకు రూ. లక్ష నికరాదాయం లభించింది.  తర్వాతి రెండు సంవత్సరాలు పశువుల ఎరువును వేయలేదు. అయినా దిగుబడి తగ్గలేదు. ఈ ఏడాది ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువును కొనసాగించారు. కరువు పరిస్థితులున్నప్పటికీ తోటకు నీటి కొరత రాలేదు.

 తెగుళ్ల నియంత్రణకు వాడే రసాయనాలను పూర్తిగా ఆపివేసి.. ఉసిరి, కుంకుళ్లతో తయారు చేసిన పొడి, వేపనూనె, ఆవుమూత్రం కలిపి 4 దఫాలు చల్లారు. 20 రోజులకోసారి 400 లీ. గోమూత్రాన్ని డ్రిప్పు ద్వారా తోటకు అందించారు. పూత సమయంలో చీడపీడలు ఆశించకుండా 10 లీ. నీటికి 1 లీ. ఆవు మూత్రాన్ని కలిపి చెట్లపై పిచికారీ చేశారు.

  వచ్చే ఏడాది నుంచి పురుగుల మందుల వాడకాన్ని కూడా నిలిపివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జూన్ నుంచే ప్రణాళి కాబద్ధంగా ప్రతి 15 రోజులకోసారి సేంద్రియ పిచికారీలు చేపట్టాలనుకుంటున్నానన్నారు. ఈ ఏడాది సేంద్రియ పిచికారీల వల్ల కాయల పరిమాణం, నాణ్యత, రంగు బావుందన్నారు. పదెకరాల్లోని మామిడి పంటకు రూ. 18 లక్షల ధర పలికింది.

 నర్సింహారెడ్డి తోటను ఉద్యాన శాఖ ప్రదర్శన క్షేత్రంగా ఎంపిక చేసింది. ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఇటీవల స్వయంగా ఈ తోటను సందర్శించి ప్రశంసించారు.
 - పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
 
 సేంద్రియ పద్ధతుల వల్లనే దిగుబడి..
 మొక్క  పెట్టి, కాస్తాయిలే అనుకుంటే.. కాయవు. వాటికి అన్ని రకాల పోషకాలనూ అందిస్తేనే మంచి దిగుబడులు వస్తాయి. సేంద్రియ పద్ధతుల వల్లనే గడ్డు పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నాం. మనం ఇచ్చిన దానికి చెట్లు పది రె ట్లు తిరిగి ఇస్తాయి.
 - గూడ నర్సింహారెడ్డి (99480 97877),కట్కూర్, భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా

మరిన్ని వార్తలు