కవితలలో ఉగాది

27 Mar, 2017 00:22 IST|Sakshi
కవితలలో ఉగాది

చైత్రమాసంలో వసంత రుతువు అనాదిగా మానవ జాతికి మరువలేని తీపి గురుతు. శిశిరంలో ఆకురాల్చిన ప్రకృతి వసంతంలో లేత ఆకుపచ్చని కొత్త చిగుళ్లు వేసి నవ యవ్వన ప్రాయంలోని యువ హృదయాలకు ఓ మధురమైన వలపు చిత్రమవుతుంది. కొత్త పూల నెత్తావులతో వీచే పిల్ల వాయువులు ప్రేమపక్షుల తనువులను తాకి గిలిగింతలు పెడతాయి.

చైత్రంలో వసంతం రావడం, ఆ వసంతం ఇన్ని మధురానుభూతులను కలిగించడం వలన ఈ మాసానికి ‘మధుమాసం’ అని పేరు. ప్రకృతికి ఉగాది పుట్టిన రోజు పండగ లాంటిది. వనాలు మాసిపోయిన బట్టలు విసర్జించి లేతాకుపచ్చ పట్టుపావడ ధరించి రంగురంగుల పూల డిజైన్ల వాణీలు వేసుకుంటాయి. లేత మామిడి చిగుళ్ల బిర్యానీలు తిన్న కొంటె కోయిలలు ఆ దృశ్యాలకు పరవశించి ప్రేమగీతాలు పాడతాయి. అలౌకికులయిన కవులు ఈ గీతాలు విని కలాలలో వలపు సిరాలు పోసి శృంగార గీతాలు రాయడం కూడా ఆనవాయితీ. ఆ తర్వాత ఆ సంప్రదాయం మారింది. సమకాలీన సమాజ సమస్యలకు స్పందించడం కవుల వంతయింది. ఈ ఉగాది నాడు ఆ తరం, ఈ తరం కవుల స్పందనలపై చిన్న విహంగ వీక్షణమిది.
సంప్రదాయ కవుల ప్రతినిధి విశ్వనాథ సత్యనారాయణ ఉగాది ఎలా ఏతెంచిందో చెబుతూ చక్కటి శృంగార భావన ముందుంచారు:

పరిచయాను ద్రిక్త పరి రంభ సమయాన
ప్రియురాలి ఎద చెమరించినంత
శీతోదక స్నాన జాత సౌఖ్యము పైని
ముకుపుటాన జమర్పు పుట్టినంత
పేరంటమునకేగు పిన్న బాలిక వాలు
జడ మల్లెమొగ్గ కన్పడియనంత
వంగిన వేపకొమ్మ చివరన
పజ్జ యీనెకు పూత పట్టినంత
వసంత మరుగుదెంచెను, మధురోహలు
స్ఫురించగా.
కొత్తగా పరిచయమైన ప్రియుడి చెంత ప్రియురాలికి గుండె ఝల్లుమన్నట్టు, చల్లని నీటి స్నానం చేసినపుడు ముక్కు కొసన నీటి బిందువు ముత్యంలా మెరిసినట్టు, పేరంటానికి వచ్చిన కన్నెపిల్ల వాలుజడ కురులలో అలవోకగా మెరిసిన మల్లెమొగ్గలా, వంగిన వేపకొమ్మ చివరన ఈనెకు పూసిన పువ్వులా వసంతం వచ్చిందని పాఠకుల హృదయం పులకించేలా చెప్పారు విశ్వనాథ.
ఇదే కోవలో కాస్త ముందడుగు వేసి భావ కవిత్వాన్ని చెప్పిన కృష్ణశాస్త్రి తన సినీ కవితా వాణినిలా విన్పించారు.
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
అంటూ, విత్తు ముందా, చెట్టు ముందా అనే ప్రశ్న వెలయించారు.
తెలంగాణ ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య ఉగాదిని గుర్తు చేసే కోయిల పాట వింటే ప్రాణం లేచి వస్తుందంటారు.
కోయిల కో అంటే ప్రాణం లేచి వస్తుంది
తీయదనం చేదువేపలోనూ దీపిస్తుంది
కాలాన్ని కదలకుండా ఆపే వారెవ్వరు?
కాలం బ్రహ్మ స్వరూపమని తెలిసిన
వారెందరు?
అఖండ బ్రహ్మాండ కటాహంలో
అమృతం నింపుతోంది వసంత కన్య
అశేష ప్రజలకు కాలశక్తి
అవగతం చేయగలిగితే ఆమె ధన్య!
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి నవ చైతన్యాన్ని పలుకుతో నవ వర్షానికిలా నాంది పలికారు.
రేపటి మనిషి భవితవ్యానికి
ఊపిరి పోసేది
బిగి తప్పిన పిరికి కండరాల్లో
చేతనా జ్యోతులు వెలుగించేది ఉగాది
అభ్యుదయ కవి మిరియాల రామకృష్ణ తనదైన శైలిలో వసంతాన్నిలా ఆవిష్కరించారు.
ఇది వసంతం పండుటాకుల పాటకంతం
కొత్త కోకిల కూత పంతం,
గోరువంకల గోష్ఠి గీతం
ఇది వసంతం సుమ నితాంతం.
చతుర్వేదుల అమరేంద్ర తన కవితలో కోకిలమ్మ ఏమందో చక్కగా చెప్పారు.
గున్న మావి గుబుర్లలో కొసరి కొసరి కోకిలమ్మ
ఏమన్నది? ఏమన్నది?
నిన్నటి నీ వెతలన్నీ పాతబడిన కలలన్నది.
విప్లవకవి అద్దేపల్లి రామ్మోహనరావు–
ఆకాశానికి నాలుకలు చాచే
అపార్టుమెంట్ల శిఖరాలు దాటి
సాగర తీర కర్మాగారాల కారిడార్లు దాటి
ధూమ కేతువులయిపోయిన నగరాల
నల్ల చేతులకి చిక్కకుండా
తప్పించుకుంటూ ఎట్టకేలకు
మా తోటలోకి అడుగు పెట్టింది వసంతం
అంటూ వాస్తవ పరిస్థితులపై ధ్వజమెత్తారు.
అభ్యుదయాన్నీ, మానవతావాదాన్నీ చక్కగా పలికిస్తున్న వేణు సంకోజు యుగధర్మం మార్చే ఉగాది రావాలంటారు.
యుగధర్మం మార్చగలుగు ఉగాదొకటి చాలు
జగమంతా వసంతాలు పూయు
వేలవేలు
అగమ్య గోచరము కాని ఉగాది, వస్తే
రానిమ్ము
రాగమయపు అభ్యుదయం తన తోడుగా తేనీ
కవయిత్రి శారదా అశోకవర్ధన్‌ ఉగాది మీద నిష్ఠూరాలు పలికిస్తూ కలం ఝుళిపించారు.
నీ రాకకు స్వాగతం చెబుదామంటే, కొత్త
చింతపండు
కొనండి చూద్దామంటూ చెట్టెక్కి కూర్చుంది.
కొట్టులోని కొబ్బరికాయ కొంపకి చేరదు
సందు దొరికిందని బెల్లం, చక్కెరతో కలసి
చుక్కలు చూపిస్తోంది.
వేపపువ్వే కాస్త చవగ్గా ఉంది. అందుకే
తీపి తగ్గించి, చేదు పెంచి కలుపుతున్నాను
అంటూ.
నా అక్షరాలు వెన్నెట్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలని చెప్పుకొన్న చమత్కార కవితా సాహసి బాలగంగాధర తిలక్‌  ఆనాడే సరికొత్తగా ఉగాది గురించి చెప్పారు.
లైట్లు వేసిన స్టేషన్‌లోకి
రైలొచ్చి ఆగినట్లు వచ్చింది ఉగాది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో కవులు, ఎన్నో ఉగాదులు. అన్నీ ఒక్కసారే చెప్పుకోలేంగా! అందుకే మచ్చుకు కొన్ని పాదాలు మీ గుర్తుకు తెచ్చాను. వీటి స్మృతిగా మీ తలపులు రంగరించుకుని మనసుకి ఉగాది పచ్చడి తినిపిస్తారని చిన్న ఆశ.    l        


- ఆచంట సుదర్శనరావు

9000543331

మరిన్ని వార్తలు