ఆశల గాలి ఊసుల కలనేత

2 Feb, 2017 07:34 IST|Sakshi
ఆశల గాలి ఊసుల కలనేత

బడ్జెట్‌ ఉపన్యాసం ఆశలతో నిండి ఉంది గానీ, గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. రైతుల ఆదాయాలను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని బడ్జెట్‌ ఆకాంక్షించింది. కానీ కనీస మద్దతు ధరలను పెంచకుండా ఇది ఎలా సాధ్యం?. జీడీపీ 7.1 శాతానికి పడిపోవడం దుర్వార్త. మొత్తంగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దురదృష్టవశాత్తూ, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడుల వృద్ధి 5.5 శాతమనే అంచనా అత్యంత నిరుత్సాహకరంగా ఉన్నదని చెప్పాలి.

మొత్తంగా చూస్తే ఈ ఏడాది బడ్జెట్లో పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావనగానీ, విశాఖపట్నం రైల్వే జోన్‌ ప్రస్తావనగానీ లేదు. అలాగే ఏపీ రాజధాని నగరానికిగానీ లేదా వైజాగ్‌–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు గానీ పెద్దగా కేటాయింపులు జరిపినట్టు అనిపిం చడం లేదు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై చూపిన తీవ్ర దుష్ప్రభావాన్ని గురించి బడ్జెట్‌ వివరంగా చర్చించలేదు. మొట్టమొదటిసారిగా విడిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. అది సాధారణ బడ్జెట్లో భాగంగా మారింది. స్వాతంత్య్రానంతర కాలంలో మొదటిసారిగా ఈ బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల పద్దులు లేవు. ఆ వర్గీకరణకే స్వస్తి పలికారు. పెట్టు బడి, రాబడి పద్దులు రెండే ఈ బడ్జెట్లో ఉన్న ఏకైక వర్గీకరణ. అది రాజ్యాంగ పరంగా విధిగా జరపాల్సినది.


గణాంకాలు ఘనం... వాస్తవాలు విభిన్నం
ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన నాలుగో బడ్జెట్‌ ఇది. రూ. 21.47 లక్షల కోట్ల వ్యయంతో ఆయన 2017–18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు. 2016–17కు సవరించిన బడ్జెట్‌ వ్యయం రూ. 20.14 లక్షల కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్లో మొత్తం వ్యయం స్వల్పంగా, 6.6 శాతం పెరి గింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్ట పెరుగుదల. మొత్తం బడ్జెటరీ వ్యయం లోని వృద్ధి రేటు ఇంత స్వల్పంగా ఉంటే ఇక ఎంత ఆర్థిక వృద్ధి రేటుని ఆశించగలం?


అదేవిధంగా, పెట్టుబడి పద్దు కింద ప్రతిపాదించిన వ్యయం కూడా 2016–17 సవరించిన అంచనాలలోని రూ. 2,79,847 కోట్ల నుంచి 2017–18లో రూ. 3,09,801 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. అంటే ఆ పద్దు కింద వ్యయంలో వృద్ధి కేవలం 17 శాతమేనని అంచనా. పెట్టుబడి వ్యయానికి గణనీయంగా కేటాయింపులు చేశామని బడ్జెట్‌ పేర్కొంది. కానీ వాస్తవ అనుభవం భిన్నంగా ఉంటోంది. ఈ 2016–17 ఆర్థిక సంవత్స రంలోని ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య తొమ్మిది నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రూ. 1,09,131 కోట్లు. కాగా అంతకు ముందటి ఏడాది ఇదే కాలంలో పెట్టుబడి వ్యయం రూ. 1,15,322 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే  ఈ ఏడాది పెట్టుబడి వ్యయం పడిపోయి, రుణాత్మక వృద్ధిని నమో దుచేసింది. ఇదే కాలంతో పోలిస్తే పడిపోయింది. పైగా ఈ ఏడాది ఏప్రిల్‌– డిసెంబర్‌ మధ్య కేంద్ర ప్రభుత్వ రాబడులు, గత ఏడాది అదే కాలంతో పోలిస్తే 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి.


2015–16తో పోలిస్తే 2016–17 సవరించిన అంచనాల ప్రకారం రాబడుల పెరుగుదల 19 శాతంగా ఉంది. కాగా, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడులు 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయడం మరింత ఆశ్చర్యకరం. 2016–17 సవరించిన అంచనా లతో పోలిస్తే రాబడుల వృద్ధి 2017–18లో ఇంత గణనీయంగా పడి పోవడానికి కారణాలేమిటో బడ్జెట్లో వివరించలేదు. బడ్జెట్‌ ఉపన్యాసం ఆశలతో నిండి ఉందేగానీ, గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి.


బడుగు రైతుకు మొండి చెయ్యే
రైతుల ఆదాయాలను వచ్చే ఐదేళ్ల కాలంలో రెట్టింపు చేయాలనే ఆకాంక్షను బడ్జెట్‌ వ్యక్తం చేసింది. కానీ కనీస మద్దతు ధరలను (ఎమ్‌ఎస్‌పీలను) పెంచ కుండా ఇది ఎలా సాధించగలరో స్పష్టతను ఇవ్వలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏడాదికి 3 శాతం చొప్పున ఎమ్‌ఎస్‌పీలను పెంచుతోంది. అది ద్రవ్యోల్బణం రేటు కంటే కూడా తక్కువ. ద్రవ్యోల్బణం కంటే తక్కువ కనీస మద్దతు ధరలతో ఐదేళ్లలో రెట్టింపు కావడం కాదు గదా, రైతుల ఆదాయాలు పెరు గుతాయనైనా ప్రభుత్వం ఎలా ఆశిస్తుంది? 2017–18లో వ్యవసాయరంగ రుణగ్రహీతలకు కేటాయించినది రూ. 10 లక్షల కోట్లు, అంటే 10 శాతం పెరుగుదల.

అది అతి సాధారణమైన పెంపుదలే. రైతాంగంలో అత్యధికులైన చిన్న, సన్నకారు రైతులకు మొత్తం బ్యాంకు రుణాల మొత్తంలో 7.5 శాతాన్ని కేటాయించాలనే పరిమితిని ఆర్‌బీఐ పెంచలేదనేది చాలా ముఖ్యమైన అంశం. వాస్తవానికి ఈ పరిమితిని కనీసం 15 శాతానికి పెంచి ఉండాల్సింది. నేడు చిన్న, సన్నకారు రైతులలో కేవలం 40 శాతానికే బ్యాంకు పరపతి అందుబాటులో ఉంటోందనే వాస్తవం మరింత ఆందోళనకరమైనది. వచ్చే 2–3 ఏళ్లలో 75 శాతం రైతాంగానికి బ్యాంకు పరపతిని విస్తరింపజేయడమనే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. లేకపోతే వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. మా పార్టీ ఇదే విషయాన్ని గత రెండు ఏళ్లుగా డిమాండు చేస్తున్నా, ఈ దిశగా చర్యలు చేపట్టింది లేదు.


ఊరట అంతంత మాత్రం
ఇక వ్యవసాయం, వ్యవసాయానుబంధ కార్యకలాపాలకు బడ్టెట్‌ కేటాయింపు లను తీసుకున్నా ఇదే తీరు. 2016–17లో వీటికి రూ. 52,821 కోట్లు కేటాయిస్తే, 2017–18కి రూ. 58,663 కోట్లు మాత్రమే కేటాయించారు.  ముద్ర యోజన ద్వారా అసంఘటిత రంగానికి రూ. 2.4 లక్షల కోట్ల నిధులను కేటాయించే లక్ష్యాన్ని నిర్దేశించడం మంచి చర్య. మరి వాస్తవంలో బ్యాంకుల పనితీరు ఈ విషయంలో ఎలా ఉంటుందో వేచిచూడాలి.


మౌలిక సదుపాయాల రంగానికి రూ. 3.96 లక్షల కోట్లను కేటాయించ డాన్ని ఆర్థిక మంత్రి తన ఉపవ్యాసంలో మరో గొప్ప విషయంగా పేర్కొ న్నారు. అయితే ఇది 2016–17 సవరించిన అంచనాలలోని రూ. 3.58 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 10 శాతమే ఎక్కువ.
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కేటాయింపులను రూ. 15,000 కోట్ల నుంచి రూ. 23,000 కోట్లకు పెంచారు. మహాత్మాగాంధీగ్రామీణ ఉపాధి హామీకిగానూ నిధులను రూ. 38,500 కోట్ల నుంచి రూ. 48,000 కోట్లకు పెంచారు. రాజకీయ పార్టీలు విరాళాలను చెక్కులు లేదా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయానికి వస్తే రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల స్లాబుకు ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోకుండా లోక్‌సభకు సమ ర్పించిన ఆర్థిక సర్వే 2016–17లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 7.1 శాతంగా పేర్కొంది. జీడీపీ వృద్ధి రేటు 2015–16లోని 7.6 శాతంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 7.1 శాతానికి పడిపోవడం ఆశ్చ ర్యకరం. ఇదో దుర్వార్త. అయినాగానీ ఆర్థిక సర్వే 2017–18 ఆర్థిక సంవత్స రానికి జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతం నుంచి 7.5 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది.


గణాంకాల గారడీ?
ప్రభుత్వం ప్రచురించిన జీడీపీ గణాంకాలలోని వాస్తవాన్ని పలుపురు నిపు ణులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, ఉపాధి కల్పన, పరపతి విస్తరణ, స్థూల స్థిర పెట్టుబడి కల్పనలోని వృద్ధి వంటి సూచికలన్నీ రుణాత్మక వృద్ధిని కనబరుస్తుండటమే వారి ప్రశ్నలకు కారణం. ఆర్థిక వృద్ధిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమీ లేదని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో అన్నారు. కానీ జీడీపీ వృద్ధిలోని క్షీణతను, రాబడుల తగ్గుదలను అంగీకరించడం ద్వారా ఆ ప్రభావం ఉన్నదని ప్రభుత్వం చెప్ప కనే చెప్పినట్టు అయింది.

వస్తు తయారీ రంగంలోని క్షీణత మరీ తీవ్రంగా ఉండటం మరింత ఆందోళనకరం. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌ఏ) ప్రతి నెలా అత్యంత ముఖ్యమైన వస్తు తయారీ రంగపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ప్రచురిస్తుం టుంది. ఆ సూచిక 2014 మే నెలకు183.5 కాగా, 2016 నవంబర్‌ మాసంలో 181.2గా ఉంది. అంటే గత రెండున్నరేళ్లుగా వస్తు తయారీ రంగంలో వృద్ధ న్నది లే దన్నమాటే!!


అంతా నిరుత్సాహకరం
ఇక మరో ప్రధాన సూచికౖయెన స్థూల స్థిర పెట్టుబడి కల్పన (జీసీఎఫ్‌సీ) పరిస్థితీ అంతే. ఆర్థిక వ్యవస్థలోని పెట్టుబడి మదుపుల ధోరణిని స్థిరమైన ధరల (2011–12) రూపేణా లెక్కించే ముఖ్య కొలమానం జీసీఎఫ్‌సీ. అది 2015–16లో రూ. 35.41 లక్షల కోట్లు కాగా, 2016–17లో 35.35 లక్షల కోట్లు. అంటే – 0.2 శాతం రుణాత్మక వృద్ధిని నమోదు చేసింది.

2016 జూన్‌ 20న ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జౌళి, తోళ్లు, లోహాలు, ఆటోమొబైళ్లు, రత్నాలు, ఆభరణాలు, రవాణా, సమాచార సాంకేతికత, చేనేత రంగాలన్నీ కలసి కేవలం 1,35,000 ఉద్యోగాలను మాత్రమే 2015లో కల్పించాయి. ఇది గత ఏడేళ్లలోనే అతి తక్కువ! పెద్ద నోట్ల రద్దుకు ముందే గ్రామీణ వేతనాలలో పెరుగుదల దాదాపు సున్నాగా ఉంది. మొత్తంగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దురదృష్టవశాత్తూ, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడుల వృద్ధి 5.5 శాతమనే  అంచనా అత్యంత నిరుత్సాహకరంగా ఉన్నదని చెప్పాలి.

( వ్యాసకర్త : డీఏ సోమయాజులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సలహాదారు,
వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సలహాదారు)


 

మరిన్ని వార్తలు