సరికొత్త ఆశల ఆవిష్కారం

11 Jul, 2017 00:56 IST|Sakshi
సరికొత్త ఆశల ఆవిష్కారం

రెండో మాట
జగన్‌ ప్రజల మధ్య అజేయంగా సాగిపోతూ, తన పార్టీని జనం పార్టీగా రూపొందించారు. తాజా సర్వసభ్య సమావేశం (ప్లీనరీ) ద్వారా తన పార్టీలో నూతనోత్తేజాన్నీ, టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా చైతన్య రహితమైపోతున్న తెలుగుజాతికి పూర్వ ప్రతిష్టను పున రుద్ధరింపజేయడానికి తన శ్రేణులలో నవ చైతన్యాన్నీ నింపుతున్నారు. పార్టీ ప్లీనరీతో తెలుగు ప్రాంతంలో సరికొత్త యుగోదయాన్ని జగన్‌ ఆవిష్కరించాలి. రెండురోజుల పాటు జరిగిన ఆ సమావేశాల ద్వారా జగన్‌ దశా, దిశ నిర్దేశం చేయగలిగారనే చెప్పాలి.

విజయవాడ–గుంటూరు ప్రాంతంలో ఈ నెల 8,9 తేదీలలో జరిగిన వైఎస్సార్‌సీపీ బృహత్‌ సర్వసభ్య సమావేశం దృశ్యాలు తిలకించినవారికి ప్రశాంతతలో సముద్ర గాంభీర్యం, అలజడిలోనూ ఒక ఆలోచన కనిపిం చాయి, వినిపించాయి. ఆటుపోట్లతో ఉవ్వెత్తున కదలివచ్చే అలలు ఆలోచన లకు కారణమవు తాయి. ఆ రెండు రోజులు పరస్పరం పోటీ పడ్డాయి. మొదటి రోజును మించి రెండో రోజు జనం పోటెత్తారు. వచ్చిన వారిలో వృద్ధులు, మధ్య వయస్కులు సహా యువకులు కూడా అధిక సంఖ్యలో హాజరుకావడం విశేషం. ప్లీనరీని ప్రత్యక్షంగా చూసినా, ఆధునిక మాధ్యమాల ద్వారా చూసినా మహాకవి శ్రీశ్రీ ‘ప్రాసక్రీడలు’లో చిత్రించిన వర్ణన మన కళ్ల ముందు వాలుతుంది: ‘కొంత మంది కుర్రవాళ్లు/ పుట్టుకతో వృద్ధులు/ పేర్లకీ, పకీర్లకీ, పుకార్లకీ నిబద్ధులు/ ఇక కొంతమంది యువకులు/ రాబోవు యుగం దూతలు/ పావన నవజీవన బృందావన నిర్మాతలు/ వారికి నా ఆహ్వానం/ వారికి నా శాల్యూట్‌’ అన్నారు శ్రీశ్రీ. ఈ ఆహ్వానం తెలుపుతూనే దూసుకొస్తున్న కడలి తరగలని ఆపేందుకు యత్నించే ఓ కాన్యూట్‌ (ఓ చక్రవర్తి) పాలకుడిని ‘భడవా’ అన్నారు.

ఓర్వలేక అడ్డంకులు
కెరటాల వలె వస్తున్న యువత ఆశలనూ, తెలుగువారి బంగారు బాటనూ శాస్త్రీయ పద్ధతులలో ఉజ్జ్వలం చేయడానికి ముందడుగు వేసిన యువనేత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి. కుల, మత వర్గ రహిత దృష్టికోణంతో సాగుతూ పార్టీ జాతీయ అధ్యక్ష స్థానానికి ఎదిగివచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా బాహుళ్యానికి అత్యవసరంగా ఉన్న విద్య, ఆరోగ్యం, నీటి పారుదల సౌకర్యం, రైతాంగ ప్రయోజనాల రక్షణ, కనీస వసతుల కల్పన సుసాధ్య మేనని తన నాయకత్వంలోని ప్రభుత్వం ద్వారా నిరూపించిన వ్యక్తి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన హఠాత్తుగా దుర్మరణం పాలయ్యారు. కొందరు రాష్ట్ర, రాష్ట్రేతర రాజకీయ పెద్దల, ఆయిల్‌ వ్యాపారుల కుట్ర ఫలితమది.

సుమారు 20 ప్రాజెక్టులకు సాంకేతిక, పర్యావరణ అనుమతులు పొంది నిర్మాణాలను వైఎస్‌ రూపకల్పన చేశారు. దాదాపు 8 ప్రాజెక్టులు ఆయన మన మధ్య ఉండగానే పూర్తయ్యాయి కూడా. వైఎస్‌ఆర్‌ దివంగతులైన వెంటనే, ఆయన కుమారుడు జగన్‌కు అవకాశం రాకుండా కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం మోకాలడ్డింది. జగన్‌కు అవకాశం ఇవ్వడం గురించి భారత రాజకీయ నీతి అనుమతించిన పంథాలోనే ప్రయత్నాలు జరిగినప్పటికీ కాంగ్రెస్‌ అధినాయ కత్వం ఈ చర్యకు పాల్పడింది. వైఎస్‌ఆర్‌ మరణంతో నాటి రాష్ట్రం కన్నీరు మున్నీరైంది. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇక అందుబాటులో ఉండవని పేదలు ఆక్రోశిం చారు. కొందరు అలాంటి బెంగతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అది స్వతంత్ర భారతదేశంలోనే అరుదైన సన్నివేశం.

వైఎస్‌ఆర్‌ స్వతంత్ర నిర్ణయాలు, విశిష్ట పథకాలు, విజయాలు అధి నాయకత్వం సహించలేకపోయింది. కానీ పులి పులి సంతానమే కంటుంది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కలలు కన్న పథకాలకు వాస్తవ రూపం ఇవ్వాలని జగన్‌ కంకణం కట్టుకున్నారు. వైఎస్‌ఆర్‌ మరణాన్ని చూసి తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకున్న వారి కుటుంబాల కోసం జగన్‌ ఓదార్పు యాత్రను ఆరంభించారు. అయితే దీనిని కూడా అధిష్టానం సహించలేకపోయింది. అయినా జగన్‌ దీటైన శక్తిగా రాజకీయాలలో ఎదిగిపోయారు. దీనితో ఢిల్లీలో కాంగ్రెస్, రాష్ట్రంలో చంద్రబాబు వర్గం తలాతోకా లేని కేసులు బనాయిం చారు. ఫలితమే జగన్‌ నిర్బంధం.

కాంగ్రెస్, టీడీపీల కుట్ర ఫలితమే
జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ చెప్పినట్టు ‘జైలు వేరు, బెయిల్‌ వేరు. నిందితుడిని జైలుకి పంపినా  చట్టరీత్యా అతడు బెయిల్‌కి అర్హుడే’. 90 రోజులు దాటిన తరువాత బెయిల్‌కు అర్హత ఉన్నప్పటికీ జగన్‌ను పదహారు మాసాల పాటు నిర్బంధంలో ఉంచారు. అటు కాంగ్రెస్‌ అధిష్టానం, ఇటు చంద్రబాబు వర్గం చేతులు కలపడంతోనే ఇదంతా జరిగింది. ఆ సమయంలోనే జగన్‌ వ్యాపార సంస్థలలో భాగస్వాములైన దాదాపు 12 మందిని కోర్టులే విడుదల చేశాయి. ప్రజల మధ్య జగన్‌ ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్‌ కేంద్ర నాయ కత్వమూ, చంద్రబాబుల బంధం కూడా గట్టిపడుతూ వచ్చింది. ‘సీబీఐ సుప్రీంకోర్టుకు తప్ప ప్రధానమంత్రులకు జవాబుదారీగా ఉండరాద’ని అద్వానీ ప్రభృతులు ఇరుక్కున్న ‘జైన్‌ హవాలా’ కేసులో (పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో) అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయాన్ని మరవరాదు.

ఈ ప్రహసనాలు పనిచేయనందునే జగన్‌ ప్రజల మధ్య అజేయంగా సాగిపోతూ, తన పార్టీని జనం పార్టీగా రూపొందించారు. తాజా సర్వసభ్య సమావేశం (ప్లీనరీ) ద్వారా తన పార్టీలో నూతనోత్తేజాన్నీ, టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా చైతన్య రహితమైపోతున్న తెలుగుజాతికి పూర్వ ప్రతిష్టను పునరుద్ధరింపజేయడానికి తన శ్రేణులలో నవ చైతన్యాన్నీ నింపు తున్నారు. పార్టీ ప్లీనరీతో తెలుగు ప్రాంతంలో సరికొత్త యుగోదయాన్ని జగన్‌ ఆవిష్కరించాలి. రెండు రోజులపాటు జరిగిన ఆ సమావేశాల ద్వారా జగన్‌ దశా, దిశ నిర్దేశం చేయగలిగారనే చెప్పాలి. తగిన సలహాలతో, సూచ నలతో ఆ వైపుగా జగన్‌ను నడిపించడానికీ, ఆయన శక్తియుక్తులకు అండగా ఉండేందుకూ తలపండిన నాయకులుండటం ఒక అదృష్టం.

కేవలం పదవుల వల్లనే ప్రజలకు సుపరిపాలన అందదు. సుశిక్షితులైన కార్యకర్తల వల్ల, స్పష్టమైన సైద్ధాంతిక దృక్పథంవల్ల అందుకు ఆస్కారం కలుగుతుంది. ఇంకా, అభిప్రాయాలను పంచుకోవడానికిగల స్వేచ్ఛను దుర్వి నియోగం చేసి, పార్టీలో ఆంతరంగిక సంక్షోభాలకు అవకాశం ఇవ్వ కుండా నాయకులూ, కార్యకర్తలూ నిరంతరం జాగరూకులై ఉండటంవల్ల కూడా సుపరిపాలనకు చోటు కల్పించవచ్చు. అదీకాకుండా, రాజకీయాల మీద అవగాహన పెంచుకుంటూ, అందుకు శిక్షణ తరగతులు నిర్వ హించుకోవడం ద్వారా నేతలూ, కార్యకర్తలూ రాటుతేలడం వల్లనే ప్రజలకు సుపరిపాలన అందుబాటులోకి వస్తుంది. సైద్ధాంతిక పునాది, బలంలేని రాజకీయ పక్షాలు ‘మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతా’యని గుర్తించాలి. వైఎస్సార్‌ సీపీ నిత్యం సైద్ధాంతిక పునాదిని సునిశితం చేసుకోవటం మరింత అవసరం.

నవరత్నాలకు నిధులెక్కడ నుంచి అంటే...
నవ్యాంధ్రకు నవ తేజస్సును, ఓజస్సును కల్పించడం కోసం ప్లీనరీలో 9 అంశాలతో ప్రకటించిన ‘నవరత్నాల’లో (ఇందులో కొన్ని రాజశేఖరరెడ్డి అక్షర సత్యంగా అమలు చేసినవి)  మద్య నిషేధం సమస్య కూడా ఉంది. మిగతా అంశాల (రైతు భరోసా, ఆసరా, పింఛన్ల పెంపు, అమ్మ ఒడి, పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, పేదల ఫీజుల రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం) అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో కూడా జగన్‌ వివరిస్తూ బడ్జెట్‌ స్వరూప స్వభావాన్ని  బహిరంగపరిచారు. ఎన్నికల్లో చెప్పే గాలి కబుర్లలా కాకుండా నిర్ణీత పథ కాలను అధ్యయనం చేసి, వాటికి అవసరమైన ఆర్థిక వనరులను అంచనా వేసుకునే జగన్‌ బడ్జెట్‌ కేటాయింపుల్ని ప్లీనరీకి అర్థమయ్యేలా వివరించారని అర్థమవుతోంది. మద్య నిషేధాన్ని తీసుకురాదలచిన మూడు దశలలో మద్యం సేవించే వారికీ, వారి కుటుంబాల రక్షణకూ తగిన ప్రత్యామ్నా యాలను ఏ రీతిలో ప్రవేశపెడతారో కూడా ఉదహరించారు. ఈ సందర్భంగా గతాను భవం ఒకటి ప్రస్తావిస్తాను. సోవియెట్‌ యూనియన్‌లో మద్యాన్ని ఒక్కసారిగా నిరోధించడానికి వీలుకాక, మద్యాన్ని బాగా పలచబర్చి మద్యం సేవ కుల ఆరోగ్యానికి ఇబ్బంది లేని పద్ధతులను అనుసరించి అన్నిచోట్లా అందుబాటులో ఉంచారు. దీనితో దానిని సేవించేవారి ఆరోగ్యానికీ, వారి కుటుంబాలలోని స్త్రీలు, పిల్లలూ కూడా సుఖశాంతులు అనుభవించారని సుప్రసిద్ధ శాస్త్రవేత్త డైసెన్‌ కార్టర్‌ ఉదహరించాడు. అది జయప్రదమైన ప్రయోగమని కూడా వర్ణించాడు. (చదవండి: వైఎస్‌ జగన్‌ ప్రకటించిన పథకాలు ఇవే..)

హిందుత్వ శక్తుల పట్ల బహుపరాక్‌
ఇవన్నీ ఒక ఎత్తు. తన ప్రజాహిత పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లో అట్ట డుగు స్థాయి వరకు తీసుకుపోయి దిగ్విజయం చేసుకోవాలంటే– విధిగా పార్టీ  ప్రతి జిల్లాలోనూ ప్రజాహిత సాంస్కృతిక దళాలను ఏర్పరచుకోవాలి. ఒక కేంద్ర దళం సమన్వయ శక్తిగా ఉండాలి. పార్టీ నాయకత్వాన పనిచేస్తున్నా, స్వతంత్ర శక్తిగా విభిన్న కళారూపాల (వంగపండు ఉషలాగా) రూపకల్పనకు, ప్రదర్శనలకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రజాహిత రాజకీయ లక్ష్యం గాడి తప్పకూడదు. కళారూపం చెడకూడని పద్ధతిలో సాంస్కృతిక దళా లకు శిక్షణ ఇవ్వాలి.

గతంలో, కమ్యూనిస్టు పార్టీ గాడి తప్పని దశలో– ఆ తొలి ప్రగతిశీల మహోద్యమానికి రాష్ట్రస్థాయి, గ్రామస్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకూ డాక్టర్‌ రాజారావు అధ్యక్షునిగా, నటునిగా, ప్రయోక్తగా ‘ప్రజా నాట్య మండలి’ దళాలు తామర తంపరగా వెలిశాయి.  కె.ఎ. అబ్బాస్, బల్రాజ్‌ సహానీ లాంటి మహా రచయితలను, అఖిల భారత స్థాయి కళాకారులను, నటులను ఉత్సాహపరిచి, వారి సేవలనూ అందుకొన్నాయి. ఆ కృషి ఫలితమే ‘ఆలిండియా పీపుల్స్‌ థియేటర్‌’ సంస్థ అవతరణ. అలాంటి చైతన్యవంతమైన ఆలోచనలతో జగన్‌ ప్రజా ప్రస్థానం వెలుగొందాలని కోరుకుంటున్నాను. మరొక్క సలహా– సమానత్వం, సౌభ్రాతృత్వ సందేశాలతో, సెక్యులర్‌ స్వభా వంతో గణతంత్ర ప్రజాతంత్ర రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు సాగాలనుకుంటున్న జగన్, సమాజ శాంతిని, ప్రజల మధ్య ఐకమత్యాన్ని చీల్చే ‘హిందుత్వ’ శక్తులపట్ల జాగరూకులై ఉండాలి.

కేంద్రంలో ఏ బ్రాండ్‌ పార్టీ పాలకులు అధికారంలోఉన్నా ఫెడరల్‌ రాజ్యాంగ పద్ధతికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కుదించటానికి, ప్రజల ధనాన్ని, వనరులను రాష్ట్రాలకు పంపిణీ చేయడమంటే తమ జేబుల్లోంచే ఖర్చుపెట్టినట్టు ‘పోజులు’ కొట్టే పాలకుల్ని మాత్రం ఒక కంట కనిపెట్టే ఉండాలి. తండ్రికి మించిన బిడ్డగా, ఆయన ప్రజాదరణ పొందాలి. అధికారానికి రాబోయే ముందు గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 1,500 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. అంతకుమించి 3 వేల కిలోమీటర్ల యాత్రకు సన్నద్ధం అవుతున్న వైఎస్‌ జగన్‌కు ఆశీస్సులు!


- ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు