విశ్వసనీయత కొరతే ప్రతిపక్షాల ప్రధాన సమస్య

16 Jul, 2017 04:32 IST|Sakshi
విశ్వసనీయత కొరతే ప్రతిపక్షాల ప్రధాన సమస్య

అవలోకనం
విశ్వసనీయత కొరవడటమనే సమస్య ప్రతిపక్షాలకు తీవ్రమైన చెరుపు చేసింది. మతతత్వవాదం 2019 ఎన్నికల్లో ప్రధాన సమస్య అయ్యే అవకాశం చాలా వరకు లేనట్టే. గోవధ వంటి సమస్యలపై హింసను బీజేపీ చాలా వరకు సాధారణమైనదిగా చేసేయడమే అందుకు కారణం. ప్రతి కొన్ని రోజులకోసారి ముస్లింలను చావబాది హత్యగావించడాన్ని దేశం సౌకర్యంగానే దిగమింగగలుగుతోంది. దాన్నేమీ పెద్ద సమస్యగా చూడటం లేదు. అలా చూస్తుండి ఉంటే దాని ప్రతిఫలనం మనకు కనిపిస్తుంది. అలాంటిదేమీ కనబడటం లేదు. వీటిని చిన్న సమస్యలుగా చూస్తున్నారు.

బిహార్‌ రాజకీయ సంక్షోభం, భారత ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్న అంతకంటే మరింత  పెద్ద సమస్యను వెల్లడిస్తుంది. అవి ఈ సమస్యను ఎదుర్కొనడం కొనసాగుతూనే ఉంటుంది, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అది వారిని దెబ్బ తీస్తుంది. విశ్వసనీయత అనేదే ఆ పెద్ద సమస్య.

బిహార్‌లోని సమస్య చాలా సరళమైనదే. ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక సమాచార నివేదికను (ఎఫ్‌ఐఆర్‌)ను దాఖలు చేసింది. యాదవ్‌కు, ఆయన కుటుంబీకులకు ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను ప్రభుత్వం వెల్లడి చేసింది లేదా లీకు చేసింది. ఆ ఆరోపణలు ప్రత్యేకించి ఆస్తుల పరిమాణాన్ని బట్టి చూస్తే అతి తీవ్రమైనవి. ఉప ముఖ్యమంత్రికి మద్దతుగా మీడియాలో దాదాపుగా ఎవరూ నిలవలేదు. ఆ కుటుంబ పెద్ద లాలూ ప్రసాద్‌ యాదవ్, బీజేపీ వ్యతిరేక ఉమ్మడి కూటమిని మహా ఉత్సాహంగా సమర్ధించేవారిలో ఒకరు. యాదవ్‌ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ), నితీశ్‌ కుమార్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌–జేడీయూ)ల కూటమి నేతృత్వంలో నడుస్తోంది. ఈ రెండు పార్టీలూ ఒకప్పుడు లోహియా సోషలిజం అనే ఉమ్మడి భావజాలంతో అనుసంధానమై ఉండేవి. భారత రాజకీయాలలోని అతి గొప్ప వ్యక్తులలో ఒకరైన రామ్‌ మనోహర్‌ లోహియా పేరుతో ఆ భావజాలాన్ని పిలిచేవారు. ఇప్పుడు దాదాపుగా అందరూ ఆయనను మరచిపోయారు). అసలు  సోషలిస్టులంతా కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారే.

అయితే భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం పెరగడంతో, ప్రత్యేకించి దాని బాబ్రీ మసీదు వ్యతిరేక ఉద్యమం విజయవంతం కావడంతో... లోహియావాద రాజకీయవేత్తలు హిందుత్వ వ్యతిరేకులుగా మారారు, కాంగ్రెస్‌తో కూటములు కట్టడానికి సిద్ధపడ్డారు. అయితే, జార్జ్‌ ఫెర్నాండెజ్‌లాంటి కొందరు సోషలిస్టులు తమ కాంగ్రెస్‌ వ్యతిరేకతావాదానికే కట్టుబడి ఉండిపోయారు. నితీశ్‌ కుమార్‌ కూడా కొంత వరకు ఆ బాపతే. అయితే దాదాపు అందరూ తమ అసలు వైఖరైన బీజేపీ వ్యతిరేకతకు తిరిగి వచ్చారు.

ఇప్పుడు వారు కపటత్వం, భావజాలాన్ని విస్మరించడం అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అత్యధిక ప్రజలు పేదలుగా ఉన్న రాష్ట్రాలలో రాజకీయవేత్తలు, వారి కుటుంబాలు కోట్లు కూడబెట్టుకుంటుంటే అది ఎలాంటి సోషలిజం? యాదవ్‌లపై సీబీఐ తయారు చేసిన నివేదికలు వెయ్యి కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బినామీ లావాదేవీలకు సంబంధించినవి. ఇవి ఆరోపణలు మాత్రమేనని, న్యాయస్థానంలో అవి రుజువు కావాల్సి ఉందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఆరోపణలను ఎదుర్కొనడానికి చేస్తున్న వాదనలు వాస్తవాలతో కూడినవి కావు. బీజేపీకి భయపడేది లేదు, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతాం తదితర అంశాల వంటి వాటిని యాదవ్‌లు చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్, వంశపారంపర్య పాలనను పెంపొందింపజేస్తోందనేది సోషలిస్టుల మరో అరోపణ. ఇందిరా గాంధీని నెహ్రూ ప్రోత్సహించారని, రాజీవ్‌ వారసురాలిగా సోనియా కాంగ్రెస్‌ అధినేత్రి అయ్యారని ఎవరు నిరాకరించగలరు? కానీ, సోషలిస్టులే స్వయంగా వంశపారంపర్య పాలనను ఏర్పరుస్తారని ఊహించలేం. ఉత్తరప్రదేశ్‌లోని యాదవ్‌లు ‘సమాజ్‌వాదీ’పార్టీని చేజిక్కించుకున్నారు. సమాజవాదమనేది పూర్తిగా పేరులోనే మిగిలించిది. మూడోతరం రక్త బంధువుకు లేదా అంకుల్‌ కుమారుడికి ఇలా లోక్‌సభ లేదా శాసనసభ సీటు ఇచ్చారు, ఎన్నికయ్యారూ అంటే వారిని ప్రభుత్వంలోకి తీసుకోకపోవడం దాదాపుగా జరగదు.

దేశంలోని విచ్ఛిన్నకర, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునే సోషలిస్టుల చరిత్ర ఇదీ. మైనారిటీల పట్ల వారి నిబద్ధత బలమైనది, దేశం పట్ల వారిది సమ్మిళిత దృక్పథం నిజమే. రాజకీయాలలో మతానికి సంబంధించినవి గాక మరే సమస్య విషయంలోనూ వారికి విశ్వసనీయత లేదు. అవినీతి సమస్యపై బిహార్, యూపీలలోని యాదవ్‌లు బీజేపీ, దాని మద్దతుదార్లు సంధించే ఆరోపణలకు బదులు చెప్పడం చాలా కష్టం.

విశ్వసనీయత కొరవడటమనే ఈ సమస్య వారికి తీవ్రమైన చెరుపు చేసింది. మతతత్వవాదం 2019 ఎన్నికల్లో ప్రధాన సమస్య అయ్యే అవకాశం చాలా వరకు లేనట్టే. గోవధ వంటి సమస్యలపై హింసను బీజేపీ చాలా వరకు సాధారణమైనదిగా చేసేయడమే అందుకు కారణం. ప్రతి కొన్ని రోజులకోసారి ముస్లింలను చావబాది హత్యగావించడాన్ని దేశం సౌకర్యంగానే ఇముడ్చుకోగలుగుతోంది, దాన్నేమీ పెద్ద సమస్యగా చూడటం లేదు. అలా చూస్తుండి ఉంటే దాని ప్రతిఫలనం మనకు కనిపిస్తుంది. అలాంటిదేమీ కనబడటం లేదు. వీటిని చిన్న సమస్యలుగా చూస్తున్నారు.

2014 ఎన్నికలు పునరావృతం కావడమే ప్రధాన కథనం అవుతుంది. ఉగ్రవాదం పట్ల మెతకగా వ్యవహరించే అవినీతిగ్రస్త రాజకీయవేత్తలు దేశప్రగతికి అడ్డుపడ్డారని, తమ గురించి, తమ కుటుంబాలు సుసంపన్నం కావడం గురించి మాత్రమే ఆసక్తిని చూపి, దేశం నష్టపోవడాన్ని అనుమతించారని మోదీ అంటారు.

ఇది అతిగా సాధారణీకరించిన వాదనే కాదు, కచ్చితమైనది కూడా కాదని నా అభిప్రాయం. అయితే ఈ దాడి నుంచి రక్షించుకుంటూ, ఎదురు దాడి చేయడం రాజకీయ ప్రతిపక్షాల పని. వారి ప్రతిస్పందన మతతత్వ ఆరోపణలకే పరిమితమైనంత కాలం అది నెగ్గుకు రాలేదు. అవినీతికి తావు లేకుండా వారు ప్రభుత్వాలను నడపగలుగుతారని అత్యధిక భారతీయులను ఒప్పించగలిగిన కేంద్ర కథనం వారికి అవసరం. మన్మోహన్‌ సింగ్‌ ఉన్నట్టుగా, నరేంద్ర మోదీ ఉంటున్నట్టుగా వారు వ్యక్తిగతంగా సందేహాలకు అతీతులుగా ఉండాలి.

బిహార్, యూపీ, ఇంకా పలు ఇతర రాష్ట్రాలను చూడండి... ఎన్నో ఏళ్లుగా కళంకితమై ఉన్న అవే ముఖాలను ఇంకా చూడటం ఎలా సాధ్యం? ఈ భారాన్ని మోసుకుంటూ ప్రతిపక్షం 2019లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించి, దాన్ని మార్చడానికి శక్తివంతంగా కృషిచేస్తే తప్ప, ఆ కారణంగా వారు 2014లో లాగే ఓటమి పాలు కాక తప్పదు.


- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు