‘రద్దు’ ఆటలో మోదీదే పైచేయి

19 Nov, 2016 00:59 IST|Sakshi
‘రద్దు’ ఆటలో మోదీదే పైచేయి

జాతిహితం
నల్లధనం ఎంతుంది? ఎక్కడ, ఎవరు దాచారు, దాన్ని రాబట్టడానికి ఉత్తమమైన లక్ష్యాలు ఎవరు? ఏదీ మనకు తెలియదు. ‘‘పరిష్కారం’’ మాత్రం మొత్తం డబ్బునంతటినీ పీల్చి పారేసి, చట్టబద్ధమైనదిగా ముద్రవేసిన దాన్ని తిరిగి ఇవ్వడమూ, మిగిలేదంతా లాభం అనుకోవడమే.


సాధారణ మానవుని మెదడు రెండు భిన్న మైన అర్ధ భాగాలుగా ఉంటుంది. వాటిలో ఒక్కొక్కటీ విభిన్నమైన, క్లిష్టమైన పనులను చేస్తుంది. అధికారంలో ఉన్న రాజకీయ నేత మెదడులోని ఆ రెండు భాగాలనూ రాజ కీయాలు, పరిపాలనగా విభజించడం వీలుగా ఉంటుంది. ఒకటి పథకాలను, పన్నాగాలను పన్నుతూ అధికారాన్ని అందు కోవడానికి అనువుగా మాట్లాడేలా చేస్తుంది.  రెండవది అతడు ఆ అధికారాన్ని ప్రయోగించగలిగేలా చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో ఇది ఎలా పనిచేస్తుంది? ప్రత్యే కించి పెద్ద నోట్లను రద్దు చేసిన తదుపరి ఈ పరిశీలన అవసరం.

2014 సార్వత్రిక ఎన్నికలకు చాలా ముందే ఆయన బుర్రలోని రాజకీయ భాగం గురించి మనకు చాలా తెలుసు. ఆయన, సుప్రసిద్ధ నాడీ వైద్యుని వలే ప్రజాభిప్రాయాన్ని కచ్చితంగా పసిగట్టగల సెవంత్‌ సెన్స్‌ (ఏడవ జ్ఞానేంద్రియం) ఉన్న అత్యంత గొప్ప రాజకీయ నేత. 2002–2007 మధ్య, 2012–2014 మధ్య ఆయన ఓటర్ల అత్యంత సున్నితమైన భావాలను మీటుతూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చారో మనం చూశాం. ఆ మేర కు, కనీసం ఇప్పటివరకు మోదీ ఈ దఫా కూడా విజయం సాధిస్తున్నారు.

రాజకీయంగా (ఎన్నికలపరంగా) ఆయన ఆలోచన సూటిగానే ఉంది : ఎలా కూడబెట్టిందైనా దేశంలో బోలెడంత నల్లధనం ఉన్నదని మీరు విశ్వసిస్తున్నారా? అవును అనే సమాధానం. కాబట్టి మరిన్ని ప్రశ్నలు వస్తాయి. లక్షల కోట్ల నల్లధనాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి తీసుకు రాకుండానే దేశం పురోగమించగలదా? కాదు అనే సమాధా నమే వస్తుంది. విదేశాలలోని నల్లధనాన్ని తిరిగి రప్పించడానికి, క్షమాభిక్ష పథకం ద్వారా దేశంలోని అక్రమార్జనను రాబట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామా లేదా? అభిమానులైతే అవును చేశాం అంటారు. విమర్శకులు లేదంటారు. అత్యధికులు అనిశ్చితితో ఉంటారు. ఒక్కో పౌరునికి రూ. 15 లక్షల కానుక వాగ్దానాన్ని మీరు విశ్వసించినా, సందేహించినా అది మరుపున పడిపోయేదేం కాదు. అన్ని ఇతర ప్రయత్నాలూ చేశాకే పెద్ద ఎత్తున అమాయకులకు హాని కలిగే అవకాశం ఉన్న ఈ చివరి చర్యకు దిగారా? అనేదే తాజా ప్రశ్న అవుతుంది. ఇది కష్టభరితమైన నిర్ణయమని నాకు తెలుసు. కానీ మీరు నన్ను ఎన్నుకున్నది ఇందుకు కాదా? అనేదే మోదీ సమాధానం.

ఇంతవరకు ఈ వాదనతో ఆయన నెగ్గుకొస్తున్నారు.  నా కోసం, దేశం కోసం ఒక్క యాభై రోజులపాటూ ఇబ్బంది పడండి. అద్భుత భారతదేశాన్ని మీకు ఇస్తాను అంటున్నారాయన. నల్లధనం లేని కోట్లాది మంది ప్రజల్లో అధికులను ఈ మాటలు ఉత్తేజ పరుస్తు న్నాయి.  అయితే ఈ చర్య వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాటిల్లే నష్టం ఎంత? నికర ఫలితాలు ఏమిటి? అనేవి ఆ తర్వాత రెండేళ్ల వరకు కాకున్నా, కొన్ని నెలల వరకైనా మనకు తెలియవు. జనాదరణ పొందే భావనను, నినాదాన్ని కనిపెట్టడమే రాజకీయాల్లో ముఖ్య మైనది. ఎన్నికల రీత్యా అద్భుత ప్రతిభాశాలిౖయెన ఏ నేతా తాను నెరవేర్చగలనని నమ్మే∙వాగ్దానాలపైనే ఆధారపడరు. 1969లో ఇంది రాగాంధీ కాంగ్రెస్‌ను చీల్చి బ్యాంకుల  జాతీయ కరణ, రాజభరణాల రద్దు వంటి చర్యలు చేపట్టారు. గరీబీ హటావో (పేదరిక నిర్మూలన) నినాదాన్ని కనిపెట్టారు. ప్రతిపక్షాలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఏకమై, ఆమె కట్టుకథలను ప్రచారం చేస్తున్నారన్నాయి. కానీ ఆమె ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

పేదరిక నిర్మూలనకు నిజమైన ప్రణాళికగానీ, అసలు ఆ ఉద్దేశం గానీ ఇందిరకు లేదు. కాకపోతే ఓటర్లలో చెల్లుబాటయ్యే నినాదాన్ని ఆమె కనిపెట్టారు. పేదరికాన్ని ఆమె ఎలా నిర్మూలించగలరు?  ఆమెను ఎలా విశ్వసించగలం? అనే మాటలు తప్ప... ప్రతిపక్షాల వద్ద అంతకంటే పెద్ద ఆలోచన లేదు. ఓటర్లు ఆమెనే నమ్మారని మనకు తెలుసు. చాలా కాలం తర్వాత గానీ ఆమె విధానాలు దేశాన్ని బికా రిని, తమను మూర్ఖులను చేశాయని ఓటర్లు గ్రహించలేదు.

బ్రెగ్జిట్, డొనాల్డ్‌ ట్రంప్‌ల విజయాలు ఇందుకు ఇటీవలి ఉదా హరణలు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ప్రచారం సాగించిన వారు బ్రిటన్‌ను పరిరక్షించి, తిరిగి గొప్పదాన్ని చేస్తామని వాగ్దానం చేస్తూ వాగాడంబరాన్ని ప్రదర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణలో గెలిచి, యూరప్‌ను విచ్ఛిన్నం చేశారు. తదుపరి పరీక్షకు నిలిచేసరికి చేతులు ఎత్తేశారు. అలాగే ట్రంప్‌ కూడా అమెరికాను మళ్లీ గొప్పదిగా చేస్తానని వాగ్దానం చేశారు. నిజానికి అమెరికా మునుపెన్నటికన్నా నేడే అతి గొప్పదిగా ఉన్నదని వివేకవంతులెవరైనా అంటారు. ట్రంప్‌ దాన్ని మరింత గొప్పదిగా ఎలా చేయగలరు? ఎప్పుడు, ఎలా చేస్తారు? అని అడగకండి. ఆయన ఎన్నికల్లో గెలుపొందారు అంతే. అదే రాజనీతి. సరిగ్గా ఇక్కడే మోదీ తక్షణ యుద్ధంలో గెలుపొందుతున్నారు. 1970 లలో ఇందిర తన ప్రత్యర్థులను అందరినీ పేదరిక నిర్మూలనకు వ్యతి రేకులుగా ఇరికించేసినట్టుగా... మోదీ తన ప్రత్యర్థులను ప్రతికూల స్థితిలోకి నెట్టేస్తున్నారు. ఈ చర్య వల్ల కలిగే ఫలితాలు తర్వాతగానీ లెక్కకు రావు. నిరుపేదలు ఆయన కోరుతున్న అసౌకర్యానికి సిద్ధప డుతున్నారు. ఈలోగా ధనవంతులు బహుశా నల్లధనాన్ని దాచడానికి నూతన మార్గాలను అన్వేషిస్తుంటారు. అందువల్ల మోదీ బుర్రలోని రాజకీయ అర్ధభాగం అద్భుతంగా పనిచేస్తోందని నిర్ధారించవచ్చు.

ఇకపోతే ఆయన బుర్రలోని రెండో భాగానికి వస్తే... పరిపాలన విషయంలో మోదీ అనుసరిస్తున్న వైఖరిని సూచించే ముఖ్యమైన చర్య నోట్ల రద్దు. అసలు నల్లధనం ఎంతుంది? ఎక్కడ ఎవరు దాచారు, దాన్ని రాబట్టడానికి, ప్రక్షాళన చేయడానికి అభిలషణీయమైన ఉత్తమ మైన లక్ష్యాలు ఎవరు? ఏదీ మనకు తెలియదు. ‘‘పరిష్కారం’’ మాత్రం మొత్తం డబ్బునంతటినీ పీల్చిపారేసి, చట్టబద్ధమైనదిగా ముద్రవేసిన దాన్ని తిరిగి ఇవ్వడమూ, మిగిలేదంతా లాభం అను కోవడమే. ఆధీనరేఖను దాటి పాకిస్తాన్‌లో చేసిన లక్ష్యిత దాడుల పర్యవసానాలు ఏమిటో ప్రజలకు తెలియదు. అలాగే ఇదీనూ. మీరు ఈ ప్రభుత్వ అభిమాని అయితే సెహ్వాగ్‌లాగా బంతిని చూసి, బాది పారేయడంతో పోల్చవచ్చు, కాకపోతే పరిపాలనకున్న సంప్రదాయక నిర్వచనంతో పోల్చి చూడవచ్చు. ఏది ఏమైనా ఇది గడ్డు కాలం.
twitter@shekargupta
శేఖర్‌ గుప్తా

మరిన్ని వార్తలు