పవర్ (లేని) స్టార్!

16 Oct, 2016 08:19 IST|Sakshi
పవర్ (లేని) స్టార్!

త్రికాలమ్
‘మా సమస్య ఫలానా తేదీలోగా పరిష్కరించాలంటూ గడువు పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారని ఆశించాం. హైకోర్టు కమిటీ వేయాలట, బీజేపీ నాయ కులకు విజ్ఞప్తి చేస్తారట. ప్రభుత్వానికి విన్నపం చేస్తారట. మేము న్యాయ స్థానా లలో పోరాడితే జనసేన న్యాయసహాయం చేస్తుందట. కలిసొచ్చే పార్టీలను కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తారట’ అంటూ నిష్ఠూరంగా, కించిత్ వ్యంగ్యంగా మాట్లాడారు పశ్చిమ గోదావరి నుంచి హైదరాబాద్ వచ్చి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో తమ గోడు వెళ్ళబోసుకున్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధి తులలో ఒకరు. పవన్ కల్యాణ్ నుంచి ఎంతో ఆశించి వచ్చినవారికి ఆయన స్పందన ఆశాభంగం కలిగించడంలో ఆశ్చర్యం లేదు. అమరావతి సమీపంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజల అనుభవం కూడా ఇదే. గర్జించవలసిన కథానాయకుడు మౌనంగా ఉండటం, మెత్తగా మాట్లాడటం, నీళ్ళు నమలడం ఎందుకో అభిమానులకు అర్థం కావడం లేదు. పవర్ స్టార్ రాజకీయం ఏమిటో రాజకీయ పరిశీలకులకు అంతుచిక్కడం లేదు.
 
సినిమా వేరు, రాజకీయం వేరు

సినిమాకూ, రాజకీయానికీ ఉన్న వ్యత్యాసం ఏమిటో ఈ పాటికి పవన్ కల్యాణ్‌కు తెలిసే ఉంటుంది. రెండు రంగాలలో శ్రమించినవారే రాణిస్తారు. సినిమా రంగంలో నటుడిగా నిలదొక్కుకొని హీరోగా వెలగాలంటే చాలా కష్టపడాలి. చిరంజీవి వంటి మెగాస్టార్ ఆశీస్సులు ఉన్నప్పటికీ పవన్‌కి స్వయంప్రకాశం లేకపోతే, కష్టపడి పనిచేసే మనస్తత్వం లేకపోతే ఈ స్థాయికి ఎదిగి ఇంత మంది అభిమానులను సంపాదించగలిగేవారు కాదు. సినిమా షూటింగ్‌లో షెడ్యూళ్ళు ఉంటాయి. ఒక షెడ్యూలుకూ, మరో షెడ్యూలుకూ మధ్య విరామం ఉంటుంది. ఎంత విరామం తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించడంలో హీరో ప్రమేయం ఉంటుంది. సినిమాలో వ్యవహారం అంతా డెరైక్టర్, హీరోల అదుపులో ఉంటుంది. రాజకీయాలు వేరు. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నం అవుతుందో, ప్రత్యర్థులు ఎటువంటి ఎత్తులు వేస్తారో ముందుగా తెలియదు. ఎప్పటికప్పుడు పరిస్థితికి తగినట్టు స్పందించాలి. నిర్విరామంగా పనిచేయాలి. అటు సినిమాలోనూ, ఇటు రాజకీయాలలోనూ అంతిమంగా విజేతలను నిర్ణయించేది ప్రజలే.

సినీ నటుడి కంటే రాజకీయ నాయకుడి నుంచి ప్రజలు ఎక్కువ ఆశిస్తారు. నటుడి నుంచి వినోదం కోరు కుంటే రాజకీయ నాయకుడు తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటారు. నిరంతరం తమ మధ్యనే ఉండాలని అభిలషిస్తారు. పిలవంగానే పలకాలనీ, రమ్మనగానే రావాలనీ, కష్టాలలో ఆదుకోవాలనీ అనుకుంటారు. జంటనగరా లకు చెందిన బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి దత్తాత్రేయకు సంబంధించి అందరూ చెప్పుకునే మాట ఏమిటంటే, ఎవరైనా ‘దత్తన్నా’ అని కేకవేస్తే ‘అత్తన్నా’ అంటూ వెంటనే బయలుదేరతారట. అందుకే ఆయనకు ప్రజల మనిషి అని పేరు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా కష్టం. ఇంతగా శ్రమించినా వారికి మప్పిదాల కంటే తప్పిదాలపైన విమర్శనాస్త్రాలే ఎక్కువ.
 
పవన్‌కల్యాణ్ సందిగ్ధావస్థను అర్థం చేసుకోవాలంటే ఆయన సమస్యను సానుభూతితో పరిశీలించాలి. ఎన్.టి. రామారావు రాజకీయాలలో ప్రవేశించే ముందు సినిమాలన్నీ పూర్తి చేసుకొని పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయిం చుకున్నారు. పార్టీ నెలకొల్పిన తొమ్మిది మాసాలకే ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అధికారంలోకి అట్టహాసంగా వచ్చారు. ఆ తర్వాత ఇరవై ఆరు సంవత్సరాలకు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేశారు. సినిమా లకు స్వస్తి చెప్పి, సొంతంగా ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి, రాష్ట్రం అంతటా ప్రచారం చేసి అదృష్టం పరిశీలించుకున్నారు. మెజారిటీ సాధించడానికి సరిపడి నంతగా ప్రజల మద్దతు కూడగట్టలేకపోయారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్నీ, కేంద్ర సహాయమంత్రి పదవినీ పుచ్చుకున్నారు. తన శక్తిమీదా, పరిస్థితులమీదా ఎన్‌టీఆర్‌కీ, చిరంజీవికీ స్పష్టమైన అవగాహన ఉంది. రంగంలోకి దిగిన తర్వాత శక్తినంతా కూడగట్టుకొని పోరాటం చేశారు. రామారావుకు ఉన్నంత ప్రజాదరణ చిరంజీవికి లేదు. చిరంజీవికి ఉన్న జనా కర్షణ పవన్ కల్యాణ్‌కి లేదు. తెలుగు యువతలో పవన్ పట్ల విశేషమైన అభి మానం ఉన్న మాట నిజం. అతనితో పాటు ఇతర హీరోలకు కూడా అభి మానులు ఉన్నారు. రామారావు నటుడుగా రంగంలో ఉన్నంత వరకూ ఆయనదే అగ్రస్థానం. సాటి హీరోలతో పోల్చితే చిరంజీవిదే పైచేయి. అంత స్పష్టమైన ఆధిక్యం సినిమాలలో పవన్ కల్యాణ్‌కి లేదు. రాజకీయాలలోనూ రాదు.

నాటకీయంగా రంగప్రవేశం
2014 ఎన్నికలకు పూర్వం బీజేపీ నాయకుడు సోము వీర్రాజు వెంట గాంధీనగర్ వెళ్ళి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని కలుసుకోవడం, హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఇంటికి రప్పించుకోవడం, ఎన్నికల ప్రచార సభలలో మోదీతో, నాయుడితో వేదిక పంచుకోవడం. మోదీ పవనాలూ, పవన్ ప్రభావం ఫలితంగా టీడీపీ ఒక్క శాతం ఆధిక్యంతో అధికారం హస్తగతం చేసుకోవడం చరిత్ర. ‘మీరు చెబితే టీడీపీకి ఓటు వేశాం. అందుకే మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం’ అంటూ శనివారం నాడు పవన్‌కల్యాణ్‌ని కలుసుకున్న బాధితులు సూటిగా చెప్పారు. టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన తర్వాత 2015 మార్చి 5న పవన్‌కల్యాణ్ అమరావతి ప్రాంతంలో పరిస్థితులు అధ్యయనం చేసేందుకు పర్యటించారు. ఉండవల్లి, బేతపూడి, తుళ్ళూరు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. భూసేకరణ చట్టం తెచ్చి భూములను బలవంతంగా తీసుకుంటామంటూ కొందరు మంత్రులు ప్రకటనలు జారీ చేయడంతో ఆగస్టు 23న రెండోసారి రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా పెనుమాక సభలో మాట్లాడుతూ, బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నాననీ, ముఖ్యమంత్రి చంద్ర  బాబునాయుడితో మాట్లాడతాననీ, అవసరమైతే నిరాహారదీక్ష చేస్తాననీ ప్రక టించారు.

కొద్ది రోజుల తర్వాత కామినేని శ్రీనివాస్‌తో ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.  అప్పుడే  స్వరం మారింది. భూసేకరణ అవసరమేననీ, ప్రజలను ఒప్పించి భూమి సేకరించాలని ముఖ్య మంత్రికి చెప్పాననీ మీడియా ప్రతినిధులతో అన్నారు. అప్పటి నుంచి ఇంత వరకూ అమరావతి భూముల ప్రస్తావన లేదు. బందరు రేవు కోసం లక్ష ఎక రాలు సేకరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా స్పందన లేదు. ప్రత్యేక హోదా రాదని తెలిసి ప్రజలు నిరసన ప్రకటించినప్పుడు తిరుపతిలో, కాకినాడలో సభలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా వాగ్బాణాలు వదిలి ముఖ్యమంత్రిని మాత్రం ఉపేక్షించారు. అన్ని జిల్లాలలో సమావేశాలు పెడతానని తిరుపతిలో చెప్పిన పవన్ కాకినాడతో ప్రత్యేక హోదా ఉద్యమానికి స్వస్తి చెప్పారు.
 
ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని కలుసుకొని మద్దతు ప్రకటించడం తన కనీస కర్తవ్యమని ఆయన భావించి ఉంటారు. తీరా కలిసిన తర్వాత గట్టి హామీలు ఇవ్వలేకపోయారు. ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నదో అర్థం కావడంలేదని అన్నారు. ఆ ప్రాంతంలోని పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ ఎందుకు పట్టించుకోవడంలేదో తెలి యదు అంటూ ఆవేదన వెలిబుచ్చారు.  నాయకుల ప్రమేయం పెద్దగా లేకుండా ప్రజలే పోరాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మహిళలే ఆందోళన కొనసాగిస్తున్నారు. 35 రోజులుగా గ్రామాలలో పురుషులు లేరు. వారు పోలీ సులకు భయపడి ఎక్కడో తలదాచుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉంది. పురుషులతో పాటు మహిళలపైన కూడా బైండింగ్‌వోవర్ కేసులూ, 307 కేసులూ పెడుతున్నారనీ, పోలీసు జులుం విపరీతంగా పెరిగిందనీ, బెయిలు రాకుండా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారనీ, ఉద్యమాన్ని ఉక్కుపాదం అణచాలని చూస్తున్నారనీ ఆందోళనకారులు చెబుతున్నారు.
 
పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని లోక్‌సభ, శాసనసభ నియోజక వర్గాల లోనూ తెలుగుదేశం-బీజేపీ కూటమి అభ్యర్థులే గెలిచారు. రైతుల రుణాలూ, డ్వాక్రా మహిళల రుణాలూ మాఫ్ చేస్తానంటూ చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ కూటమికి ఓటు వేయాలనీ, ప్రజల కష్టనష్టాలను తాను కాచుకుంటాననీ పవన్ కల్యాణ్ చెప్పిన మాట నమ్మారు. అందరూ అధికార పార్టీ ప్రతినిధులే  కనుక ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించ లేకపోతున్నారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చందుర్రు, కె. బేత పూడి, జొన్నలగరువు గ్రామాలలో రాజుకొని మొత్తం 30 గ్రామాలకు విస్తరిం చింది.  ఇవన్నీ నరసాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనివి. నరసాపురం శాసనసభ్యుడు మాధవనాయుడూ, భీమవరం ఎంఎల్‌ఏ అంజి బాబూ ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య నలిగిపోతూ కుమిలిపోతున్నారు. ముఖ్య మంత్రికి వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. ప్రజలకు నచ్చజెప్పే సామర్థ్యం లేదు. సీపీఎం నాయకుడు మధుని భీమవరంలో ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి పోలీసు స్టేషన్‌లో పెట్టినప్పుడు వేడి పెరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ శాసనమండలి సభ్యుడు మేకా శేషుబాబు బృందాకరత్‌తో కలిసి భీమవరం వె ళ్ళి బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ ఆ ప్రాంతంలో పర్యటించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 19వ తేదీన ఆందోళన జరుగుతున్న ప్రాంతాలను సందర్శి స్తారని ఆళ్ళ నానీ ప్రకటించారు.
 
సిద్ధూ, పవన్‌లది ఒకే బాట
టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రేరేపించిన వ్యక్తిగా, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పవన్‌కల్యాణ్ నిరుడు లాఠీచార్జి జరిగినప్పుడే అక్కడికి వెళ్ళవలసింది. ఇప్పుడు కూడా ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన సురేష్ అనే వ్యక్తి కొంత మంది బాధితులను హైదరాబాద్ తీసుకువచ్చి పవన్‌తో కలిపించారు. తాను స్వయంగా వెడితే ఆ ప్రాంతంలో ఆవేశాలు పెరిగి, కులాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉన్నదనీ, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనీ భావించి అక్కడికి వెళ్ళాలన్న సంకల్పం విరమించుకున్నాననీ సంజాయిషీ చెప్పారు. అమరావతి ప్రాంతంలో రెండుసార్లు చేసిన పర్యటనకు ఈ వాదన వర్తించదా? పంజాబ్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడూ, వ్యాఖ్యాత, పార్లమెంటు మాజీ సభ్యుడూ నవజ్యోత్ సిద్ధూకు ఉన్నట్టే పవన్ కల్యాణ్‌కు సైతం ప్రాప్తకాలజ్ఞత ఉన్నదేమో.

వాస్తవిక దృష్టి ఉన్నవాడు కనుకనే బీజేపీ నుంచి వైదొలగి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పొత్తు పొసగక కొత్త వేదిక ‘ఆవాజ్-ఇ-పంజాబ్’ను నెలకొల్పిన తర్వాత మరో అడుగు ముందుకు వేయ డానికి ధైర్యం చాలలేదు. కాంగ్రెస్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉన్నదని పరిశీలకులు అంటున్నారు. సిద్ధూ సహకారం లేకుండానే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా కొత్త శాసనసభలో అవతరించే అవకాశం ఉన్నట్టు ఇండియా టుడే - ఒపీనియన్ పోల్ సర్వే సూచించింది. సిద్ధూ భుజం కలిపితే మెజారిటీ సాధించవచ్చు.  ఏదైనా ఒక పార్టీ తరఫున ప్రచారం చేసి దాని విజయానికి దోహదం చేయగలను కానీ సొంత పార్టీని విజయపథంలో నడిపించలేననే అవగాహన సిద్ధూకు ఉంది. అదేరకమైన జ్ఞానం పవన్‌కల్యాణ్‌కూ ఉన్నట్టు భావించాలి. కాంగ్రెస్‌కూ, సిద్ధూకూ మధ్య ఎటువంటి ఒప్పందం జరుగుతోందో ఇతరులకు తెలియనట్టే చంద్రబాబునాయుడికీ, పవన్ కల్యాణ్‌కీ మధ్య ఎటువంటి రహస్య అవగాహన ఉన్నదో, ముఖ్యమంత్రిపైన ఇసుమంత విమర్శ చేయడానికి కూడా పవర్ స్టార్ ఎందుకు సంకోచిస్తున్నారో మనకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు. రాజ కీయాలలో రాణించడానికి అవసరమైన తెగువ, శక్తి పవన్ కల్యాణ్‌కు లేవు.

కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు