పల్లెను మింగిన ‘పెద్దనోటు’

22 Nov, 2016 01:02 IST|Sakshi
పల్లెను మింగిన ‘పెద్దనోటు’

సందర్భం
దేశ ఆర్ధిక వ్యవస్థలో కరెన్సీ వాటా కేవలం 10 శాతం మాత్రమే. ఇందులో 2 శాతం కరెన్సీ గ్రామాల్లోని సమాంతర ఆర్ధిక వ్యవస్థలోనే చెలామణి అవుతు న్నట్లు అంచనా. పెద్దనోట్ల రద్దు ఈ వ్యవస్థనే ఛిద్రం చేసింది.

నరేంద్ర మోది చేపట్టిన ఆర్థికపరమైన సర్జికల్‌ దాడి నల్ల కుబేరులను కాకుండా,  సగటు మనిషి ఆర్థిక వ్యవ స్థను, మహిళల వంటింటి బడ్జెట్‌ను ఒక కుదుపు కుది పింది. సాగు మడి చుట్టూ కర్షకుడు నేర్పుగా నిలబెట్టు కున్న అతి సున్నితమైన ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. రూ. 10, రూ. 20 నోటు ఖర్చుతో జీవనం చేసే రైతాంగం మీదకు బలవంతంగా పెద్ద నోట్లను ప్రయోగించారు. మార్కెట్‌లోకి తెచ్చిన ధాన్యానికి రూ. 500, రూ. 1,000 నోటుతోనే లెక్కలు కట్టి అంటగట్టారు.

భారత ఆర్థిక వ్యవస్థలో కేవలం బ్యాంకింగ్‌ లావా దేవీలు మాత్రమే లేవు. కార్పోరేటు సంస్థలు, మల్టీ నేషనల్‌ కంపెనీల పెట్టుబడులకు, రాబడులకు వ్యూహ రచనలు చేసే పెద్ద మనుషుల ఊహలకు అందని మరో సమాంతర ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోనే అంతర్భాగం. ఈ ద్రవ్యనిధికి  కర్త, కర్మ, క్రియ పల్లె జనం, రైతాంగమే. పెట్టు బడులు, మిగులు, షేర్‌ మార్కెట్ల మార్మికత తెలియని పేద జనం  రెక్కల కష్టం పెట్టుబడుల మీద ఆధారపడి నడిచే ఆర్థిక వ్యవస్థ  ఇది. కోట్ల మంది సంపాదన పోగేస్తే రూ. లక్షలు మాత్రమే చేతిలో ఉంటుంది. ఇదంతా బ్యాంకు రికార్డులకు అందని డబ్బు. అటక మీద పాత ఇనుపరేకు సందకలో తాత్కాలికంగా నిలువ ఉండి నిత్యం ప్రజా మార్కెట్‌లో తిరిగే ద్రవ్యం..  

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పల్లెకు అల్లుకున్న బంధాలు, బంధుత్వాల మీద ఆధారపడి ఉంది. ఈS పొదరింట్లో బ్యాంకుల అవసరం బహు స్వల్పం. దేశంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే. భూ కమతాలు చాలా చిన్నవి.. ఏడాది అంతా కష్టపడితే రూ. 25 నుంచి రూ. 30 వేల ఆదాయానికి మించిన దిగుబడి ఉండదు. ఈ ఆదాయం మీద ఒక్క రైతు కుటుంబం మాత్రమే  కాకుండా  కుమ్మరి, కమ్మరి, రజక, గీత, గొల్లకుర్మ, ముదిరాజు దళిత తదితర చేతి వృత్తుల వారికి,  ఆడబిడ్డ,  అల్లుడు, అయినవారు మొదలైన బంధువులు, వ్యవసాయ కూలీలు ఆధార పడి జీవనోపాధి పొందుతారు. వచ్చిన దిగుబడిలో  సింహభాగం రైతు తీసుకొని మిగిలినవి ఎవరి వాటా వాళ్లకు పంచుతారు. వేలలో ఉండే ఈ మొత్తాలను దాచుకోవడానికి వారికి బ్యాంకుల అవసరం రాదు.

అటక మీదున్న ఇనుపరేకు సందక సరిపోతోంది. సమ కూరిన డబ్బులో  రైతు కొంత జీవనానికి వాడు కొని మరి కొంత సొమ్ము మరుసటి కారుకు పెట్టుబడిగా వినియోగిస్తే... మిగిలిన వారు వచ్చిన ఆదాయంతో కాలం గడుపుతారు. ఊర్లో ఎవరికైనా రోగమో, నొప్పో వచ్చినా మళ్లీ ఆ డబ్బే అక్కరకు వస్తుంది. ఆపద తీరుస్తుంది. ఇదంతా బ్యాంకు రికార్డులకు పన్నులు, లావాదేవీలకు దొరకని ‘లెక్క’. అంత మాత్రం చేత ఈ డబ్బును నల్లధనం అని అనగలమా? వాస్తవానికి పల్లెల్లో సజీవంగా ఉన్న  ఈ విధానమే దేశ ఆర్థిక వ్యవ స్థకు పట్టుగొమ్మ. 2009–10 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుది పేసిన సమయంలో కూడా సమాంతర ఆర్థిక వ్యవస్థే భారతదేశానికి అండగా నిలబడింది.

వాస్తవానికి కరెన్సీ రద్దు అనేది ఇప్పుడే మొదటి సారి జరుగలేదు.1946, 1978 సంవత్సరాల్లో రెండు సార్లు పెద్ద నోట్లను రద్దు చేసినా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కొద్ది శాతమే ఉన్న పెద్దనోట్లు కేవలం ధనవంతులకే పరిమితం కావటంతో సాధా రణ ప్రజలు ఇబ్బంది పడలేదు. రోజువారి జీవన కార్యాకలాపాలు సాఫీగానే సాగాయి.  తాజాగా రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు సామాన్య జన జీవ నంపై పెను ప్రభావాన్ని చూపెడుతోంది. యాసంగి సాగుతో పొలం పనుల్లో బిజిబిజిగా ఉండాల్సిన గ్రామీ ణులు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు గాస్తున్నారు. రూ. 500 నోటు చేతిలో పట్టుకొని పూట బువ్వ కోసం పడిగాపులు కాస్తున్నారు.

వాస్తవానికి  దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ వాటా కేవలం 10 శాతం మాత్రమే ఉంటే ఇందులో కనీసం 2 శాతం కరెన్సీ గ్రామీణ ప్రాంతంలో పాతుకుపోయిన సమాంతర ఆర్థిక వ్యవస్థలోనే చెలామణి అవుతున్నట్లు ఆర్థిక సర్వేలు చెప్తున్నాయి. నరేంద్రమోదీ చేసిన ఆర్థిక పరమైన సర్జికల్‌ స్రై్టక్‌ సరిగ్గా ఈ వ్యవస్థనే ఛిద్రం చేసింది. అకస్మిక పెద్ద నోట్ల నిర్ణయం రైతాంగాన్ని ఆత్మహత్యల వైపుకు పురిగొల్పుతోంది. సిద్ధిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం నా సొంత నియోజకవర్గం దుబ్బాకలోనే ధర్మారంలో రైతు కుటుంటాన్ని పెద్ద నోట్ల రద్దు కాటేసింది. పెండ్లికి ఎదిగిన ఆడబిడ్డ ఒకవైపు, అప్పుల కుంపటి ఇంకో వైపుతో ఇబ్బంది పడుతున్న  వర్ద బాలయ్య అనే రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంకా అలాంటి మరణాలు మరిన్ని చూడక ముందే మోదీ గ్రామీణ సమాంతర ఆర్ధిక వ్యవస్థను పరిరక్షించే ప్రయత్నం చేయాలి.  

వ్యాసకర్త శాసనసభ అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్రం 94403 80141
సోలిపేట రామలింగారెడ్డి

మరిన్ని వార్తలు