కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్‌ ఉండదు..

7 Jan, 2018 09:42 IST|Sakshi

అందుకే సివిల్స్‌ రాశా

సోషల్‌ మీడియాతో యువత పాడైపోతోంది

కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్‌ ఉండదు

పుష్కరాల్లో పనిచేయడం దైవసేవ

సాక్షితో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నాన్న స్ఫూర్తితో సివిల్స్‌కు ప్రయత్నించాను. మా నాన్నగారు ఫ్యాక్షన్‌ పడగవిప్పిన సమయంలో రాయలసీమలో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పనితీరు, ఫ్యాక్షన్‌ను అణగదొక్కడానికి ఆయన తీసుకుంటున్న చర్యలు నన్ను పోలీసు కావడానికి ప్రేరేపించాయి. డిగ్రీ చదువుతున్నప్పుడే సివిల్స్‌కు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాను. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేశాను. అక్కడ యువతను మావోయిజం వైపు నుంచి మళ్లించేందుకు వారికి ఉపాధి కల్పించే దిశగా తీసుకున్న చర్యలు విజయవంతం కావడం నాకు

ఇప్పటికీ గుర్తుండిపోయే అంశం. నేడు యువత సోషల్‌మీడియా ఉచ్చులో పడి చెడిపోతోంది. సోషల్‌మీడియాలో ఉన్న మంచిని స్వీకరించవచ్చు గాని నేరం ఎలా చేయాలో మీడియాలో చూసి నేర్చుకుని ఆ వైపుగా యువత వెళ్లడం బాధ కలిగిస్తోంది. సోషల్‌ మీడియాలో వెయ్యి మంది స్నేహితులు ఉండటం కన్నా బయట మంచి స్నేహితులు నలుగురైదుగురు ఉంటే యువత తమ భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటుందని అభిప్రాయపడుతున్న పశ్చిమగోదావరి జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు ఎం.రవిప్రకాష్‌ సాక్షి ప్రతిని«ధితో పంచుకున్న అంతరంగం ఆయన మాటల్లోనే.

కుటుంబ నేపథ్యం : తండ్రి రామచంద్రయ్య రిటైర్డ్‌ అదనపు ఎస్పీ, తల్లి సరోజనమ్మ, భార్య సుకన్య, కుమారుడు సూర్య  చదువు : డిగ్రీ బీఎస్సీ (పీసీజెడ్‌) తిరుపతిలో, ఎంఎస్సీ మైక్రో బయోలజీ. డిగ్రీ చదివేనాటి నుంచే సివిల్‌ సర్వీస్‌ పట్ల ఆసక్తి, హైదరాబాద్‌లో కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు శిక్షణ తీసుకున్నాను. వ్యక్తిగతం: సొంత జిల్లా చిత్తూరు. చదువు అంతా కడప, అనంతపురం, చిత్తూరులోనే సాగింది. నాన్న  రామచంద్రయ్య పోలీస్‌ అధికారిగా పనిచేయటంతో పోలీస్‌ అవ్వాలనే కోరిక ఉండేది. చేస్తే పోలీస్‌ అధికారిగానే పనిచేయాలనే లక్ష్యం ఉండేది. అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షన్‌ అధికంగా ఉండేది. తండ్రి సిన్సియర్‌ ఆఫీసర్‌గా చేయటంతో అదేస్థాయిలో తానూ చేయాలనే బలమైన కాంక్ష ఉండేది.

కెరీర్‌ : ఎక్కువగా మావోయిస్ట్‌ ప్రాబల్యం ఉన్న తెలంగాణలోనే చేశాను. సిరిసిల్ల, పెద్దపల్లి, తాడిపత్రిలో డీఎస్పీగా పనిచేశా. ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలో మావోయిస్టు ప్రభావం తీవ్రస్థాయిలో ఉండేది. చాలా ఆపరేషన్స్‌లో పాల్గొన్నా. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేసి మంచి ఫలితాలు సాధించా.

అచీవ్‌మెంట్స్‌: కఠిన సేవా పతకం 2005లోనూ, ముఖ్యమంత్రి శౌర్యపతకం 2009లోనూ ప్రభుత్వం అందించింది. ఇవికాకుండా అనేక మెడల్స్‌ అందుకున్నాను.

హాబీలు: షటిల్‌ బ్యాడ్మింటన్, బుక్‌ రీడింగ్, స్మిమ్మింగ్‌ అంటే బాగా ఇష్టం. పోలీస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టటంతో భారత చట్టాలు, జడ్జిమెంట్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వంటి పుస్తకాలను చదవటం అలవాటయింది. ఇక చార్లెస్‌ డికిన్స్‌ రాసిన డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్, డిటెక్టివ్‌ పుస్తకం షెర్లాక్‌ హŸమ్స్‌ అంటే చాలా మక్కువ.

‘మావూరికి రండి’ : సిరిసిల్లలో పనిచేసే రోజులు బాగా సంతృప్తి నిచ్చాయి. యువత మావోయిస్టు భావజాలానికి ప్రభావితులు కాకుండా కట్టడి చేయటం గుర్తుండిపోతుంది. ప్రధానంగా ‘మావూరికి రండి’ కార్యక్రమం అద్భుతమైంది. సిరిసిల్లలో పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడే రోజులవి. గ్రామస్తులే ఉద్యోగులకు రక్షణ వలయంగా ఉండేవారు. ఇళ్లు సైతం అద్దెలు లేకుండా గ్రామస్తులే ఏర్పాటు చేసేవారు. వీఆర్‌వోలు, పంచాయతీ సెక్రటరీలు, ఉపాధ్యాయులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఇలా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసేలా చేయటం మంచి అచీవ్‌మెంట్‌గా మిగిలిపోయింది.

ఫీల్‌ గుడ్‌:  మారుమూల గ్రామాల్లోని యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి సెక్యూరిటీ గార్డులుగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పించాం. 5వేల మంది యువతకు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పించటం సంతృప్తినిచ్చింది. గుంటూరులో పనిచేసే కాలంలో గిరిజన తండాలోని యువతకు ఉద్యోగ సాధనకు శిక్షణ ఇప్పించా. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ వంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో 100మందికి చోటు కల్పించటం మర్చిపోలేను. చింతూరు, రంపచోడవరంలో జనమైత్రిలో భాగంగా యువతకు ఉపాధి, ఉద్యోగ శిక్షణలు ఇవ్వటం.

భగవంతుడి సేవ: తూర్పుగోదావరి జిల్లాలో మూడేళ్లు పనిచేశా. గోదావరి పుష్కరాల్లో పనిచేశాను. భద్రాచలం నుంచి సఖినేటిపల్లి, అంతర్వేది వరకూ ఉన్న 500 ఘాట్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం (రాజమండ్రి నా పరిధిలోకి రాదు). పుష్కరాల్లో పనిచేయటం, భగవంతుని సేవగా భావించాను.

కలచివేసింది: మహబూబ్‌నగర్‌లో పనిచేసే రోజుల్లో మావోయిస్టులు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను చంపటం తీవ్రంగా బాధించింది. కోర్టు సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన నిరాయుధులైన కానిస్టేబుళ్లను కిరాతకంగా హతమార్చటం కలచివేసింది. అదేస్థాయిలో విజయవాడ పడమటలో ఒక మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేయటం సమాజంలో నైతిక విలువలు దిగజారిపోయాయి అనేం దుకు నిదర్శనంగా ఉన్నాయి.

యువతకు సందేశం: సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో యువత, విద్యార్థులు పెడదారి పట్టటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు యువత తమ శక్తిని వినియోగించాలి. నేడు అధికంగా క్రిమినల్‌ కేసుల్లో యువత ఉంటోంది. హత్యలు, అత్యాచారాలు, జూదం, ట్రాప్‌లు వంటివాటిలో ఉండడం మానుకోవాలి. క్రిమినల్‌ కేసులు నమోదైతే భవిష్యత్తు నా«శనం అవుతుంది.

మరిన్ని వార్తలు