ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యం

16 Nov, 2023 00:54 IST|Sakshi

తాడేపల్లిగూడెం రూరల్‌: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ప్రజల బాగు కోరుకునే ఏకై క వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని మాధవరం జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్‌ ముప్పిడి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 20 నుంచి 30 ఏళ్లలోపు వారికి షుగర్‌, మహిళలకు రక్తహీనత వంటి వ్యాధులు వస్తున్నాయని, వీటిని గుర్తించడం లేదన్నారు. ముందుగా గుర్తించి ఇటువంటి శిబిరాల ద్వారా నయం చేసుకోవచ్చన్నారు. అలాగే, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్‌ బాటలోనే సీఎం జగన్‌ ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలనపై పచ్చమీ డియా దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబును గద్దెనెక్కించాలని పవన్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు రద్దవుతాయని, దీనిని ఎవరైనా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఆరోగ్యశ్రీ, 108 పథకాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని, ఇప్పుడు బాబు షూరిటీ–భవిష్యత్‌ గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల వరకే గ్యారంటీ అని చలోక్తి విసిరారు. చంద్రబాబు తప్పుడు హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. మాధవరం గ్రామంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.43.5 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. ప్రజల మరోమారు జగన్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 962 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఆర్డీఓ కె.చెన్నయ్య, ఏఎంసీ చైర్మన్‌ ముప్పిడి సంపత్‌కుమార్‌, ఎంపీపీ పొనుకుమాటి శేషులత మాట్లాడారు. జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీ జంపెల్లి సత్యవతి, కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్‌ వెలిశెట్టి నరేంద్రకుమార్‌, నవాబుపాలెం సొసైటీ చైర్మన్‌ జడ్డు హరిబాబు, సర్పంచ్‌లు ఉండ్రాజవరపు చంద్రిక, ఎలిపే గాంధీ, ఎంపీడీఓ ఎం.విశ్వనాథ్‌, ఈవోపీఆర్డీ ఎం.వెంకటేష్‌, పంచాయతీ ఈఓ ఆర్‌వీ బ్రహ్మం, ఏపీఎం జీవీకేడీఎం లక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల మహిళా అధ్యక్షురాలు నూనె రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

మరిన్ని వార్తలు