మీ స్మార్ట్‌ ఫోన్‌ స్పీడ్‌ తగ్గిందా.. అయితే ఇలా!

10 Jan, 2018 11:36 IST|Sakshi

నిడమర్రు : స్మార్ట్‌ ఫోన్‌ కొత్తలో మంచి స్పీడ్‌గా ఉంటుంది. అప్లికేషన్లు వేగంగా కదులుతాయి, కానీ కొన్ని నెలల వాడకం తర్వాత మీ ఫోన్‌ స్పందించే తత్వం తగ్గిపోయి, దాని స్పీడ్‌ నెమ్మదిస్తుంది. అత్యవసరం అయినప్పుడు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఎదరవుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ వేగంగా పెంచాలంటే అందుకు అవసరమైన సూచనలు నిపుణులు వివరిస్తున్నారు.

యాప్స్, వాల్‌పేపర్స్‌
స్మార్ట్‌ ఫోన్లో స్టోరేజీ ఉందని నచ్చిన ప్రతీ యాప్‌ ఇన్‌స్టాల్‌ చెయ్యడం వల్ల ఫోన్‌ వేగం తగ్గుతుంది. అవసరమైన యాప్‌ మినహా మిగిలినవి అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి. లైవ్‌ వాల్‌పేపర్లు, హోమ్‌ స్క్రీన్‌పై కదిలే వాల్‌ పేపర్లు అధికంగా ఉంచుకోవద్దు.

బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్‌..
ఫోన్లోని కొన్ని యాప్స్‌ ఫోన్‌తో పాటే ప్రారంభం అవుతుంటాయి. కొన్ని ఆన్‌లైన్‌ సర్వీసులను వినియెగించుకుంటుంటాయి. ఈ రెండూ స్మార్ట్‌ ఫోన్‌ స్లో అయ్యేందుకు కారణం అవుతాయి. బ్యాక్‌ గ్రౌండ్‌లో రన్‌ అవుతున్న యాప్స్‌ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లో యాప్స్‌ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లో యాప్స్‌కు వెళ్లాలి. అక్కడ రన్నింగ్‌ అనే దాన్ని ఎంచుకుంటే బ్యాక్‌ గ్రౌండ్‌లో రన్‌ అవుతున్న యాప్స్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. యాండ్రాయిడ్‌ సాప్ట్‌వేర్‌ సహా పలు యాప్స్‌ రన్‌ అవుతుంటాయి. అందులో మీకు అవసరం లేనివి ఉంటే వాటిని వెంటనే ఆన్‌ ఇన్‌స్టాల్‌ లేదా డిజేబుల్‌ చేసుకోవాలి.

అలాగే బ్యాక్‌ గ్రౌండ్‌లో యాప్స్‌ సింకింగ్‌ అవుతున్నాయా? లేదా అన్నది గమనించాలి. వీటి సింక్రనైజేషన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేయాలి. దీనివల్ల డేటాతోపాటు సిస్టమ్‌ రీసోర్సెస్‌ కూడా ఆదా అవుతాయి. ఇందుకోసం సెట్టింగ్స్‌లో డేటా యూసేజ్‌కు వెళ్లాలి. కొన్నింటిలో వైర్‌లెస్‌ అండ్‌ నెట్‌ వర్క్స్‌లో యూసేజ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. ఇందులో స్క్రోల్‌ డౌన్‌ చేస్తే ఏ యాప్స్‌ డేటాను ఎక్కువగా వాడుతున్నామనే వివరాలు తెలుస్తాయి. విడిగా ఒక్కో యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సింక్రనైజేషన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు.

యాప్‌ కిల్లర్‌తో..
అడ్వాన్స్‌డ్‌ టాస్క్‌ కిల్లర్‌ అనే ఒక యాప్‌ ఉంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అధికంగా ర్యామ్‌ను వినియోగించుకునే, ఫోన్‌ను స్లో చేస్తున్న ఏ యాప్‌ను అయినా సులభంగా కిల్‌ చేయవచ్చు.

క్యాచే డేటా క్లియర్‌ చేయాలి
యాప్స్‌ను వాడుతున్నప్పుడు క్యాచే డేటా పోగవుతుంది. వాటిని క్లియర్‌ చేస్తుండాలి. క్యాచే అంటే మీరు ఓ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను యాక్సెస్‌ చేసినప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్‌ క్యాచే ఫైల్స్‌ రూపంలో నిల్వ చేస్తుంది. తర్వాత మరోసారి అదే వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అంతకుముందు నిల్వ ఉన్న సమాచారం ఆధారంగా వెంటనే ఓపెన్‌ చేస్తుంది. క్యాచే డేటా నిల్వ చేయడానికి ప్రధాన కారణం సంబంధిత వెబ్‌సైట్లు, యాప్స్‌ను తిరిగి ఓపెన్‌ చేసినప్పుడు వేగంగా లోడ్‌ చేసేందుకే, ఇందుకోసం యాక్సెస్‌ చేసిన ప్రతీ సైట్, యాప్‌ సమాచారం క్యాచేలుగా లోడ్‌ అయి ఉంటుంది. ఇది అంతా ఫోన్‌ మెమొరీపై భారాన్ని మోపుతుంది. దీంతో ఎప్పటికప్పుడు క్యాచే డేటా క్లియర్‌ చేసుకోవాలి

అంతర్గత స్టోరేజ్‌..
స్మార్ట్‌ ఫోన్లో ఇన్‌ బిల్ట్‌గా ఉండే స్టోరేజీ పూర్తిగా నిండిపోయినా ఫోన్‌ స్పీడ్‌ తగ్గిపోతుంది. స్టోరేజ్‌ సున్నాకు చేరితే కొన్ని ఫంక్షన్ల నిర్వహణ కష్టమైపోతుంది. ఫైల్స్‌ను ఒక లొకేషన్‌ నుంచి మరో లొకేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసే విషయంలోనూ వేగం మందగిస్తుంది. ఎప్పుడూ కనీసం 10 నుంచి 20 శాతం ఇన్‌బిల్ట్‌ స్టోరేజీ ఖాళీగా ఉంచుకోవాలి. ఒక వేళ అదనపు స్టోరేజ్‌ కావాలనుకుంటే మైక్రో ఎసీడీ లాంటివి వాడుకోవాలి.

సాఫ్ట్‌వేర్‌ అప్‌ టు డేట్‌..
సిస్టమ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఎప్పటికప్పుడు ఆప్‌ టు డేట్‌ (తాజా వెర్షన్‌తో) ఉండాలి. సాఫ్ట్‌వేర్‌ ఆప్‌ టు డేట్‌ వల్ల కొన్ని అదనపు ఫీచర్లతో వస్తుంటాయి. పనితీరుపై ప్రభావం చూపించే బగ్స్‌ను తొలగించి ఆప్‌డేట్‌ వెర్షన్‌ తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లో ఆప్‌డేట్‌ ఆప్షన్‌ ఉంటుంది.

ఫ్యాక్టరీ డేటా రీసెట్‌
పైన తెలిపిన సూచనలు పాటించినా వేగం పెరగకపోతే చివరి అస్త్రంగా ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ క్లిక్‌ చేయాలి. దీనికి ముందు మీ ఫోన్‌లోని ముఖ్యమైన ఫైల్స్, డేటా అంతటినీ ఎక్స్‌టర్నల్‌ మెమొరీలోకి కాపీ చేసుకోవాలి. దీంతో మీరు ఫోన్‌ కొన్నప్పుడు ఎలా ఉందో తిరిగి అదే స్థాయికి వెళుతుంది. దీంతో మీకు అవసరమైన అప్లికేషన్‌ మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు