బాబు కోసం ఈనాడు విషపు రాతలు

24 Feb, 2023 15:36 IST|Sakshi
● ఈనాడు ప్రతులను దహనం చేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ● ఇలాంటి పత్రికలు రాష్ట్రంలో ఉండరాదన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేట: చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో 90 ఏళ్ల రామోజీరావు తన ఈనాడు దినపత్రికలో నీతి, నిజాయితీతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషపురాతలు రాయిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు గురువారం సాయంత్రం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట ఈనాడు దినపత్రిక ప్రతులను నాయకులు, కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. పాత ఫొటోలు జోడించి తప్పుడు కథనం వండివార్చిన ఇలాంటి పత్రికలు రాష్ట్రంలో ఉండరాదన్నారు. చంద్రబాబు, రామోజీరావు, డాక్టర్‌ అరవిందబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉండగా ప్రజావ్యతిరేక పనులు చేయడంతోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని తిరస్కరించారన్న విషయాన్ని రామోజీరావు గుర్తించాలని చెప్పారు. పట్టాభికి దెబ్బలు తగిలాయంటూ పాత ఫొటోలతో వార్త రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి రామోజీ ఒడిగట్టి పత్రికలకు ఉన్న ప్రాధాన్యతను చంపేశాడన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పత్రికను చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనే తపనతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై రోజుకొక కట్టుకథను అల్లి ప్రచారం చేస్తున్నాడన్నారు. వివేకానందరెడ్డి హత్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన సంఘటనని, అప్పుడేమి వార్తలు రాయకుండా ఇప్పుడు సీబీఐ చెప్పినట్లుగా సీఎం జగన్‌పై రోజుకొక కట్టుకథను ప్రజల్లోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 15వ తేదీ జీతాలు ఇస్తుండగా ఒక్క వార్త రాసేందుకు ధైర్యం చేయని రామోజీరావు, ఏపీలో మాత్రం జీతాలు ఆలస్యమంటూ రాస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మోస్తూ లోకేష్‌ను జాకీలతో లేపేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నా లేవట్లేదన్నారు. ఇక్కడ ఒక టీడీపీ నాయకుడి హత్య జరిగి, అది చేసింది టీడీపీ నాయకులేనని, మరణవాంగ్మూలంలో చెప్పినా, ఈ విషయంలో తాము చాలెంజ్‌ విసిరినా వైఎస్సార్‌సీపీ నాయకులే చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పౌడా చైర్మన్‌ మిట్టపల్లి రమేష్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.సుజాతాపాల్‌, మాజీ కౌన్సిలర్లు నెలటూరి మురళి, మాడిశెట్టి మోహనరావు, షేక్‌ మస్తాన్‌వలి, ఎస్సీ సెల్‌, బీసీ సెల్‌ పట్టణ అధ్యక్షులు మల్లెల అశోక్‌,, అచ్చిశివకోటి, నాయకులు తలారి నాని, మారూరి శివారెడ్డి, సయ్యద్‌ ఖాదర్‌బాషా, బత్తుల విష్ణు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు