తీరనున్న కల.. హైవే.. లైన్‌ క్లియర్‌

7 Jul, 2022 18:28 IST|Sakshi

167–బి జాతీయ రహదారి నిర్మాణానికి చర్యలు

సింగరాయకొండ టు మైదుకూరు వరకు 195 కి.మీ. 

మొదటి దశ పనుల ప్రారంభానికి సిద్ధమైన ఎన్‌హెచ్‌ అధికారులు

ఇప్పటికే పరిహారం చెల్లింపు

కందుకూరు వాసులను ఐదు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న 167–బి జాతీయ రహదారి నిర్మాణం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇప్పటికే భూసేకరణను పూర్తి చేసిన అధికారులు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కందుకూరు ప్రజల జాతీయ రహదారి కల తీరనుంది. 

కందుకూరు(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): కేంద్ర ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో రాష్ట్రంలో మూడు రోడ్లను జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. వాటిలో 167–బి ఒకటి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి (చెన్నై టు కోల్‌కతా – ఎన్‌హెచ్‌ 16) కడప జిల్లా మైదుకూరు వరకు (ఎన్‌హెచ్‌ 67) ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి 195 కి.మీల మేర పదిమీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. 

ఈ రోడ్డు సింగరాయకొండ, కందుకూరు, పోకూరు, వలేటివారిపాళెం, మాలకొండ, పామూరు, సీఎస్‌పురం, డీజీపేట, అంబవరం, టేకూరుపేట, రాజాసాహెబ్‌పేట, వనిపెంట మీదుగా మైదుకూరు వరకు సాగనుంది. దీనికి 2018 కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వర్చువల్‌ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ కారణాలతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పనులను మొదలు పెట్టేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్యాకేజీ కింద వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు వేస్తున్నారు. 
 
మొదటి ప్యాకేజీ పనులిలా..
మొదటి ప్యాకేజీ కింద ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని మాలకొండ వరకు 45 కి.మీ. మేర రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.263 కోట్లను ఇప్పటికే కేటాయించారు. సింగరాయకొండ, కందుకూరు, వలేటివారిపాళెం మండలాల్లోని పలు గ్రామాల్లో భూసేకరణను పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాలను సేకరించి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని కూడా జమ చేశారు. గతేడాది ఆగస్టులోనే టెండర్లు పిలిచారు. 32 శాతం తక్కువకు టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ తర్వాత పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో దానిని రద్దు చేసిన ఎన్‌హెచ్‌ అధికారులు కొత్తగా టెండర్లు పిలిచారు.

అది త్వరలో ఫైనల్‌ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే మొదటి ప్యాకేజీ పనులు ప్రారంభించనున్నారు. అలాగే మాలకొండ నుంచి సీఎస్‌ పురం వరకు రెండో ప్యాకేజీగా, సీఎస్‌ పురం నుంచి నెల్లూరు, కడప అడ్డరోడ్డు వరకు మూడో ప్యాకేజీగా, కడప అడ్డరోడ్డు నుంచి మైదుకూరు వరకు నాలుగో ప్యాకేజీగా టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 

తీరనున్న కల
నిన్నటి వరకు అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన కందుకూరు పట్టణానికి భారీ స్థాయిలో రహదారి సౌకర్యం ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం 167–బి నిర్మాణంతో కందుకూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి కొరత తీరనుంది. మొదటి దశలో 45 కి.మీ. రహదారి నిర్మాణంలో నాలుగైదు కిలోమీటర్లు మినహా మిగిలింది మొత్తం కందుకూరు నియోజకవర్గంలోనే జరుగుతుంది. ప్రధానంగా పట్టణానికి దక్షిణం వైపు భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే పోకూరు, వలేటివారిపాళెం వంటి ప్రాంతాల్లోనూ ఊరిబయటి నుంచి హైవే వెళ్తుందని భావిస్తున్నారు. ప్రవిత్ర పుణ్యక్షేత్రం మాలకొండకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడనుంది.  

మరిన్ని వార్తలు