ఫ్లిప్‌కార్ట్‌లో కత్తులు కొని.. దోస్త్‌ కోసం 33 సార్లు పొడిచాడు

7 Jul, 2022 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మారణాయుధాలు కలిగి ఉన్న మైనర్‌తో సహా మరో వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు బాకులు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్‌ జిల్లా, ధరూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఫవాద్‌ ఖురేషీ పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. రాజేంద్రనగర్‌ సన్‌సిటీలోని పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ బాలుడు ఇతని అనుచరుడు.

చెడు వ్యసనాలకు బానిసలైన వీరు ఇరువురు దారి దోపిడీలు, హత్యలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రెండు కత్తలు (డాగర్స్‌) కొనుగోలు చేశారు. రాత్రి వేళల్లో వాటిని వెంట పెట్టుకొని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 4న వారు ఇద్దరు బైక్‌పై షాహీన్‌నగర్‌లో సంచరిస్తుండగా ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ), బాలాపూర్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఖురేషీని జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించగా, మైనర్‌ను జువైనల్‌ బోర్డ్‌ ఎదుట హాజరుపరిచారు. 

దోస్త్‌ కోసం 33 సార్లు పొడిచాడు.. 
ఫవాద్‌ ఖురేషీ స్నేహితుడికి అతడి పిన్ని భర్తతో గొడవ జరిగింది. దీంతో బాబాయిని చంపాలని నిర్ణయించుకున్న అతను ఈ విషయాన్ని ఖురేషీకు తెలిపాడు. దీంతో వారు ఇద్దరు కలిసి బాబాయి హత్యకు ప్లాన్‌ చేశారు. స్నేహితుడు బేస్‌బాల్‌ కర్రతో బాబాయి తలపై కొట్టగా.. ఖురేషీ 33 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తాజాగా ఖురేషీ పట్టుబడిన సమయంలో ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఈ హత్యపై విచారించగా.. ఆ హత్యలో తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, దోస్త్‌ కోసమే చంపానని చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ కేసులో అరెస్టై ఖురేషీ జైలుకు వెళ్లి గతేడాది డిసెంబర్‌లో విడుదలయ్యాడు.

మరిన్ని వార్తలు