ప్రైవేట్‌ స్కూళ్లలో పేదల పిల్లలకు 25 % సీట్లు

5 Aug, 2022 04:00 IST|Sakshi

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

1వ తరగతి ప్రవేశాలపై ప్రభుత్వం ఏర్పాట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనా«థ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు

లాటరీ పద్ధతిలో ఎంపిక

సాక్షి, అమరావతి: పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు.

ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు.

16 నుంచి దరఖాస్తు ప్రక్రియ
2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్‌ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు  http://cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు