దట్టమైన అడవిలో 350 ఏళ్లనాటి దిగుడు బావి.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

4 Dec, 2022 09:07 IST|Sakshi
ప్రకాశం జిల్లా మైలచర్ల అటవీ ప్రాంతంలోని బావి 

సాక్షి, తెనాలి(గుంటూరు జిల్లా): అది బావి మాత్రమే కాదు.. ఓ ఇంజనీరింగ్‌ అద్భుతం.. మన వాళ్ల ప్రతిభకు తార్కాణం.. ప్రకాశం జిల్లాలోని మైలచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావిని చూస్తే.. ఎవరైనా ఔరా అనాల్సిందే. అంత అత్యద్భుతంగా ఉంటుంది దాని నిర్మాణ కౌశలం. లేత గోధుమ రంగు గ్రానైట్‌ రాళ్లను అందంగా చెక్కి ఆ బావిని నిర్మించారు. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధక బృందం చిట్టడవిలో ప్రయాణించి మరీ ఈ అందమైన దిగుడు బావిని వెలుగులోకి తెచ్చింది. 
ఆ విశేషాలను ‘సాక్షి’కి వెల్లడించింది.

ఆ బావి మెట్లు.. కనికట్టు!
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలచర్ల అటవీగ్రామం వెలుపల ఉందీ దిగుడు బావి. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకులైన మొవ్వ మల్లికార్జునరావు, చిట్టినేని సాంబశివరావు, బోడపాటి రాఘవయ్య, ముత్తేవి రవీంద్రనాథ్‌లు ఈ బావి గురించి సూచాయిగా విన్నారు. దీంతో ఆ బావిని సందర్శించాలన్న కోరిక వారికి కలిగింది. గత నెలాఖరులో అక్కడకు ప్రయాణం కట్టారు. చంద్రశేఖరపురం మండలంలోని వేట్ల బయలు(వి.బైలు) అనే గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన మైలచర్లకు చేరుకున్నారు.

అక్కడి నుంచి చిట్టడవిలో కొంత దూరం ప్రయాణించాక వెలుగుచూసింది.. ఆ అద్భుతమైన బావి. ఆ మెట్ల బావి డిజైన్, అనితర సాధ్యమైన నైపుణ్యంతో రూపొందించిన తీరు అద్భుతమని రవీంద్రనాథ్‌ బృందం చెప్పింది. ఊటబావి చుట్టూ పటిష్టంగా నిర్మించిన రాతి కూర్పు కారణంగా గట్టు నుంచి మట్టి పెళ్లలు విరిగిపడి నీరు కలుషితమయ్యే అవకాశమే లేదు. పటిష్టంగా నిర్మించిన రాతి మెట్ల కారణంగా చివరివరకు కిందికి దిగి శుభ్రమైన మంచినీటిని తీసుకెళ్లే వీలు గ్రామీణులకు లభించింది.

ప్రస్తుతం నీరు కొద్దిగా మురికిగా ఉన్నా.. తీయదనాన్ని కోల్పోకపోవడం విశేషం. ఇప్పుడు పరిస్థితి కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా.. గతంలో తరచూ దుర్భిక్షం తాండవించే ప్రాంతం అది. బిందెడు మంచినీటి కోసం సుదూర గ్రామాల ప్రజలు మైలచర్ల అటవీ ప్రాంతంలోని సహజసిద్ధమైన మంచినీటి ఊట దగ్గరకు వచ్చేవారట. 

‘గండి సోదరుల’ అద్భుత సృష్టి
భైరవకోన గుహాలయాల్లో క్రీ.శ 1675 ప్రాంతంలో నివసించిన ఒక సాధువు.. ఆ ప్రాంత ప్రజల తాగునీటి ఇక్కట్లను గమనించి పరిష్కారాన్ని ఆలోచించారు. మైలచర్ల నీటి ఊట దగ్గర ఒక సౌకర్యవంతమైన దిగుడు బావిని నిర్మించాలని తన శిష్యులైన ‘గండి సోదరులు’గా ప్రసిద్ధులైన పశువుల పెంపకందార్లను ఆదేశించడంతో ఈ బావిని వారు నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు.
చదవండి: కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?

మరిన్ని వార్తలు