కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం

27 Feb, 2022 05:45 IST|Sakshi
మాట్లాడుతున్న విజయ్‌కుమార్‌. చిత్రంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

వచ్చే నెల 3వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం నిర్ణయం

కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లు

రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌

అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌:  కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు ఏ ప్రిల్‌ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. శనివారం ఆయన సర్వే, సెటిల్మెంట్‌ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌తో కలిసి అనంతపురం కలెక్టరేట్‌లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, వైఎస్సార్‌ జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను పరిశీ లించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరా లు, సలహాలు తీసుకుంటామని తెలిపారు. వీటిపై కలెక్టరు నివేదిక పంపుతారన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ ఇస్తుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల ఆకాంక్ష ల మేరకే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొత్త జిల్లాలన్నింటిలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లు నిర్మించాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. రాయలసీమలో కొత్త జిల్లాలపై 1,600కు పైగా అ భ్యంతరాలు వచ్చాయన్నారు.  

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పెనుకొండ గానీ, హిందూపురం గానీ పెట్టాలన్న భావన వ్యక్తమైందన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందన్నారు. రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో కలపాలని, కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో ఉంచమని కోరుతున్నారన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న డిమాండ్‌ వచ్చిందని చెప్పారు. నగరిని తిరుపతిలో ఉంచాలని అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి అంశం పూర్వాపరాలు, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు