వ్యాక్సినేషనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత

19 Jan, 2021 04:59 IST|Sakshi

ఆటంకాలు రాకూడదనే ఇప్పుడు ఎన్నికలు వద్దన్నాం 

ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వాన్ని ఓ విరోధిగా చూస్తున్నారు 

సంప్రదింపులను ఓ ఫార్స్‌గా మార్చేశారు 

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో ఎలాంటి దోషం లేదు 

పంచాయతీ ఎన్నికలపై విచారణలో హైకోర్టుకు నివేదించిన ఏజీ 

తదుపరి విచారణ నేటికి వాయిదా 

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది. ఉదయం 10.50 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకూడదన్న ఉద్దేశంతోనే పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై అభ్యంతరం చెబుతున్నామని తెలిపారు. ఏక కాలంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితిలో అధికార యంత్రాంగం లేదన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ 50 శాతానికి మించదని, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో సైతం ఇదే జరిగిందని తెలిపారు. ఏజీ ఇంకా ఏం చెప్పారంటే..  

ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు
► ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభ్యంతరాలు వేటిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులను, ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వాన్ని ఓ భాగస్వామిగా కాకుండా విరోధిగా చూస్తున్నారు. చిత్తశుద్ధితో సంప్రదింపులు జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఓ ఫార్స్‌గా మార్చేశారు.   
► వ్యాక్సినేషన్‌ కోసం డ్రైరన్‌ నిర్వహించాం. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా పూర్తి చేశాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 23 ప్రభుత్వ శాఖలు పాలు పంచుకుంటాయి. ఒక్కో శాఖకు ఒక్కో నిర్ధిష్టమైన బాధ్యత ఉంటుంది. 1, 2 కేటగిరీల కింద 3.7 లక్షల మంది వైద్య సిబ్బంది, 7 లక్షల మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ఉంటారు.  
► మూడో కేటగిరి కింద 50 ఏళ్లు పైబడిన 95 లక్షల మందికి, వివిధ జబ్బులతో బాధపడుతూ 50 ఏళ్ల లోపున్న 45 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నాం. వ్యాక్సిన్‌ లభ్యత, ప్రజల స్పందనను బట్టి వ్యాక్సినేషన్‌ ఉంటుంది. ఈ వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తాం.  

రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం  
‘కర్ణాటక, కేరళ రాష్ట్రాల స్థానిక ఎన్నికల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వ్యాక్సిన్‌ ఇస్తున్నది కేవలం 3.7 లక్షల మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకే. ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేయడం ద్వారా సింగిల్‌ జడ్జి పొరపాటు చేశారు’ అని ఎన్నికల కమిషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వివరించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కు దురుద్దేశాలు అంటగట్టింది. ఆయన్ను తన పిటిషన్‌లో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. రాజ్యాంగ విధులను నిర్వర్తించడం దురుద్దేశం ఎలా అవుతుంది?’ అని నిమ్మగడ్డ రమేశ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం.. ఎస్‌ఈసీ న్యాయవాది తిరుగు సమాధానం ఇచ్చేందుకు వీలుగా విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో దోషం లేదు
► కోవిడ్‌ను దైవ ఘటన (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌)గా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు. అందువల్ల వాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి కానివ్వండి. దీనిని మీరే (హైకోర్టు) స్వయంగా పర్యవేక్షించండి. ఎన్నికల నిర్వహణను మేం ప్రతికూలంగా 
చూడటం లేదు. 
► సింగిల్‌ జడ్జి సహేతుక కారణాలతోనే ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేశారు. ఆ ఉత్తర్వులో ఎలాంటి దోషం లేదు. సింగిల్‌ జడ్జి ఇచ్చింది తీర్పు కాదు. దానిపై అప్పీల్‌ దాఖలు చేయడానికి వీల్లేదు. అలా దాఖలు చేసే అప్పీల్‌కు విచారణార్హత లేదు.  

ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు  
‘కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. పౌరుల ప్రాణాలకే కేంద్రం అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఎన్నికలు ఎప్పుడు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ రాష్ట్రం ఒకే సమయంలో వ్యాక్సినేషన్, స్థానిక ఎన్నికలు పెట్టుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. మా ప్రాధాన్యత మాత్రం వ్యాక్సినేషన్‌కే’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు