పోలీసులపై జేసీ దివాకర్‌ రెడ్డి అనుచిత ప్రవర్తన

9 Oct, 2020 15:46 IST|Sakshi

సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. తాడిపత్రి పోలీసులను హేళనగా మాట్లాడుతూ నోరు పారేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... ముచ్చుకోటలో జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన క్వారీల్లో మైనింగ్‌ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ మైనింగ్‌పై అధికారులు వివరాలు సేకరించారు. దీంతో జేసీ దివాకర్‌ రెడ్డి మైనింగ్‌ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. అక్కడకు వచ్చిన పోలీసులను హేళన చేస్తూ మాట్లాడారు. (దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌)

సీఐ తేజోమూర్తిని పరోక్షంగా జేసీ దివాకర్‌ రెడ్డి బెదిరించారు. మీ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ‘మా అనుచరులు రాక్షసులు. టీడీపీ అధికారంలోకి వస్తే రెచ్చిపోతారు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉంటారు. పోలీసులు మీ భవిష్యత్‌ పాడు చేసుకోవద్దు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ జేసీ దివాకర్‌ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి కూడా విధుల్లో ఉన్న సీఐ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించడంతో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. (మరో వివాదంలో జేసీ దివాకర్‌ రెడ్డి)

మరిన్ని వార్తలు