పత్తి మొత్తం ఒకేసారి అమ్ముకోవచ్చు

23 Nov, 2020 04:39 IST|Sakshi

నిబంధనలు సడలించిన ప్రభుత్వం  

ఒక్కో రైతు నుంచి 15 క్వింటాళ్ల కొనుగోలుకు ప్రయత్నాలు 

సాక్షి, అమరావతి: వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పత్తిని అమ్ముకోలేక బాధపడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రంతో సంబంధం లేకుండా నిబంధనలు సడలించింది. రైతులకు సమీపంలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిన్నింగ్‌ మిల్లులను ఎంపిక చేసింది. పత్తి పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా చూస్తోంది. దాదాపు ఐదులక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిబంధనల కారణంగా ఇప్పటివరకు 61 వేల క్వింటాళ్లనే కొనుగోలు చేశారు. పత్తిలో తేమ అధికశాతం ఉండటం, రంగు మారడం వల్ల రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న నిబంధనలను ఆసరాగా చేసుకుని తెలంగాణ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో ప్రభుత్వం నిబంధనలు సడలించింది.  

చకచకా ఫైర్‌ ఎన్‌వోసీలు 
కొనుగోలు కేంద్రాలుగా ఎంపిక చేసిన జిన్నింగ్‌ మిల్లులకు అగ్నిమాపకశాఖ అనుమతులు లేకపోవడంతో వాటిని ఖరారు చేయలేదు. అయితే రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఫైర్‌ ఎన్‌వోసి దరఖాస్తులు పరిశీలనలో ఉంటే.. వాటిని ఎంపిక చేస్తున్నారు.

పరిమితి పెంచేందుకు ప్రయత్నాలు 
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఏడు క్వింటాళ్లు, కొన్ని జిల్లాల్లో 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్ని ప్రభుత్వానికి వివరించి, ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 15 క్వింటాళ్లు కొనుగోలు చేయడానికి అనుమతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న చెప్పారు.  

నిబంధన ఎత్తివేత 
మండలానికి సగటు దిగుబడిని అంచనావేసి ఒక్కో రైతు వద్ద ఎకరాకు 7 నుంచి 11.87 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన అమలులో ఉంది. ఈ పంటను నవంబర్‌లో 25 శాతం, డిసెంబర్‌లో 50 శాతం, జనవరిలో 25 శాతం పత్తిని కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిబంధనను ఎత్తివేసి ఒకేసారి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు