పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే

5 Apr, 2022 09:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్‌ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్‌లైన్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది.

ఏపీఐఐసీని  పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్‌ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్‌ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 

14 సేవలకూ ఒకటే అప్లికేషన్‌
సింగిల్‌ విండో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు.  వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్‌లైన్‌లో ఒకే అప్లికేషన్‌ ఫామ్‌ నింపితే సరిపోతుందన్నారు.

పరిశ్రమ పేరు మార్చుకోవడం,  కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్‌ ఆఫ్‌ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్‌ లైన్‌ యాక్టివిటీ, ప్లాట్‌ పరిమితుల అనుమతులు, ప్లాట్‌ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్‌ డీడ్‌ ఎగ్జిక్యూషన్‌ , 5 ఎకరాలపైన సేల్‌ డీడ్‌ ఎగ్జిక్యూషన్‌ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు,  ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు.

(చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం)

మరిన్ని వార్తలు