Asha Khatri Success Story: బొల్లి వ్యాధి బయటకు రానివ్వకుండా కుంగదీసినా..కళ గెలిపించింది!

21 Sep, 2023 09:35 IST|Sakshi

స్కూలు అకడమిక్‌ పరీక్షల్లో కాస్త వెనకబడితేనే కుంగిపోతుంటారు. పిల్లలు. అలాంటిది పదేళ్ల వయసులో తన శరీరం మీద తెల్లని మచ్చలు  రావడం చూసిన ఆశా ఖత్రికి ఏమీ అర్థం కాలేదు. తన స్నేహితులు, చుట్టుపక్కల వారి శరీరం మీద అలాంటి మచ్చలు ఏవీ కనపడకపోవడంతో తను ఏదో ప్రత్యేకంగా ఉన్నట్లు భావించి.. అందరిలా తను లేదని చాలా బాధపడింది. తనకొచ్చిన బొల్లి మచ్చలు పోవడం లేదని తీవ్ర నిరాశకు లోనైంది. ఏది ప్రయత్నించినా తనకి ఎదురే వచ్చాయి. అయినా తన చిన్ననాటి అలవాటునే ఉజ్వల భవిష్యత్‌గా మార్చుకుని, సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమన్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ముఫ్పైరెండేళ్ల ఆశాఖత్రి.

రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌కు చెందిన ఆశా ఖత్రి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు మిగతా పిల్లల్లా కాకుండా ఒళ్లంతా తెల్లని మచ్చలతో కొంచెం అసాధారణంగా ఉండేది. తన రూపాన్ని చూసుకుని చిన్నారి ఆశా చాలా కుంగిపోయింది. అది గమనించిన తల్లిదండ్రులు, స్నేహితులు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతూ, వైద్యం చేయించేవారు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినప్పటికీ   పెద్ద మార్పు రాలేదు.

కుంగిపోయినప్పటికీ...
తన పరిస్థితి చూసుకుని ఎప్పుడూ బాధపడే ఆశ.. మందులు, హార్మోన్లలో మార్పుల వల్ల విపరీతమైన బరువు పెరిగిపోయింది. దీంతో సమాజంలో తిరగాలంటే చాలా బిడియంగా ఉండేది తనకు. అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా అందరూ తనని చూసేవారు. ఇంత బాధలోనూ ధైర్యం తెచ్చుకుని ఎం.ఏ., బీఈడీ. చేసింది. చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. సంవత్సరాలపాటు కష్టపడినప్పటికి కాలం కలిసిరాక ఉద్యోగం రాలేదు. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్లమీద తనే నిలబడాలనకునే ఆశ.. ఏదోఒకటి చేసి సంపాదించాలన్న కోరికతో రకరకాలుగా ప్రయత్నిస్తూ చివరికి క్రొచెట్‌ను ఎంచుకుంది. 

అలవాటునే సంపాదనగా...
క్రొచెట్‌ టాయిస్‌ను తయారు చేసే కళ ఒక తరం నుంచి మరోతరానికి బదిలీ అవుతుంటుంది. ఆశ చిన్నప్పుడు అల్లికలతో బొమ్మలు తయారుచేసే క్రొచెట్‌కళను తన అమ్మ, అమ్మమ్మల దగ్గర నేర్చుకుంది. వివిధ రకాల బొమ్మలు చేస్తుండేది. ఆ అలవాటే తన డెస్టినీ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అనేకప్రయత్నాలు విఫలం అయ్యి దిక్కుతోచని రోజులవి. అది 2021 నవంబర్‌. ఒకరోజు ఆశ...తన చుట్టాల పిల్లలు క్రొచెట్‌ టాయిస్‌తో ఆడడం చూసింది. క్రొచెట్‌ టాయిస్‌తో ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉండడం గమనించిన  ఆశ.. తను కూడా ఆ టాయిస్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చన్న ఆలోచన వచ్చింది.

అనుకున్న వెంటనే తనకు తెలిసిన క్రొచెట్‌ కళతో చిన్న ఆక్టోపస్‌ను తయారు చేసి అందరికి చూపించింది. అది చూసిన వారంతా చాలా బావుంది. క్యూట్‌గా ఉంది అని చెప్పడంతో.. మరికొన్ని టాయిస్‌ తయారు చేసి, ఎగ్జిబీషన్‌లో ప్రదర్శించింది. అక్కడ ఆ టాయిస్‌ను చూసిన వారంతా ఇష్టపడి కొనడం, ఆశకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తన బొమ్మలకు వస్తోన్న ఆదరణను చూసి మరిన్ని టాయిస్‌ను రూపొందించి చిన్నచిన్న ఎగ్జిబిషన్‌లలో విక్రయించేది. అక్కడ వచ్చిన స్పందనతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది.

తను తయారు చేసే టాయిస్‌ను ఇన్‌స్టాగ్రామ్, ఇంకా వెబ్‌సైట్‌ ఆశి. టాయిస్‌.స్టూడియో పేరిట విక్రయిస్తోంది. రెండువేలకుపైగా బొమ్మలు అమ్ముడయ్యాయి. ఆశ టాయిస్‌కు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ఇల్లు,ఆఫీసు అలంకరణకు వాడే వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. జైపూర్‌లో బాగా పాపులర్‌ అయిన ‘‘టాటూ కేఫ్‌’’ కు డ్రీమ్‌ క్యాచర్స్‌ను తయారు చేసి ఇవ్వడం విశేషం. ఒకపక్క బొల్లి, మరోపక్క అధిక బరువు ఉన్నప్పటికీ... తన టాలెంట్‌తో అందమైన క్రొచెట్‌ టాయిస్‌ను రూపొందిస్తూ కస్టమర్ల మనసులు గెలుచుకుంటోంది ఆశాఖత్రి. దారులన్నీ మూసుకు పోయినప్పటికీ... ఏదో ఒకదారి తెరిచే ఉటుంది. ఒపిగ్గా ఆ దారిని వెతికి పట్టుకుంటే బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమం అవుతుందనడానికి ఆశాఖత్రి ఉదాహరణగా నిలుస్తోంది.

(చదవండి: లాయర్‌ని కాస్త విధి ట్రక్‌ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..)
  

మరిన్ని వార్తలు