అనకాపల్లి, అల్లూరి జిల్లాల మీదుగా 10 కి.మీ. రహదారి నిర్మాణం

20 Jul, 2022 15:57 IST|Sakshi

3 నియోజకవర్గాలు.. 13 మండలాలు.. 30 గ్రామాలకు మహర్దశ 

గిరిజనులకు తీరనున్న డోలీ కష్టాలు.. కావిడి బరువులు

మాడుగుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవాపురం వరకు.. దట్టమైన అడవిలో నుంచి సాగే 10 కిలోమీటర్ల రహదారి.. 15 ఏళ్ల క్రితమే నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు లభించక మధ్యలోనే నిలిచిపోయింది. ఇన్నాళ్లకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. కాకులు దూరని కారడవిలో పొక్లెయిన్లతో జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. 

సాక్షి, అనకాపల్లి: అడవి బిడ్డలకు త్వరలో డోలి కష్టాలు తీరనున్నాయి. చదువు కోవాలని ఆశపడే విద్యార్థుల కలలు నెరవేరబోతున్నాయి. అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రగతి పరవళ్లు తొక్కబోతోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మాడుగుల నుంచి దేవాపురం వరకు కీలకమైన రహదారి నిర్మాణం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీడీఏ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి కొండలు, గుట్టల మీదుగా సాగుతుంది. పక్కా రోడ్డు వేయడం కష్టసాధ్యమే అయినా ఈ సత్సంకల్పాన్ని సుసాధ్యం చేయాలని అందరూ శ్రమిస్తున్నారు.  


వాణిజ్యంలో ప్రత్యేక గుర్తింపు 

మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు మధ్యనున్న మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయంటే దానికి కారణం సరైన రహదారి లేకపోవడమే. వందేళ్ల క్రితమే మాడుగుల వాణిజ్య రంగంలో గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పండించిన పిప్పలి, పసుపు, బత్తాయి, నారింజ, అరటి, చింతపండు, సపోట, మొక్కజొన్న, అనాస, సీతాఫలం, అలచందలు, తదితర పంటలు మాడుగుల చేరుకుంటాయి. ప్రాసెసింగ్‌ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఏడాదికి వందల టన్నుల్లో రవాణా జరుగుతుంది.

సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలతోపాటు నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 30 గ్రామాలు ఈనాటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయాయి. దేవాపురం, అయినాడ, సలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఈ గ్రామాలవారు నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దిగి మాడుగుల రావల్సి వచ్చేది. గిరిజనులు పండించిన పంటలను కావిళ్లతో, గంపలతో నడుచుకుంటూ తీసుకువస్తారు. రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత విద్యార్ధులను చదివించడానికి కూడా ఇష్టం చూపించరు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఆ గ్రామాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి.  
   
గతంలో సగంలోనే నిలిచిన రోడ్డు పనులు  
15 ఏళ్ల క్రితం మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖ అనుమతి లేకపోవడంతో అక్కడితో పనులు నిలిపోయాయి. చాలామంది రాజకీయ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాడుగుల–దేవాపురం రోడ్డుకు మోక్షం కలిగింది. గత ఎన్నికలకు ముందే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దానిని నెరవేరుస్తూ అటవీ శాఖ అడ్డంకులున్నా అధిగమించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం శరవేగంతో చేస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన 13 మండలాల్లో గల 30 గ్రామాల రైతులు, చిరు వ్యాపారస్తులు, ప్రజలు సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 


గిరిపుత్రులకు అండగా ప్రభుత్వం 

గిరిజనమంటే సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అమితమైన ప్రేమ. వారి అభివృద్ధికి, వారి గ్రామాలకు రోడ్డు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మాడుగుల నుంచి దేవాపురం వరకు రహదారి సౌకర్యం లేపోవడంతో గిరిజన గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో అటవీశాఖ అనుమతులు లభించాయి. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికే రహదారుల నిర్మాణం జరుగుతోంది.  
–బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం
 

రుణపడి ఉంటాం.. 

గత 30 ఏళ్లుగా దేవాపురం రోడ్డు కోసం పోరాడుతున్నాము. గతంలో మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖాధికారుల అనుమతులు లేకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇన్నళ్లకు మా కల నెరవేరుతోంది. రెండు జిల్లాల ప్రజలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు. 
– వేమవరపు వెంకటరమణ, మాడుగుల మాజీ సర్పంచ్‌


త్వరితగతిన నిర్మాణ పనులు 

ఇటీవల అటవీశాఖ అనుమతులు లభించాయి. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రూ.2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టాం. వర్షాలు లేకుండా ఉంటే నెల రోజుల్లో ఫార్మేషన్‌ పూర్తి చేస్తాం. మరో ఆరునెలలలోపు ఈ రోడ్డు అప్‌గ్రెడేషన్‌ కూడా పూర్తిచేస్తాం. ఇది పూర్తయితే రెండు జిల్లాల్లో గల 13 మండలాల్లో గల 30 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. 
– రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ పీఓ

మరిన్ని వార్తలు