తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా?

24 Nov, 2021 16:23 IST|Sakshi
ఏఎన్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేసీ సిరి  

సచివాలయ ఏఎన్‌ఎంపై జేసీ డాక్టర్‌ సిరి ఆగ్రహం 

కణేకల్లు: ‘ఏం తమాషా చేస్తున్నావా? డ్యూటీ అంటే లెక్క లేదా? పని చేయాలనుకుంటున్నావా? లేదా? డ్యూటీ పట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలా?’ అంటూ కణేకల్లు రెండో సచివాలయ ఏఎన్‌ఎం పర్థమ్మపై జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కణేకల్లు రెండో సచివాలయాన్ని జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల గురించి ఏఎన్‌ఎం పర్థమ్మతో ఆరా తీశారు. ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రికార్డులు పరిశీలించారు. అందులో ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వెంటనే డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరరావుకు ఫోన్‌ చేసి సచివాలయ ఏఎన్‌ఎంల పనితీరుపై పర్యవేక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.

చదవండి: బస్తాలు మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న పర్థమ్మకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన సరైన సమాధానాలు ఇవ్వని మహిళా పోలీస్‌పై మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఆమె హెచ్చరించారు. అనంతరం చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సర్పంచ్‌ నిర్మల, వైస్‌ సర్పంచ్‌ నబీషా, తహసీల్దార్‌ ఉషారాణి, ఎంపీడీఓ విజయభాస్కర్, ఈఓఆర్‌డీ గూడెన్న, ఈఓ చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

సేవలు మరింత విస్తృతం చేయండి.. 
బెళుగుప్ప: సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగులకు జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సూచించారు. బెళుగుప్ప మండలం హనిమరెడ్డిపల్లి సచివాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం కాలువపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకాన్ని పరిశీలించారు. పండ్ల తోటల పెంపకం వల్ల దీర్ఘకాలిక దిగుబడులు సాధించే అవకాశమున్నందున సన్న, చిన్న కారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ముస్తాఫాకమాల్‌ బాషా, ఏపీఓ కృష్ణమూర్తి, వీఆర్‌ఓ చంద్ర, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
చదవండి: దీక్ష చేస్తే కుటుంబాన్నే అవమానించారే బాబూ..!

మరిన్ని వార్తలు