పనికి ముందే రేటు.. కావాలనే లేటు! 

4 Jan, 2023 08:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వివాదమూ లేని భూములను కూడా వివాదంలో ఉంచేందుకు అవతలి పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఆన్‌లైన్‌లో రెడ్‌మార్క్‌ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ భూమిని అమ్మడానికి, కొనడానికీ ఉండదు. చిన్న చిన్న ఫైళ్లకు కూడా డబ్బు అడగడం, ఇవ్వకపోతే ఫైలును నెలల తరబడి  పెండింగులో పెట్టడం ఇక్కడ మామూలైంది.  

ముఖ్య అధికారి మామూళ్ల పర్వం 
తహసీల్దార్‌ కార్యాలయ ముఖ్య అధికారి ప్రతి పనికీ రేటు కట్టి యథేచ్ఛగా మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు జనన, మరణ ధృవీకరణ పత్రాలకూ లంచం తీసుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు అధికారి అవినీతి వైఖరి నచ్చక ఒక దశలో ఇక్కడ పనిచేస్తున్న వీఆర్‌ఓలు సమ్మెలోకి వెళ్లాలని అసోసియేషన్‌ వద్దకు వెళ్లినట్టు తెలిసింది.  తహసీల్దార్‌కు ఆర్డీఓ ఆఫీసులోని ఒక ఏఓ (అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌) సహకరిస్తున్నారని, ఇవన్నీ ఆర్డీఓకు తెలిసినా మిన్నకుండిపోతున్నారని సమాచారం. దాదాపు 7 లక్షల మందికి ఈ తహసీల్దార్‌ కార్యాలయమే దిక్కు. ఈ నేపథ్యంలో భూముల సమస్యలపై ఇక్కడకు వచ్చే వేలాదిమంది పరిస్థితి వేదనాభరితంగా మారింది.  

  • రాప్తాడు నియోజకవర్గం మన్నీల పరిధిలోని భూమి(సర్వే నెం.25–4)కి సంబంధించి ఆర్‌ఓఆర్‌ (రైట్స్‌ ఆఫ్‌ రికార్డ్స్‌)కు యజమాని దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి తిరిగినా అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు కనికరించలేదు సరికదా.. ఆయన భూమిని వేరే వారి పేరున ఉన్నట్టు హక్కు పత్రాలు రాశారు. డైక్లాట్‌లో తనపేరే ఉన్నా తహసీల్దార్‌ అవతలి వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇలా చేసినట్టు యజమాని ఆరోపిస్తున్నారు.  
  • అనంతపురం రూరల్‌ మండలం  నారాయణపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.93–2లోని 2.84 ఎకరాల భూమిని వివాదంలో (డిస్‌ప్యూట్‌ ల్యాండ్‌ కింద) పెట్టారు. ఎలాంటి ఆర్డరు గానీ, ఆర్డీఓ కోర్టు నుంచి ఆదేశాలు గానీ     లేకుండానే భారీగా డబ్బు తీసుకుని ఈ విధంగా చేసినట్టు తేలింది. నిజమైన హక్కుదారుడు మాత్రం బాధితుడిగా మిగిలిపోయాడు.  
  • సోములదొడ్డి గ్రామ పరిధిలోని సర్వే   నెం.212–1ఎ లోని 5.50 ఎకరాల భూమిని ఇటీవలే వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్‌ కిందకు బదిలీ చేశారు. దీనికి సంబంధించి  కిందిస్థాయిలో ఎలాంటి కన్వర్షన్‌ 
  • రిపోర్టు గానీ, అధికారుల సంతకాలు గానీ లేవు. నేరుగా తహసీల్దారే అన్నీ చేసేశారు. ఇందులో భారీగా డబ్బు చేతులు    మారినట్టు తెలిసింది. 

ఉపేక్షించేది లేదు.. 
ఆర్‌ఓఆర్‌లు, ల్యాండ్‌ కన్వర్షన్‌లకు డబ్బు అడిగితే ఉపేక్షించేది లేదు. హక్కుదారులకు న్యాయం చేయకుండా ఫిర్యాదులను బట్టి భూములను వివాదాల్లో పెట్టడం సరి కాదు. దీనిపై ప్రత్యేక విచారణ చేసి సంబంధిత       అధికారులపై చర్యలు తీసుకుంటాం. 
– కేతన్‌ గార్గ్, జాయింట్‌ కలెక్టర్‌    

(చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి)

మరిన్ని వార్తలు