రైతుల కోసం ప్రతిరోజూ ‘స్పందన’

25 Aug, 2021 02:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు మరో అడుగు ముందుకేసింది. సాగుతో పాటు.. సంక్షేమ ఫలాలు అందుకోవడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘రైతు స్పందన’ (ఫార్మర్స్‌ గ్రీవెన్స్‌) కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

వీటికి వచ్చే అర్జీదారుల్లో అత్యధికులు రైతులే ఉంటున్నారు. ఆర్‌బీకే సిబ్బంది స్పందన కార్యక్రమానికి విధిగా హాజరవ్వాల్సి ఉండటంతో ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఆర్‌బీకేలకు వచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఆర్‌బీకేల్లో రైతుల కోసం ప్రతిరోజు స్పందన నిర్వహించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించే స్పందనలో ఆర్‌బీకేల్లో పనిచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సంవర్థక, మత్స్య శాఖ సహాయకులు హాజరు కానున్నారు. ఈ సమయంలో సచివాలయాల్లో నిర్వహించే స్పందనకి వాటిలో పనిచేసే సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

ఆర్‌బీకేల్లోనే బయోమెట్రిక్‌ హాజరు
రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్‌బీకేలు ఏర్పాటు చేయగా, వాటిలో 234 అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 6,363 మంది వ్యవసాయ, 4,506 పశు సంవర్థక, 2,367 మంది ఉద్యాన, 375 మంది పట్టు, 738 మంది మత్స్య సహాయకులు విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ అసిస్టెంట్లు లేనిచోట 1,495 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. వీరంతా ఇప్పటివరకు సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సి వచ్చేది. ఉదయం పూట సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్‌ వేసి ఆ తర్వాత ఆర్‌బీకేలకు వచ్చి రైతులకు ఇన్‌పుట్స్‌ అందించి క్షేత్రాలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం సచివాలయాల్లో నిర్వహించే స్పందనకు హాజరవుతున్నారు. ఇక నుంచి వీరంతా పనివేళల్లో ఎప్పుడైనా సరే ఆర్‌బీకేల్లోని కియోస్క్, బయోమెట్రిక్‌ డివైస్‌లలో హాజరు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్‌బీకేలను సచివాలయాలకు ఎక్స్‌టెన్షన్‌ యూనిట్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రైతుల కోసం నియమించిన వీరిని రైతుల అవసరాల కోసం తప్ప మరే ఇతర విధులకు వినియోగించకూడదని స్పష్టం చేసింది. 

నాణ్యమైన సేవలందించేందుకే..
ఆర్‌బీకేల ద్వారా రైతులకు మరింత నాణ్యమైన సేవలందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఆర్‌బీకేల్లో ప్రతిరోజు స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. సిబ్బంది ఆర్‌బీకేల్లో బయోమెట్రిక్‌ వేస్తే చాలు. సిబ్బందిని ఇతర విధులకు వినియోగించకుండా ఆదేశాలు జారీ చేశాం.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ–సహకార శాఖ  

మరిన్ని వార్తలు