మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది! 

11 Aug, 2022 04:19 IST|Sakshi

సీపీఐ నేత నారాయణను ప్రశ్నించిన హైకోర్టు

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండపై పర్యాటక శాఖ చేపట్టిన రిసార్ట్‌ పునరుద్ధరణ పనులపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతుండగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను హైకోర్టు ప్రశ్నించింది. ఈ దశలో అక్కడికి వెళ్లాలంటే పునరుద్ధరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ అనుమతి తీసుకోవడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖ పోలీస్‌ కమిషనర్, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుషికొండ రిసార్ట్‌ ప్రాజెక్ట్‌ పునరుద్ధరణ పనుల పరిశీలన నిమిత్తం తాను అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఈ సందర్భంగా అడ్డంకులు సృష్టించకుండా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ కె.నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రాయ్‌ బుధవారం విచారణ జరిపారు. నారాయణ తరఫు న్యాయవాది జువ్వాది శరత్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. రిసార్ట్‌ పనులు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా? లేదా అన్న అంశంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఓ రాజకీయ పార్టీ నేతగా పిటిషనర్‌పై ఉందన్నారు.

పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రాంతం నిషిద్ధ ప్రదేశం కాదన్నారు. పర్యాటక శాఖ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పనులు జరుగుతున్న ప్రాంతం కాంట్రాక్టర్‌ నియంత్రణలో ఉందన్నారు. ప్రజాభద్రత దృష్ట్యా కాంట్రాక్టర్‌ ఆ ప్రాంతానికి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుత దశలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని నారాయణను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని  ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు