జస్టిస్‌ కనగరాజ్‌ నియామక ఉత్తర్వుల అమలు నిలిపివేత

17 Sep, 2021 03:08 IST|Sakshi

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు 4 వారాల పాటునిలుపుదల చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీ చైర్మన్‌లతో పాటు జస్టిస్‌ కనగరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చెల్లదంటూ న్యాయవాది పారా కిషోర్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. జస్టిస్‌ కనగరాజ్‌ వయసు 78 సంవత్సరాలని, చట్ట ప్రకారం చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి 65 సంవత్సరాలు వచ్చేవరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగేందుకు వీలుందని తెలిపారు. వయసురీత్యా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చట్ట నిబంధనలకు విరుద్దమని ఆయన వివరించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన ప్యానల్‌ నుంచి చైర్మన్‌ నియామకం జరగాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మానం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే వయసు రీత్యా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అందువల్ల ఆయన నియామక ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నామని స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు