దర్యాప్తు పురోగతి ఏంటో చెప్పండి

8 Feb, 2022 03:48 IST|Sakshi

న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసులో సీబీఐకి హైకోర్టు ఆదేశం

విచారణ 21కి వాయిదా

సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై నమోదైన కేసులో దర్యాప్తు పురోగతి ఎలా ఉందో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికీ దొరకని నిందితులు ఉంటే వారి ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో దర్యాప్తు పురోగతి నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ హైకోర్టులో గతేడాది పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం సోమవారం దాన్ని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. సీబీఐ ఇచ్చిన యూఆర్‌ఎల్స్‌ను తొలగించామన్నారు.

సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు స్పందిస్తూ.. తామిచ్చిన యూఆర్‌ఎల్స్‌ను ట్విట్టర్‌ తొలగించిందని తెలిపారు. దీంతో ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ స్పందన కోరగా ట్విట్టర్‌ ఆ పోస్టులను తొలగించిందని చెప్పారు. అన్ని వివరాలతో తదుపరి విచారణ నాటికి ఓ మెమో దాఖలు చేస్తానన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు