చింతామణి నిషేధం సవాలు వెనుక మీ ప్రయోజనాలేంటి? 

10 Feb, 2022 04:19 IST|Sakshi

పిటిషనర్‌ రఘురామకృష్ణరాజును ప్రశ్నించిన హైకోర్టు 

సాక్షి, అమరావతి: చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేయడం వెనుక మీ ప్రయోజనాలు ఏమున్నాయని పిటిషనర్‌ రఘురామకృష్ణరాజును హైకోర్టు ప్రశ్నించింది. ఓవర్గం జీవనోపాధి మరోవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని పేర్కొంది. అలా ఉంటే దానిపై తప్పక న్యాయసమీక్ష చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకరి చర్యలపై మరొకరు స్పందించేందుకు, వారి మనోభావాలను వ్యక్తం చేసేందుకు హక్కు ఉంటుందంది.

చింతామణి నాటకంపై నిషేధం విషయంలో ఆర్యవైశ్యుల వాదనలు కూడా వింటామని పేర్కొంది. శ్రీకాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం, నిత్యాన్నసత్రం కో ఆర్డినేటర్‌ గుబ్బా చంద్రశేఖర్‌ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించింది. ఇదే అంశంపై మరో 2 సంఘాలు దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లను తోసిపుచ్చింది. ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లు అవసరం లేదని, వీటిని అనుమతిస్తే మరికొన్ని దాఖలయ్యే అవకాశం ఉందని, ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని పేర్కొంది. దీంతో 2 సంఘాల తరఫు న్యాయవాదులు తమ ఇంప్లీడ్‌ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.

చింతామణి నిషేధం విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రశేఖర్‌ను కోర్టు ఆదేశించింది.  విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. నాటక కళాకారుడు త్రినాథ్‌ న్యాయవాది శ్రవణ్‌కుమార్‌.. తాము కూడా ఇదే అంశంపై రిట్‌ పిటిషన్‌ వేశామని కోర్టుకి చెప్పగా ఈ వ్యాజ్యంతో పాటు మిగిలిన వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.   

మరిన్ని వార్తలు