శ్రీశారదా పీఠంలో అరుణ పారాయణ

9 Feb, 2022 03:37 IST|Sakshi
అమ్మవారికి పూజలు చేస్తున్న స్వామీజీలు

రెండోరోజు ఘనంగా వార్షిక మహోత్సవాలు

సాక్షి, అమరావతి/పెందుర్తి: విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన మంగళవారం పీఠంలో రథసప్తమి వేడుకలు జరిగాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేదపండితులు ఆదిత్య భగవానుడిని ప్రార్థిస్తూ త్రిచ విధానంలో సూర్యనమస్కారాలు చేశారు.

అరుణ పారాయణ జరిగింది. పీఠంలోని 18 అడుగుల దాసాంజనేయస్వామికి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా విశేష అభిషేకాలు జరిపారు. దేశ రక్షణ కోసం చేపట్టిన రాజశ్యామల యాగం కొనసాగింది. వనదుర్గ హోమం, మన్యసూక్త హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణిమోహన్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, శిల్ప రవికిశోర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్‌ 
శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం పాల్గొంటారు. ఉదయం 10.15కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖకు బయలుదేరుతారు. 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 11.30కు శారదా పీఠంకు చేరుకుంటారు. అక్కడ జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొని మధ్యాహ్నం 1.25కు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుగుపయనమవుతారు. పీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననుండటం వరుసగా ఇది మూడోసారి. 

మరిన్ని వార్తలు