6 LIne Highway-AP And Telangana: ఏపీ, తెలంగాణ మధ్య మరో వారధి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే..

28 Jan, 2022 03:55 IST|Sakshi

కల్వకుర్తి–నంద్యాల మధ్య జాతీయ రహదారి నిర్మాణం

సిద్ధేశ్వరం–సోమశిల మధ్య కృష్ణా నదిపై కొత్త వంతెన

కర్నూలు జిల్లాలోని వరద ముంపు గ్రామాలకు రోడ్‌ కనెక్టివిటీ

రూ.1,200 కోట్లతో డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం

త్వరలో టెండర్లు.. రెండేళ్లలో పూర్తి

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్త జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. ఇందుకోసం కృష్ణా నదిపై వంతెన కూడా నిర్మాణం కానుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 

ఇదీ ప్రణాళిక..
► ఏపీ, తెలంగాణలను అనుసంధానిస్తూ 174 కి.మీ. మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–167కె)ను రూ.600 కోట్లతో నిర్మిస్తారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్‌ నుంచి ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల వరకు నిర్మించాలని నిర్ణయించారు. 
► ఏపీ పరిధిలో కర్నూలు జిల్లాలోని ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై బైపాస్‌ రోడ్లు నిర్మిస్తారు. 
► తెలంగాణ పరిధిలో కల్వకుర్తి, తాడూరు, నాగర్‌ కర్నూలు, కొల్లాపూర్‌లలో బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు. 
► అలాగే, ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై రూ.600 కోట్లతో ఓ వంతెననూ నిర్మిస్తారు. 
► కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కి.మీ. మేర ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది. 
► కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికార వర్గాలు తెలిపాయి. 

80కి.మీ. మేర తగ్గనున్న దూరం
ఈ వంతెన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి దోహదపడుతుంది. కర్నూలు జిల్లాలోని వరద ముంపు గ్రామాలకు రోడ్‌ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, పడిగ్యాల, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 35 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆ గ్రామాల ప్రజలు వరదల సమయంలో నదిలో ప్రయాణించాల్సిన అవసరం లేకుండా రోడ్‌ కనెక్టివిటీ ఏర్పడుతుంది. 
► మొత్తం మీద ఏపీ, తెలంగాణ మధ్య 80కి.మీ. మేర దూరం తగ్గుతుంది. ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే కర్నూలు, పెబ్బేరు, కొత్తకోట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. 
► ఈ వంతెన నిర్మిస్తే నంద్యాల నుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్‌ వెళ్లిపోవచ్చు. 
► తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. 

తండ్రి ఆశయం.. తనయుడి సాకారం 
2007లో నాటు పడవలో కృష్ణా నదిని దాటుతూ ప్రమాదానికి గురై 61మంది మరణించారు. దీంతో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల మధ్య నూతనంగా ఓ వంతెన నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్ణయించి 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన హఠాన్మరణంతో ఆ వంతెన నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం 2018లో ఒకట్రెండుసార్లు దానిపై చర్చించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కల్వకుర్తి–నంద్యాల రహదారిని ఎన్‌హెచ్‌–167కెగా ప్రకటించి కృష్ణా నదిపై వంతెనతో సహా ఆరులేన్లుగా రహదారి నిర్మాణానికి నిర్ణయించింది.   

మరిన్ని వార్తలు