‘నకిలీ చలానా’లపై ఏపీ సర్కార్‌ సీరియస్‌

14 Aug, 2021 03:34 IST|Sakshi

సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి

ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును రికవరీ చేయండి

మరోసారి ఇలాంటి అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టండి

రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు సీఎం ఆదేశాలు

దీంతో వెంటనే రంగంలోకి దిగిన రిజిస్ట్రేషన్ల శాఖ

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు

రూ.5.42 కోట్ల సొమ్ము పక్కదారి పట్టినట్లు లెక్కతేల్చిన అధికారులు

ఒక్క రోజులోనే రూ.1.37 కోట్లు రికవరీ

సాధ్యమైనంత త్వరగా మిగిలిన మొత్తం రికవరీకి చర్యలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. జరిగిన అవకతవకలపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో వెంటనే చర్యలు..
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో శుక్రవారం ముమ్మర తనిఖీలు చేసింది. మొదట కడప సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వెలుగుచూసిన ఈ నకిలీ చలానాల వ్యవహారం మరికొన్నిచోట్ల కూడా జరిగినట్టు సమాచారం అందడంతో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏడాది కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ పరిశీలించింది. డాక్యుమెంట్‌ విలువ ప్రకారం వాటికి చలానాలు కట్టారో, లేదో అధికారులు పరిశీలించారు. అనుమానం ఉన్న 20కిపైగా కార్యాలయాల్లో తనిఖీలు జరపగా 17 కార్యాలయాల్లో నకిలీ చలానాల వ్యవహారం బయటపడింది. శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. మిగిలిన జిల్లాల్లో ఎక్కడో ఒక చోట అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు. మొత్తంగా నకిలీ చలానాల ద్వారా ఇప్పటివరకు రూ.5.42 కోట్లు పక్కదారి పట్టిందని నిర్ధారించారు. కృష్ణా జిల్లా మండవల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అత్యధికంగా 282 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.2.31 కోట్లను పక్కదారి పట్టించినట్లు తేలింది. పటమట (విజయవాడ), గజపతినగరం, నర్సీపట్నం, ఆలమూరు, భీమవరం, ఆకివీడు, గునుపూడి, ఆచంట, పెనుగొండ, గాంధీనగర్‌ (విజయవాడ), గుణదల (విజయవాడ), నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు.

ఒక్క రోజులోనే రూ.1.37 కోట్లు రికవరీ
దారిమళ్లిన సొమ్మును రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తనిఖీల్లో రికవరీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే రూ.1.37 కోట్లను రికవరీ చేశారు. విజయనగరం డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.21.74 లక్షలు ఆదాయం కోల్పోగా మొత్తాన్ని రికవరీ చేశారు. విశాఖపట్నం జిల్లాలో రూ.5.19 లక్షలకు రూ.4.96 లక్షలు రాబట్టారు. ఏలూరు డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.9.59 లక్షలకు రూ.4.84 లక్షలు, విజయవాడ డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.3.80 కోట్లకు రూ.71 లక్షలు, కర్నూలు డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.7.39 లక్షలకు రూ.7.39 లక్షలు, కడప డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.1.08 కోట్లకు రూ.19.59 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ అక్రమాల పర్వానికి డాక్యుమెంట్‌ రైటర్లు ప్రధాన కారణమని తేల్చారు. వారితోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని కొందరు ఆపరేటర్లు, ఉద్యోగులు, ఒకటి, రెండు చోట్ల సబ్‌ రిజిస్ట్రార్ల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా.. తేడా ఉన్న చలానాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావని ఆ శాఖ విజయవాడ డీఐజీ రవీంద్రనాథ్‌ తెలిపారు. అవి చెల్లుబాటు కావాలంటే జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని ఆ డాక్యుమెంట్లు రిజిస్టర్‌ చేయించుకున్న యజమానులకు సూచించారు.

బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు
నకిలీ చలానాల ద్వారా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం మొత్తాన్ని తిరిగి రాబడతాం. ఇప్పటికే రూ.1.37 కోట్లు రికవరీ చేశాం. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నాం. అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలు చేపడతాం. అక్రమార్కులు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. డాక్యుమెంట్లు రిజిస్టర్‌ చేయించుకున్న యజమానులు ఎవరైనా తెలియక, పొరపాటున ఇందులో భాగస్వాములైతే తప్ప వారిని కూడా వదిలిపెట్టం. భవిష్యత్తులో చలానాల ద్వారా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఇప్పటికే మార్పులు చేశాం.
- ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్‌ అండ్‌ ఐజీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు