తప్పుడు కథనం ఆధారంగా ‘పిల్‌’ ఏమిటి?

19 Aug, 2020 04:16 IST|Sakshi

ట్యాపింగ్‌ ఆరోపణలపై ఆధారాలేమిటో అడగండి

ఈ వ్యాజ్యంలో ఆ పత్రికను ప్రతివాదిగా చేర్చండి

హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం

సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం..

ఆ అధికారి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఆదేశం.. విచారణ 20కి వాయిదా

ట్యాపింగ్‌కు సంబంధించి ఆంధ్రజ్యోతి కథనంలో ఎలాంటి ఆధారాలు చూపలేదు. ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందనేందుకు ఆధారాలు ఏమిటో ఆ పత్రికను అడగాలి. గాలి పోగేసి రాసిన వార్తా కథనం ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ఆ పత్రికను ప్రతివాదిగా చేర్చి తీరాలి. అప్పుడే వాస్తవాలు, కుట్ర బయటకు వస్తాయి. ఆ కథనానికి ఆధారాలు ఏమిటో చూపించాల్సిన బాధ్యత ఆ పత్రికపై ఉంది.
– అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి

సాక్షి, అమరావతి: న్యాయమూర్తుల ఫోన్లను తాము ట్యాపింగ్‌ చేస్తున్నామంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన తప్పుడు కథనం ఆధారంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందనడానికి ఆ కథనంలో ఎలాంటి రుజువులు చూపలేదని హైకోర్టుకు నివేదించింది. తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్లుతున్న ఆ పత్రికను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చి తీరాలని పట్టుబట్టింది. ట్యాపింగ్‌ విషయంలో ఆ పత్రికను వివరణ కోరడంతో పాటు ఆధారాలు చూపేలా ఆదేశించాలని కోరింది. ఆధారాలు లేకుండా కథనం రాసి, దాని ఆధారంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించడం న్యాయసమ్మతం కాదని పేర్కొంది.

అయితే ఆ పత్రికను ప్రతివాదిగా చేయబోమని తొలుత చెప్పిన హైకోర్టు, ఆ తరువాత సందర్భాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. న్యాయమూర్తులపై నిఘాకు ప్రత్యేకంగా ఓ ఐపీఎస్‌ అధికారి నియమితులయ్యారని పిటిషనర్‌ ఆరోపించిన నేపథ్యంలో ఆయన పేరుతో సహా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ దొనాడి రమేష్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

► న్యాయమూర్తుల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని  ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన నిమ్మి గ్రేస్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. రాజకీయ పెద్దల ప్రోత్సాహంతో ఫోన్లను పోలీసులు ట్యాపింగ్‌ చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిశ్రవణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పత్రికా కథనం ఆధారంగా పిల్‌ ఎలా వేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా.. గతంలో వాటిని కోర్టులు పరిగణనలోకి తీసుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. 

న్యాయమూర్తులే చెప్పారన్నట్లుగా...
► హోంశాఖ కార్యదర్శి తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఆ కథనం న్యాయమూర్తి స్వయంగాట్యాపింగ్‌ గురించి  చెప్పినట్లుగా ఉందన్నారు. తనకు తెలిసినంత వరకు న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడరని, ఆ పత్రిక మాత్రం వారే చెప్పారన్నట్లుగా కథనం ప్రచురించడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఆ కథనం కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. 

ఆధారాలేమిటో అడగండి..
► ట్యాపింగ్‌కు సంబంధించి ఆ కథనంలో ఎలాంటి ఆధారాలు చూపలేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డి నివేదించారు. 
► ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందనేందుకు ఆధారాలు ఏమిటో ఆ పత్రికను అడగాలని, ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పట్టుబట్టారు. గాలి పోగేసి రాసిన వార్తా కథనం ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ఆ పత్రికను ప్రతివాదిగా చేర్చి తీరాలని, అప్పుడే వాస్తవాలు, కుట్ర బయటకు వస్తాయని ఏఏజీ పేర్కొన్నారు. ఏ దర్యాప్తునకు ఆదేశించినా తమకు ఇబ్బంది లేదని, ఆ కథనానికి ఆధారాలు ఏమిటో చూపించాల్సిన బాధ్యత ఆ పత్రికపై ఉందన్నారు. 

మరిన్ని వార్తలు