మైనార్టీలకు సంక్షేమ నజరానా

23 Nov, 2020 21:33 IST|Sakshi

17 నెలల్లో సాయంగా రూ.3,428 కోట్లు

వివిధ పథకాలపై ముస్లిం మైనార్టీల్లో హర్షం

సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా రూ.3,428 కోట్ల మేర లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే మైనార్టీలకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. ఇంత భారీ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయూత అందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

నేరుగా నగదు బదిలీ...
అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, సున్నా వడ్డీ, పెన్షన్‌ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, వైఎస్సార్‌ ఆసరా, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2,585 కోట్లు ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ పథకాల ద్వారా కూడా ఆదుకుంటోంది. త్వరలో ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాలు, మరికొన్ని పథకాల ద్వారా రూ.843 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. తద్వారా 17 నెలల వ్యవధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనారిటీలకు రూ.3,428 కోట్ల మేర లబ్ధి కలగనుంది. 

మదర్సాల్లోనూ మధ్యాహ్న భోజనం
రాష్ట్రంలోని 900 మదర్సాలలో చదువుతున్న 33 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. మదర్సాలకు కూడా అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలు అమలవుతున్నాయి. 

వక్ఫ్‌ ఆస్తులపై రీ సర్వేలు
వక్ఫ్‌బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేసి ఆస్తులు కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో విడత సర్వే ద్వారా ఇప్పటికే దాదాపుగా ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చింది. ప్రత్యేకించి సర్వే కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రీ సర్వే జరుగుతోంది.

హజ్‌ యాత్రికులకు సాయం పెంపు
హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, అంతకు మించి 
ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది.

ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం
ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్‌లకు రూ.3 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. ఇటీవలే వారికి బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించింది. మరోవైపు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంచిన మొత్తం త్వరలోనే అమలులోకి రానుంది.  

టీడీపీ పాలనలో....
టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు అందించిన సాయం వేళ్ల మీద లెక్కించవచ్చు. మొత్తం 5 ఏళ్లలో కలిపి ఇచ్చింది కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే. ఇవి అప్పటి ప్రభుత్వ లెక్కలు కాగా సాయం లబ్ధిదారుల చేతికందేలోపు జన్మభూమి కమిటీలు, దళారులు కాజేసింది పోగా లబ్ధిదారులకు అందింది చాలా స్వల్పమే. 

ఒక కుటుంబంలో మూడు పథకాలు..
‘నా భర్తకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా సాయం అందుతోంది. నా మనవరాలికి జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. నాకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 అందాయి. గతంలో మాకు ఎప్పుడూ ఇలా సాయం అందలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా’
- షేక్‌ హసన్‌బీ, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా. 

చదివిస్తూ డబ్బులివ్వడం గొప్ప పని...
‘చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చదువులకు డబ్బులు ఇవ్వడం గొప్ప పని. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు. ప్రభుత్వం 1వ తరగతి నుంచే పిల్లల చదువుల కోసం డబ్బులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు, బట్టలు, చెప్పులు కూడా సమకూరుస్తోంది. మూడో తరగతి చదువుతున్న నా కూతురు పేరుతో అమ్మ ఒడి డబ్బులు అందాయి. వైఎస్సార్‌ ఆసరా ద్వారా మా అప్పులను కూడా ప్రభుత్వం తీరుస్తోంది’
- ఎస్‌కే సబియా, వన్‌టౌన్‌, విజయవాడ  

చెప్పినట్లుగా సాయం చేస్తున్నారు..
‘వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.18,750 అందాయి. వైఎస్సార్‌ ఆసరా తొలి విడత సాయాన్ని సెప్టెంబరులో అందించారు. నాలుగు విడతల్లో మొత్తం రుణం తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? చెప్పినట్లు సాయం చేసిన ముఖ్యమంత్రి జగనన్న ఒక్కరే’ 
- షేక్‌ కరీమున్నీసా, వన్‌టౌన్‌, విజయవాడ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా