Omicron alert: ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తోంది.. విస్మరించొద్దు: ఆరోగ్య శాఖ హెచ్చరిక

3 Jan, 2022 08:55 IST|Sakshi
ఇలా అయితే కష్టం.. బీసెంట్‌ రోడ్డులో కనిపించని కరోనా నిబంధనలు

‘ఒమిక్రాన్‌’పై అప్రమత్తత అవసరం  

కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి 

నిర్లక్ష్యంగా ఉంటే తప్పదు భారీ మూల్యం 

ఒమిక్రాన్‌ అప్రమత్తతపై ఆరోగ్య శాఖ హెచ్చరికలు 

శరవేగంగా వ్యాక్సినేషన్‌ 

లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా వీడిపోలేదు.. కొత్త రూపాల్లో కంగారెత్తిస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మన దేశం, రాష్ట్రంలో కూడా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు నమోదవతున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం ఒకింత ఉదాసీనత కనిపిస్తోంది. పండుగ సీజన్‌ కావడంతో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. మాస్క్‌ లేకుండా రోడ్లపై తిరిగేస్తున్నారు.. శానిటైజర్‌ వాడటం మానేశారు.. షాపింగ్‌ మాల్స్, దుకాణాల్లో గుంపులుగుంపులుగా ఉంటూ కొనుగోళ్లు చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా రద్దీ తీవ్రంగా కనిపిస్తోంది. వైరస్‌కు ఇదే అదునుగా మారి, విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కేసులు తగ్గుముఖం.. 
జిల్లాలో ప్రస్తుతం కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 10 నుంచి 20 వరకూ పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, యాక్టివ్‌ కేసులు సైతం 200 కంటే తక్కువగానే ఉన్నాయి. ఒక్కో రోజు జీరో మరణాలు కూడా నమోదవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం కోవిడ్‌ అడ్మిషన్స్‌ బాగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 10 మంది మాత్రమే కోవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగాలంటే, అది మన చేతుల్లోనే ఉందని వైద్యులు చెబుతున్నారు.  

ఉప్పెనలా వచ్చే అవకాశం.. 
గత ఏడాది మే నెలలో డెల్టా వేరియంట్‌ ఉగ్రరూపం దాల్చడం చూశాం. వేలాది మంది దాని బారిన పడి, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే 30 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా జిల్లాలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కానప్పటికీ, పొరుగు జిల్లాలో కేసులున్నాయి. అమెరికాలో ప్రస్తుతం వేరియంట్‌ విజృంభిస్తోంది. ఉత్తర భారతదేశంలో సైతం రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. పండుగ సీజన్‌లు ముగిసిన తర్వాత మనకు కూడా రావచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్‌ తీవ్రత ఎలా ఉన్నా, వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  

జాగ్రత్తలు తప్పని సరిగా.. 
కోవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కును ధరించాలని, చేతులకు తరచూ శానిటైజర్‌ రాసుకుంటూ, భౌతిక దూరం పాటించాలంటున్నారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.  

టీకా తీసుకోవాలి..  
ప్రస్తుతం జిల్లాలో వయస్సు 18 ఏళ్లు నిండిన వారందరికీ మొదటి డోస్‌ కరోనా టీకాలు వేయడం పూర్తి చేశారు. రెండో డోసు సైతం దాదాపు 78 శాతం పూర్తయ్యింది. మిగలిన వారికి సైతం టీకాలు వేయడంతో పాటు, ప్రస్తుతం 15–18 ఏళ్ల మధ్య వయస్సు వారికి సోమవారం నుంచి ఐదు రోజుల పాటు టీకాలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో టీకాలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు హెల్త్‌కేర్‌ వర్కర్స్, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషన్‌ డోస్‌ టీకా వేయనున్నారు.  

అప్రమత్తంగా ఉందాం.. 
ఒమిక్రాన్‌ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పాజిటివ్‌ కేసుల ట్రేసింగ్‌తో పాటు.. వారి ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్‌లను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నాం. ప్రజలు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కు ధరించడం, శానిటైజర్‌ వాడటం, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమైన అంశాలు. 
– డాక్టర్‌ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌ఓ

చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’

మరిన్ని వార్తలు