రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యంపై తదుపరి చర్యలన్నీ నిలిపివేత

26 Aug, 2020 03:51 IST|Sakshi

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, అమరావతి: విజయవాడ రమేష్‌ ఆస్పత్రికి చెందిన ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేశ్‌బాబు, చైర్మన్‌ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ దొనాడి రమేష్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

► రమేష్‌బాబు, సీతారామ్మోహన్‌రావులపై కఠిన చర్యలేవీ తీసుకోబోమని చెబితే కేసు పూర్వాపరాల్లోకి వెళ్లబోమని, లేని పక్షంలో ఈ ఘటనకు జిల్లా కలెక్టర్, మిగిలిన అధికారులను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి ప్రతిపాదించారు.  
► అధికారులను నిందితులుగా చేయకుండా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో రమేష్‌ ఆస్పత్రి కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందన్నారు.  
► అంతకుముందు పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని చెప్పారు.  
► స్వర్ణ ప్యాలెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అందులో సౌకర్యాలు, లోపాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆస్పత్రి యాజమాన్యంపైనే ఉందని తెలిపారు.  
► కోవిడ్‌ కేంద్రానికి అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతరపత్రం లేదన్నారు. ఈ విషయం తెలిసి కూడా ఆ హోటల్‌తో ఆస్పత్రి ఒప్పందం చేసుకుందని చెప్పారు.  
► దర్యాప్తు పూర్తిస్థాయిలో జరుగుతోందని, పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయన్నారు. 
► కాగా, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు