AP High Court: ఎంపీగా ఉండి కోర్టుకు రావడమేంటి? రఘురామకు హైకోర్టు చీవాట్లు

7 May, 2022 03:07 IST|Sakshi

సమస్యలుంటే పార్లమెంట్‌లో ప్రస్తావించాలి

ఆర్థిక వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు

అవి పూర్తిగా ప్రభుత్వం పరిధిలోవి ప్రభుత్వాలను కోర్టులు నడపజాలవు

ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై మీకెందుకు ఆందోళన?

 తేడాలుంటే కాగ్, అకౌంటెంట్‌ జనరల్‌ చూసుకుంటారు

రుణాలు పొందకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చే ప్రసక్తే లేదు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్‌ చేయడమే పనిగా పెట్టుకున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా న్యాయస్థానానికి రావడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే ప్రజలు ఆయన్ను పార్లమెంట్‌కు పంపారని వ్యాఖ్యానించింది. ఆర్థికపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని హైకోర్టు తేల్చి చెప్పింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది.

ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు నడపవని పేర్కొంది. ఈ వ్యాజ్యంపై పూర్తి స్థాయిలో తీరిగ్గా విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూన్‌ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ (విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల రెండు చట్టాలను తేవటాన్ని సవాలు చేస్తూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఆర్థికపరమైన వ్యవహారాలు, నిర్వహణ తదితరాలన్నీ పూర్తిగా ప్రభుత్వ విచక్షణకు సంబంధించినవని స్పష్టం చేసింది.

జోక్యం చేసుకోం..
రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. కొత్త సవరణ చట్టాల ద్వారా సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఆదాయంగా చూపి రుణాలను పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఇంతకీ పిటిషనర్‌ ఎవరని ప్రశ్నించింది. పిటిషనర్‌ పార్లమెంట్‌ సభ్యుడని సుధాకరరావు నివేదించడంతో సమస్యలుంటే పార్లమెంట్‌లో ప్రస్తావించాలేగానీ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్థికపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని తేల్చి చెప్పింది. అందులోనూ లిక్కర్‌కు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని, అలా జోక్యం చేసుకోవడం న్యాయస్థానాలకు హానికరమని, అందువల్ల లిక్కర్‌కు దూరంగా ఉండాలంటూ ధర్మాసనం చమత్కరించింది. ఆర్థికపరమైన వ్యవహారాల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని తెలిపింది. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మద్యం అమ్మకం ద్వారా పన్నుల రూపంలో వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ఆదాయంగా చూపుతోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సుధాకరరావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆ మొత్తాలను ఆదాయంగా చూపడానికి వీల్లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఈ వ్యాజ్యంపై వేసవి సెలవుల తరువాత తీరికగా వింటామని తెలిపింది.

ఆందోళన అవసరం లేదు...
రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ న్యాయవాది కోరగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సుధాకరరావు పేర్కొనడంతో.. ఆర్థిక పరిస్థితి గురించి కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) చూసుకుంటారని, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. 

ప్రభుత్వాలను కోర్టులు నడపవు...
ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది కాబట్టే న్యాయస్థానాల జోక్యం కోరుతున్నామని సుధాకరరావు పేర్కొనగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపవని ధర్మాసనం  వ్యాఖ్యానించింది. అలాగే న్యాయస్థానాలను ప్రభుత్వాలు నడపవని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం తదుపరి విచారణను జూన్‌ 15కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు