పాపం.. ఓటు వేయడం మరిచిన స్వతంత్రులు

16 Mar, 2021 08:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

9, 46 డివిజన్ల స్వతంత్రులకి ‘0’ ఓట్లు

ఒకే ఒక్కటి దక్కింది ముగ్గురికి 

రెండే ఓట్లతో సరిపెట్టుకున్న ఇద్దరు  

10 లోపు తెచ్చుకున్న వారు  35 మంది..  

వీరిలో 24 మంది మగువలే.. 

సాక్షి, అమరావతి బ్యూరో:  తాజాగా జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశా యి. ఈ ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటంటే ఒక్క ఓటూ పడలేదు. అంటే వారి ఓటు కూడా వారు వేసుకోలేదన్న మాట! నగరంలోని 9వ డివిజన్‌లో బొల్లినేని లక్ష్మీ సంధ్య, 46వ డివిజన్‌లో దిల్‌ షాద్‌ బేగంలు ‘0’ ఓట్లు సాధించిన ఘనతను చాటుకున్నారు. అలాగే 9వ డివిజన్‌లోనే కన్నా లక్ష్మి, 59వ డివిజన్‌లో ఎండీ వహీదా పర్వీన్, 60వ డివిజన్‌లో ఎండీ నజీమాలకు ఒక్కొక్క ఓటు మాత్రమే పోలయ్యాయి. రెండేసి ఓట్లు తెచ్చుకున్న వారిలో 60వ డివిజన్‌లో ఎం. మాధవి, 31వ డివిజన్‌లో కె.విజయశ్రీలు ఉన్నారు. ఇక 20వ వార్డులో జె.బాలాజీ, 40వ డివిజన్‌లో సీహెచ్‌. రామునాయుడులు మూడేసి ఓట్లు లభించాయి.

ఇలా నాలుగు ఓట్లు తెచ్చుకున్న వారు ఐదుగురు, ఐదుఓట్లు లభించిన వారు ఏడుగురు, ఆరు ఓట్లు వచ్చిన వారు ఒక రు, ఏడు ఓట్లు పోలైన వారు ఆరుగురు, ఎనిమిది ఓట్లు దక్కిన వారు ఐదుగురు, తొమ్మిది ఓట్లు పొందిన వారు ఒకరు, పది ఓట్లు వచ్చిన వారు ఒకరు చొప్పున ఉన్నారు. ఇలా విజయవాడ నగరపాలకసంస్థలో వివిధ డివిజన్లలో పది లోపు ఓట్లను పొందిన స్వతంత్ర అభ్యర్థులు 35 మంది ఉన్నారు. వీరిలో 24 మంది మహిళా అభ్యర్థులే కావడం విశేషం! 

ఇదీ సంగతి..! 
కొందరు అభ్యర్థులు అత్యల్పంగా ఓట్లు తెచ్చుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు డమ్మీ అభ్యర్థులతోనూ వేయిస్తారు. ఉపసంహరణ సమయంలో డమ్మీ అభ్యర్థులు బరి నుంచి తప్పిస్తారు. దీంతో బరిలో అసలు అభ్యర్థులే మిగులుతారు. అయితే కొంతమంది ప్రధాన అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లుగాను, బూత్‌ ఏజెంట్లుగాను పనికొస్తారన్న ఉద్దేశంతో వారిని కొనసాగిస్తారు. ఇలాంటి వారిని నిబంధనల ప్రకారం అధికారులు స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. వీరు తమ ఓటును కూడా తమకు వేసుకోరు. దీంతో వీరికి ‘0’ ఓట్లు పడినట్టు రికార్డుల్లోకి ఎక్కుతారు.  

ఒకవేళ ఎవరైనా పొరపాటున వేస్తే మాత్రం స్వల్ప ఓట్లు వీరి ఖాతాలో జమ అవుతాయ. అయితే మరికొంతమంది ఉద్దేశపూర్వకంగానే నామినేషన్లు దాఖలు చేస్తారు. ఫలానా ఎన్నికల్లో పోటీ చేశాను.. అని చెప్పుకోవడానికి అలా వేస్తుంటారు. అలాంటి వారు ఎన్నికల్లో ప్రచారం కూడా  చేయరు. తనకు ఓటేయమని జనంలోకి వెళ్లి అడగరు. వీరికి తన ఓటుతో పాటు తమ కుటుంబ సభ్యుల, స్నేహితుల ఓట్లు నామమాత్రంగా పడతాయి. చర్చకు దారితీస్తాయి.   

చదవండి:
ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు..

మరిన్ని వార్తలు