రోడ్లపై ‘రైల్వే’ బ్రేకులకు సెలవు

21 Jun, 2021 09:37 IST|Sakshi

రైల్వే గేట్ల వద్ద నిరీక్షణ లేకుండా రాష్ట్రంలో కొత్తగా 8 ఆర్వోబీలు

40, 42, 71, 165వ నంబర్‌ జాతీయ రహదారులపై నిర్మాణం

రూ. 616 కోట్ల వ్యయం

జాతీయ రహదారుల శాఖ ఆమోదం

ఆర్థిక ఏడాదిలోనే నిర్మాణం పూర్తి

కార్యాచరణ సిద్ధం చేసిన ఆర్‌ అండ్‌ బీ శాఖ 

సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై ఎక్కడా ‘రైల్వే’ బ్రేకులు పడకుండా ప్రయాణం సాఫీగా సాగడానికి మార్గం సుగమమయ్యింది. రోడ్డు ప్రయాణంలో రైల్వే గేట్ల వద్ద నిరీక్షణకు ఇక ముగింపు పడనుంది. రాష్ట్రంలో వాహనాల రద్దీ అధికంగా ఉండే నాలుగు జాతీయ రహదారులపై కొత్తగా ఎనిమిది ‘రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌’(ఆర్వోబీ)లు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో రూ. 616 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఈ ఆర్వోబీల నిర్మాణం కోసం కొన్ని చోట్ల భూ సేకరణ ప్రక్రియ పూర్తవగా, మరికొన్ని చోట్ల వేగంగా కొనసాగుతోంది. ఆర్‌ అండ్‌ బీ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేస్తున్నారు. మరికొన్నిటికి డీపీఆర్‌ తయారీ కోసం కన్సల్టెన్సీలను నియమించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటన్నిటినీ నిర్మించేందుకు ఆర్‌ అండ్‌ బీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.

కొత్తగా నిర్మించనున్న ఆర్వోబీల వివరాలు...

  1. అనంతపురం– కృష్ణగిరి (తమిళనాడు) మధ్య 42వ నంబర్‌ జాతీయ రహదారిపై ముదిగుబ్బ (అనంతపురం జిల్లా) లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రూ. 70 కోట్లతో ఆర్వోబీని నిర్మిస్తారు. ఇదే జాతీయ రహదారిపైనే కదిరి పట్టణంలో లెవల్‌ క్రాసింగ్‌ వద్ద మరో ఆర్వోబీని రూ. 70 కోట్లతో నిర్మిస్తారు. వీటికోసం భూ సేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
  2. చిత్తూరు– కడప మధ్య 40వ నంబర్‌ జాతీయ రహదారిపై పీలేరు లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రూ. 70 కోట్లతో నిర్మించనున్న ఆర్వోబీ కోసం ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది.
  3. మదనపల్లి–నాయుడుపేట మధ్య 71వ నంబర్‌ జాతీయ రహదారిపై చిన్న తిప్ప సముద్రం వద్ద రూ. 70 కోట్లతో, పీలేరు సమీపంలో రూ. 90 కోట్లతో, నాయుడుపేట సమీపంలోని పండ్లూరు వద్ద రూ. 50 కోట్లతో ఆర్వోబీలను నిర్మించనున్నారు. వీటి కోసం భూసేకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది.
  4. గుడివాడ– మచిలీపట్నం మధ్య 165వ నంబర్‌ జాతీయ రహదారిపై గుడివాడ సమీపంలో పాత వంతెన స్థానంలో రూ. 73 కోట్లతో కొత్త ఆర్వోబీ నిర్మిస్తారు. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. డీపీఆర్‌ తయారీ కోసం ఓ కన్సల్టెన్సీని నియమించారు. 
  5. విజయవాడ– భీమవరం మధ్య 165వ నంబర్‌ జాతీయ రహదారిపై మొంతూరు సమీపంలో పాత వంతెన స్థానంలో రూ. 123 కోట్లతో కొత్త ఆర్వోబీని నిర్మిస్తారు. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. డీపీఆర్‌ తయారీ బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. 
     
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు