పంచాయితీ బరిలో అక్కా, చెల్లెళ్ల ఢీ

8 Feb, 2021 08:32 IST|Sakshi
ఈదర రాజకుమారి,  ఈదర సౌందర్య 

సాక్షి, కారంచేడు(ప్రకాశం) : ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. అక్కడే ఇద్దరూ ఇంటర్‌ వరకు చదువుకున్నారు. అదే ఊరికి చెందిన ఒకే ఇంటి పేరున్న వారిని వివాహమాడారు. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్‌ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది.

దీంతో గ్రామంలోని ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో ఉంచితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బరిలోకి దించారు.  ఇంత వరకు ఇద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేకపోయినప్పటికీ. .ఇప్పుడు ఇద్దరు తమ, తమ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు.
చదవండి: ఓసారి ఊరొచ్చి పోప్పా.. కావాలంటే కారు పంపిస్తా!


బొడ్డు అంకయ్య,  బొడ్డు నరసింహం

అన్నదమ్ములే ప్రత్యర్థులు..
మిట్టపాలెం(కొండపి): ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్‌ స్థానానికి అన్నదమ్ములు పోటీపడుతున్నారు. గ్రామంలో 793 ఓట్లుండగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 380 దాకా ఉంటాయి. సర్పంచ్‌ స్థానం ఎస్సీకి రిజర్వ్‌ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్‌లు వేశారు. 

87 ఏళ్ల వయస్సులో పోటీ
మొగల్తూరు:  పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని శేరేపాలెం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు 1993లో వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001–2006 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. 87 ఏళ్ల వయస్సులోనూ మరోసారి సర్పంచ్‌గా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన భార్య లక్ష్మీదేవి 1995 నుంచి 2001 వరకు సర్పంచ్‌గా, 2001 నుంచి 2006 వరకు జెడ్‌పీటీసీ సభ్యురాలిగా చేశారు.

మరిన్ని వార్తలు