ప్రయాణికుల అవసరాలకే తొలి ప్రాధాన్యత: ఆర్టీసీ ఎండీ

4 May, 2022 18:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీకి ప్రజలు ముఖ్యమైన వారు. ఇటీవల కొన్ని పత్రికలు ఆర్టీసీపై దుష్రచారం చేస్తున్నాయి. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం కొత్తది కాదు. అద్దె బస్సులు 1979 నుంచి నడుపుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రస్తుతం 995 అద్దె బస్సులు నడుపుతున్నాం. కోవిడ్‌ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కొత్తవి కొనలేక అద్దెవి నడుపుతున్నాం. అద్దె బస్సులు కూడా పాతవి కాకుండా.. కొత్తవి, కండిషన్‌లో ఉన్నవి మాత్రమే వాడాలి. కొత్త బస్సులు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలి. అద్దె బస్సులు కూడా ఆర్టీసీ సూచించిన విధంగానే నడుపుతారు. 

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది అత్యంత అరుదైనది, చరిత్రాత్మకమైనది. కర్ణాటక, తెలంగాణలో ఆర్సీఈ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని అనేకమార్లు ధర్మాలు చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాలు స్పందించలేదు. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదు. ప్రభుత్వం ఉద్యోగులను తొలగిస్తూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయా పత్రికల్లో వచ్చిన  దుష్రచారాలను నమ్మొద్దు. ఇతర రాష్ట్రాలలో రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగుల సొమ్మును సైతం ఆయా రాష్ట్రాల్లో వాడుకుంటున్నారు. 

ప్రభుత్వంలో విలీనం తర్వాత 16,080 కోట్లు అప్పులు తీర్చాం. పీఎఫ్ బకాయిలు మొత్తం చెల్లించాం. సడెన్‌గా మెరుపు సమ్మెలు చేస్తారని కావాలనే హైయర్ బస్సుల పెనాల్టీలు పెంచాం. ప్రజలకు మంచి సేవలు అందాలనే ఇలా చేశాం. కోవిడ్ సమయంలో బస్సులు తిరగనప్పుడు ఇన్సూరెన్స్ ఎక్స్‌టెండ్‌ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో వేగంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నాం. 2,237 ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో దాతల సాయంతో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని' ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. 

మరిన్ని వార్తలు