పీపీఏ ధరలను సవరించే అధికారం ఈఆర్‌సీకి లేదు 

4 Feb, 2022 04:49 IST|Sakshi

హైకోర్టులో సౌరవిద్యుత్‌ కంపెనీల వాదన 

తదుపరి విచారణ7కి వాయిదా 

సాక్షి, అమరావతి: అత్యంత పారదర్శకంగా, చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) సమీక్షించి, వాటి ధరలను సవరించే అధికారం విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి లేదని సౌరవిద్యుత్‌ సంస్థల న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పీపీఏలను సమీక్షిస్తూ పోతుంటే పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లుతుందని, దీని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని పేర్కొన్నారు.

తాత్కాలిక ప్రాతిపదికన సౌరవిద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సౌరవిద్యుత్‌ సంస్థల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. పీపీఏల కింద ధరలను ఖరారు చేసేది ఈఆర్‌సీయేనని, ఆ సంస్థ ఖరారు చేసిన ధరలను తిరిగి ఆ సంస్థే సవరించడానికి అవకాశంలేదని చెప్పారు.

పీపీఏ నిబంధనల ప్రకారం ధరలను సవరించే అధికారం విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కం) లేదని, దీంతో అవి ఈఆర్‌సీ ముందు పిటిషన్‌ వేసి దాని ద్వారా ధరలను సవరించాలని చూస్తున్నాయని తెలిపారు. ఈ వాదనలను డిస్కంల తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ తోసిపుచ్చారు. ధరలను సవరించే అధికారం ఈఆర్‌సీకి ఉందన్నారు. అందుకే పీపీఏ ధరలను ఈఆర్‌సీ వద్దే తేల్చుకోవాలని సింగిల్‌ జడ్జి స్పష్టం చేశారని చెప్పారు. కోర్టు సమయం ముగియడంతో పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు