సీతమ్మకొండపై హర్‌ శిఖర్‌ తిరంగా

5 Sep, 2023 05:50 IST|Sakshi

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్మీ బృందం

సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్‌ శిఖర్‌ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ (నిమాస్‌) డైరెక్టర్‌ కల్నల్‌ రణవీర్‌సింగ్‌ జమ్వాల్‌ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది.

సర్పంచ్‌ పాంగి బేస్‌ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలి­కారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్‌ రణవీర్‌సింగ్‌ జమ్వాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీ­య జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు.

తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్‌ శిఖర్‌ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీత­మ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్‌ శిఖర్‌ తిరంగాను అక్టోబర్‌ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్‌ అధి­రోహకుడు ఆనంద్‌కుమార్, టూరిజం అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు