Atmakur: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్‌ స్మృతివనం

6 Sep, 2022 16:08 IST|Sakshi

రూ.2 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు

ఆరుబయలు మినీ ఆడిటోరియం ఏర్పాటు

వన్యప్రాణుల చిత్రాలతో రూపుదిద్దుకున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రం

ఆత్మకూరు రూరల్‌(కర్నూలు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం కొత్త అందాలను సంతరించుకుంది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌  ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్భుత పచ్చందాల పార్క్‌గా గుర్తింపు పొందింది. దశాబ్దం కిందట ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ థీమ్‌ ప్రాజెక్ట్‌ నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోలేక పోయింది. 2019లో వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో స్మృతి వనానికి మహర్దశ వచ్చింది. ఆరునెలల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్లు విడుదల చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆయా పనులన్నీ ప్రస్తుతం పూర్తి కావడంతో స్మృతివనం కొత్త సొబగులద్దుకుంది. 


ఆరుబయలు ఆడిటోరియం... పచ్చదనాల ల్యాండ్‌స్కేప్‌
 
చిన్నపాటి శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా స్మృతివనంలో పచ్చటి కార్పెట్‌ గ్రాస్‌తో పరుచుకున్న తిన్నెలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూర్చుని కార్యక్రమం తిలకించే విధంగా మినీ వేదిక ఏర్పాటు చేశారు. దీని వెనుక ఒక తెర కూడా ఉండడంతో ఏవైనా రికార్డు చేసిన వీడియోలు, సినిమాలు ప్రదర్శించుకోవచ్చు. అలాగే ఈ ల్యాండ్‌ స్కేప్‌ మధ్యలో రెండు గ్రానైట్‌ శిలా మండపాలు కూడా నిర్మించారు. అక్కడక్కడా గ్రానైట్‌తో ఏర్పాటైన అరుగులు పర్యాటకులు సేదతీరడానికి అనువుగా ఉన్నాయి. 


కనువిందుగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం 

పర్యావరణంపై పర్యాటకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్మృతివనంలో పర్యావరణ విజ్ఞానకేంద్రానికి శ్రీకారం చుట్టారు.  అయితే, నిధుల కొరతతో దశాబ్ద కాలంగా ఆగిపోయిన ఈ పనులు ఇటీవలే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు.


జీవకళలొలుకుతున్న పులిప్రతిమలు 

పర్యావరణ విజ్ఞాన కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన చిరుత పులుల ప్రతిమలు నిజం చిరుతలను చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. చెట్టుపై ఎక్కి కూర్చున్నట్లుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో సహజ వాతావరణంలో రాజసంగా నిలుచున్న పెద్దపులి ప్రతిమ వీక్షకులను సంభ్రమాశ్చ్యర్యాలకు గురి చేస్తోంది. అంతే కాకుండా విజ్ఞాన కేంద్రపు గోడలకు వేలాడదీసిన కొన్ని వన్యప్రాణుల చిత్రపటాలు చూడ ముచ్చటగొల్పుతున్నాయి. ఈ చిత్రపటాలన్నీ కూడా  చేయితిరిగిన చిత్రకారులతో గీయించ బడిన కళాఖండాలు కావడం విశేషం. పిల్లను మోస్తున్న ఎలుగుబంటి, బరక భూములపై పరుగెత్తుతున్న బట్టమేక పక్షి, గడ్డిమైదానంలో కూర్చున్న కణితి, గాల్లో ఎగిరిపోతున్న కృష్ణ జింకల సమూహం, హనీబాడ్జర్‌ల చిత్రపటాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.


రాతిపై జీవజాలం... 

వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో ఉన్న  పాదచర మార్గాలలో రాతి స్తంభాలపై పలు వన్యప్రాణులు, పక్షులు, సరీసృపాల శిల్పాలను చెక్కించి ఉంచారు. వీటికి సహజ వర్ణాలతో తీర్చిదిద్దడంతో ప్రత్యక్షంగా వాటిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అదే విధంగా అడవుల్లో ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలతో తీసిన వన్యప్రాణుల చిత్రాలను ఫ్లెక్సీలుగా తీర్చి దిద్ది పలుచోట్ల ఉంచారు. ఇవి కూడా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్‌: గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?)

మరిన్ని వార్తలు