అనకాపల్లి పుష్ప: గొంతు కోశాక ఆత్మహత్య చేసుకుంటుందేమోనని..

19 Apr, 2022 18:38 IST|Sakshi

అనకాపల్లి: పుష్ప అనే యువతి తనకు కాబోయే భర్త గొంతుకోసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు మంగళవారం సాయంత్రం.. మీడియాకు వెల్లడించారు. పెళ్లి ఇష్టంలేకనే కాబోయే భర్తపై దారుణానికి పాల్పడిందని డీఎస్పీ సునీల్ కేసు వివరాల్ని వెల్లడించారు.

రాము నాయుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడి వివాహం కోసం ఊరు వచ్చాడు. ఈ విషయం తెలిసి రామునాయుడికి పుష్ప ఫోన్‌ చేసి.. ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తా బయటకు రమ్మని పిలిచింది. పెద్దవాళ్ల అనుమతితో అమ్మాయి, అబ్బాయి స్కూటీపై వెళ్లారు. వడ్డాది వద్ద స్కూటీ ఆపిన యువతి గిఫ్ట్ కొంటానని షాపులోకి వెళ్లింది. షాపులో ఏం కొన్నావని రామునాయుడు అడిగితే, కత్తి కొనుకొచ్చిన పుష్ప ఏం మౌనంగా ఉండిపోయింది. అక్కడ్నించి ఆ అబ్బాయిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రమం వద్దకు తీసుకెళ్లింది. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తాను కళ్లు మూసుకోమని చెప్పింది.


మీడియాతో డీఎస్పీ సునీల్

సూసైడ్‌ చేసుకుంటుదేమోనని
అతడు సరిగా కళ్లు మూసుకోకపోవడంతో తన చున్నీ తీసి అతడి కళ్లకు గంతలు కట్టింది పుష్ప. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న చాకుతో అబ్బాయి గొంతు కోసి, పెళ్లి ఇష్టంలేకనే గొంతు కోసినట్టు రామునాయుడితో  చెప్పింది. అయితే, ఆమె ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందేమోనని ఆ యువకుడు భయపడ్డాడు. అందుకే గాయాన్ని, రక్తస్రావం లెక్కచేయకుండా ఆమెను వెంటపెట్టుకుని బయల్దేరాడు. గొంతు నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండడం గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారని డీఎస్పీ వెల్లడించారు.

కాగా, ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని ఆ యువతి చెప్పిందని, దైవ చింతనతో జీవితం గడపాలని ఆ యువతి భావిస్తోందని డీఎస్పీ తెలిపారు. ఓం శాంతి ఆశ్రమంలో గడపాలని ఆమె కోరుకుంటోందని చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంలో గడపడానికి పెద్దలు ఒప్పుకోరని భావించి కాబోయే భర్తపై దాడి చేసిందని తెలిపారు. యువతిపై సెక్షన్‌ 307 ప్రకారం.. హత్యాయత్నం కేసు నమోదు చేశామని, బుచ్చెయ్యపేట పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ సునీల్ చెప్పారు.

మరిన్ని వార్తలు