డిజిటల్‌ వైద్యసేవల్లో ఏపీకి అవార్డులు

27 Sep, 2022 05:40 IST|Sakshi
కేంద్రమంత్రి నుంచి అవార్డు అందుకుంటున్న నవీన్‌కుమార్‌

సాక్షి, అమరావతి: ప్రజలకు డిజిటల్‌ వైద్యసేవలు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు లభించాయి. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం–జేఏవై) నాలుగో, ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర వైద్యశాఖ నిర్వహిస్తున్న ఆరోగ్య మంథన్‌–2022 కార్యక్రమంలో సోమవారం కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక  కార్యదర్శి నవీన్‌కుమార్‌ ఈ అవార్డులను అందుకున్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్స్‌ (అభా)కు అత్యధికంగా ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసిన రాష్ట్రం, జిల్లాలు, 100 శాతం ఆస్పత్రులు ఈహెచ్‌ఆర్‌లో ఎన్‌రోల్‌మెంట్, ఉత్తమ ప్రభుత్వ ఆరోగ్య రికార్డు ఇంటిగ్రేటర్‌ విభాగాల్లో ఏపీ ఆరు అవార్డులు సాధించింది. దేశంలోనే అభాకు అత్యధిక ఆరోగ్య రికార్డులు అనుసంధానించిన విభాగంలో పార్వతీపురం మన్యం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి.

ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి నవీన్‌ మాట్లాడుతూ డిజిటల్‌ వైద్యసేవల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇందుకుగాను జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. తొలినుంచి ఏబీడీఎం కార్యకలాపాల్లో ఏపీ దూకుడుగా అడుగులు వేసిందన్నారు.

ఇప్పటివరకు కోటిమంది డిజిటల్‌ హెల్త్‌ ఖాతాలకు ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఈ ఘనత దేశంలో ఏపీకి మాత్రమే దక్కిందన్నారు. డిజిటల్‌ వైద్యసేవల్లో దేశంలోనే నంబర్‌–1గా ఏపీ రాణించడం వెనుక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కృషి విశేషమైనదని చెప్పారు.

3.4 కోట్లమందికి హెల్త్‌ ఐడీలు
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24.38 కోట్లమంది ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీలను సృష్టించారు. 3.4 కోట్లమందికి హెల్త్‌ ఐడీలు సృష్టించి ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. 2.6 కోట్ల హెల్త్‌ ఐడీలతో మధ్యప్రదేశ్, 1.99 కోట్ల హెల్త్‌ ఐడీలతో ఉత్తరప్రదేశ్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి.

రాష్ట్రంలో 3.4 కోట్ల మందికి ఐడీలు సృష్టించగా వీరిలో కోటిమందికిపైగా ఐడీలకు ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు. మరోవైపు రాష్ట్రంలో 13,335 ప్రభుత్వ ఆస్పత్రులు, వాటిల్లో పనిచేస్తున్న వైద్యులు 16,918 మందిని ఏబీడీఎంలో రిజిస్టర్‌ చేశారు. 

మరిన్ని వార్తలు